'చీకటి అవుతుంది.. వద్దు తమ్మి.. పొద్దున పోదువు' | Siddipeta Family Car Accident Well Tragic Death Incident | Sakshi
Sakshi News home page

'చీకటి అవుతుంది.. వద్దు తమ్మి.. పొద్దున పోదువు'

Aug 21 2026 11:48 AM | Updated on Aug 21 2026 1:07 PM

Siddipeta Family Car Accident Well Tragic Death Incident

వేడుకున్న మృతుడి అన్న రవి

 సాక్షి, సిద్దిపేట: “చీకటి అవుతోంది తమ్మీ.. ఈ రాత్రికి వెళ్లొద్దు.. పొద్దున్నే బయల్దేరు”.. అన్న చెప్పిన ఈ మాటలు ఇప్పుడు ఆ కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చాయి. తమ్ముడు మాత్రం “అన్నా.. నీ కాళ్లు మొక్కుతా.. నన్ను ఈ రాత్రే వెళ్లనివ్వు” అంటూ భార్య, పిల్లలతో కలిసి కారులో బయల్దేరాడు. కొన్ని గంటల్లోనే ఆ ప్రయాణం తిరిగిరాని ప్రయాణంగా మారింది. సిద్దిపేట జిల్లాలో జరిగిన ఈ విషాద ఘటన స్థానికులను కంటతడి పెట్టిస్తోంది.

బల్వంతపూర్‌కు చెందిన రాజు(35), భాగ్య(22) దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి గురువారం అర్ధరాత్రి కారులో ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు కారు బావిలో పడింది. ఈ ఘటనలో నలుగురూ ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రమాదం కంటే కూడా.. మృతుడు రాజు అన్న రవి చెబుతున్న మాటలు అక్కడున్న వారిని తీవ్రంగా కలచివేశాయి.

రవి తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేటలో వారి బావ దీశెట్టి మల్లేశం మృతి చెందడంతో 19న దశదిన కర్మకు రాజు తన భార్య, పిల్లలతో కలిసి అక్కడికి వచ్చాడు. కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేశారు. సాయంత్రం కావడంతో రాజు ఇంటికి బయల్దేరుతానని అన్నకు చెప్పాడు. దీంతో రవి.. “చీకటి అవుతుంది తమ్మీ.. వద్దు. పొద్దున్నే పోదువు” అంటూ వారించాడు. కానీ రాజు వినలేదు. “అన్నా.. నీ కాళ్లు మొక్కుతా.. నన్ను ఈ రాత్రే పోనివ్వు” అంటూ భార్య, పిల్లలతో కలిసి కారులో బయల్దేరాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే జరిగిన ప్రమాదం ఆ కుటుంబాన్ని శాశ్వత విషాదంలోకి నెట్టింది.

తమ్ముడిని కాపాడలేకపోయానన్న బాధతో రవి కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు అక్కడున్న వారిని కదిలించింది. “నా మాట విని ఉంటే తమ్ముడు ఇప్పుడు బతికుండేవాడు” అంటూ ఆయన రోదించడం చూసి స్థానికులు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒకవైపు తమ్ముడిని ఇంటికి వెళ్లొద్దని ఆపిన అన్న.. మరోవైపు కుటుంబంతో కలిసి ఎలాగైనా ఇంటికి చేరుకోవాలన్న తమ్ముడి ఆరాటం.. చివరికి నాలుగు ప్రాణాలను బలిగొన్న విషాదంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement