ఉద్యోగులు, కార్మికుల ఇళ్ల నిర్మాణం కోసం లేఅవుట్లు
మైనింగ్ చేయని ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయం
ఉన్నత స్థాయి సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి
సాక్షి, హైదరాబాద్: సింగరేణి స్థలాల్లో మైనింగ్ చేయని ప్రదేశాల్లో నెహ్రూ హౌసింగ్ కాలనీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు, కార్మికుల ఇళ్ల నిర్మాణం కోసం లేఅవుట్లు వేయనున్నారు. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సింగరేణి అధికారులను ఆదేశించారు. శిథిలమైన డి–టైప్ క్వార్టర్స్‌ను తొలగించి వాటిస్థానంలో కార్మికుల జీవన ప్రమాణాలు పెంచేవిధంగా అన్ని వసతులతో నూతన క్వార్టర్స్ నిర్మాణం చేసి నెహ్రూ పేరిట సింగరేణి కాలనీలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
అర్హులకు ఇళ్ల స్థలాలు..
రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి కేటాయించిన భూముల్లో 5,774 ఎకరాలు తిరిగి రెవెన్యూ శాఖకు అప్పగించగా అందులో 4,500 ఎకరాలు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పేదలకు పట్టాలు పంపిణీ చేశారు. మిగిలిన 1,250కిపైగా ఎకరాల్లో జీరో నంబర్ 76 ప్రకారంగా అర్హులకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించారు. బొగ్గు గని కార్మికులు, వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న దీర్ఘకాల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజాభవన్‌లో మంగళవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని డిప్యూటీ సీఎం నిర్వహించారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, గడ్డం వివేక్ వెంకటస్వామిలతోపాటు సింగరేణి పరిధిలోని ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
» పెండింగ్‌లో ఉన్న 300 వరకు డిపెండెంట్ ఆర్డర్లను, ఇతర లీగల్ ప్రాసెస్‌లను 15 రోజుల్లో పూర్తి చేసి అభ్యర్థులకు అందజేయాలని భట్టి ఆదేశించారు. డిపెండెంట్ ఉద్యోగుల పేర్ల మార్పులకు సంబంధించి అధికారులు మానవీయ కోణంలో ఆలోచించి, దీనికై ఏర్పాటు చేసిన సింగరేణి ఆఫీసర్స్ కమిటీ ఇచ్చిన సిఫార్సుల ఆధారంగా తగిన నిర్ణయం తీసుకోవాలన్నారు.
» మెడికల్ ఇన్వాలిడేషన్ కోసం సింగరేణిలోని ఏరియా ఆస్పత్రులలో ప్రతి నెలా ఒక నిర్ణీత బోర్డు మీటింగ్ నిర్వహించి, అక్కడే వీలైనంత మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మెడికల్ ఇన్వాలిడేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.
» కరోనా సమయంలో లేదా ఇతర స్థానిక కారణాల వల్ల విధులకు హాజరుకాక ఉ ద్యోగాలు కోల్పోయిన కార్మికులకు వన్ టైం ఆప్షన్ కింద తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు.
» సింగరేణి పరిధిలోని ఏరియా ఆస్పత్రులను కార్పొరేట్ ఆసుపత్రులుగా తీర్చిదిద్దాలన్నారు.
» రామగుండంలో సింగరేణి ఆధ్వర్యంలో థర్మల్ కేంద్రం ఏర్పాటుకు భట్టి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. భూపాలపల్లి నియోజకవర్గంలో వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు సింగరేణి నుంచి స్థలం కేటాయించాలని ఆదేశించారు.


