వాషింగ్టన్: ఇంట్లో కోట్ల విలువైన బంగారు కడ్డీలు.. ఖరీదైన కార్లు, వాచ్‌లు, విలాసవంతమైన ఇళ్లు.. ఇవన్నీ ఎలా వచ్చాయో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! అమెరికా ప్రభుత్వంలో ఉన్నతస్థాయి పదవిలో పనిచేసిన మాజీ సీఐఏ అధికారి డేవిడ్ జె. రష్ (49) భారీ మోసానికి పాల్పడినట్లు అంగీకరించారు. నకిలీ ప్రభుత్వ కార్యక్రమాల పేరుతో నిధులు దారి మళ్లించి అమెరికా ప్రభుత్వానికి సుమారు 194 మిలియన్ డాలర్ల నష్టం కలిగించిన కేసులో ‘వైర్ ఫ్రాడ్’ నేరాన్ని అంగీకరించాడు.
రష్ తన పదవిని అడ్డుపెట్టుకుని ప్రభుత్వ నిధులను సొంత ప్రయోజనాలకు మళ్లించినట్లు కోర్టు పత్రాలు చెబుతున్నాయి. అత్యంత రహస్యమైన ప్రభుత్వ కార్యక్రమం పేరుతో ఓ నకిలీ ప్రాజెక్టును సృష్టించి, దాని ద్వారా ప్రభుత్వ నిధులను తనకు అనుకూలంగా మళ్లించాడు. సుమారు 145 మిలియన్ డాలర్ల మొత్తాన్ని బ్యాంకు బదిలీల ద్వారా తరలించి, ఫ్లోరిడాలో విలాసవంతమైన రియల్ ఎస్టేట్, ఖరీదైన వాచ్‌లు, ఇతర వస్తువులు కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఇంట్లో 298 బంగారు కడ్డీలు..
‘పని సంబంధిత ఖర్చులు’ అంటూ భారీ మొత్తంలో బంగారం, విదేశీ కరెన్సీ కావాలని రష్ పదేపదే కోరినట్లు ఎఫ్‌బీఐ దర్యాప్తులో తేలింది. 2026 మే 19న ఆయన ఇంటిపై అధికారులు సోదాలు చేయగా ఏకంగా 298 బంగారు కడ్డీలు, సుమారు 21.06 లక్షల డాలర్ల నగదు, యూరో కరెన్సీ, విలాసవంతమైన వాచ్‌లు బయటపడ్డాయి. ఆ బంగారు కడ్డీలను కొనుగోలు చేయడానికి ప్రభుత్వానికి దాదాపు 46 మిలియన్ డాలర్లు ఖర్చైనట్లు న్యాయశాఖ తెలిపింది. నేరాన్ని అంగీకరించిన ఒప్పందంలో భాగంగా బంగారం, నగదు, ఆస్తులు, 30 వాచ్‌లు, రెండు బీఎండబ్ల్యూ కార్లను ప్రభుత్వానికి అప్పగించేందుకు రష్ అంగీకరించాడు.
రహస్య సమాచారాన్ని కూడా విదేశీ అధికారికి..
కేవలం ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేయడమే కాకుండా రష్ జాతీయ భద్రతకు సంబంధించిన అత్యంత రహస్య సమాచారాన్ని కూడా అనధికార వ్యక్తికి చేరవేసినట్లు కోర్టు పత్రాల్లో పేర్కొన్నారు. ఆయనకు టాప్ సీక్రెట్ స్థాయి సమాచారం అందుబాటులో ఉండేదని అధికారులు తెలిపారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగం పొందే సమయంలో తన విద్యార్హతలు, సైనిక అనుభవం గురించి తప్పుడు వివరాలు ఇచ్చినట్లు పత్రాలు చెబుతున్నాయి.
ఎలా దొరికాడంటే..
రష్ మోసం చేసిన నిధుల్లో కొంత భాగాన్ని సులభంగా మార్చుకునే బంగారం వంటి వస్తువుల్లోకి మళ్లించినట్లు దర్యాప్తులో గుర్తించారు. దీంతో ఆయన ఇంటిపై సోదాలు నిర్వహించగా భారీగా బంగారం, నగదు, వాచ్‌లు బయటపడ్డాయి. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో రష్ సీఐఏలో ఉన్నతస్థాయి పదవికి ఎలా చేరుకున్నారనే దానిపైనా దర్యాప్తు కొనసాగుతోంది. ముఖ్యంగా ఆయన నేపథ్య తనిఖీలను ఎలా దాటగలిగారనే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.
కాగా, రష్‌కు వచ్చే ఏడాది జనవరి 28న శిక్ష ఖరారు చేయనున్నారు. ‘వైర్ ఫ్రాడ్’ నేరానికి గరిష్ఠంగా 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. దీనితో పాటు జరిమానా, ప్రభుత్వానికి నష్టపరిహారం చెల్లించడం, అక్రమంగా సంపాదించిన ఆస్తులను కోల్పోవాల్సి ఉంటుంది. అయితే, ఈ కేసుపై అమెరికా న్యాయశాఖ దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.
ఇదీ చదవండి: పెళ్లిలో పెను ఉత్పాతం.. అతిథుల హాహాకారాలు


