ఎర్రవల్లి ఫామ్‌హౌస్ సమీప సర్వే నంబర్‌లో 45 ఎకరాలు తగ్గుదల
తగ్గిన భూమి లెక్క తేల్చేందుకు సర్వే నోటిఫికేషన్ జారీకి ప్రభుత్వ నిర్ణయం.. భూములపై సీఎం రేవంత్ సమీక్ష
ఫామ్‌హౌస్ ఎదురుగా అమర వీరుల కాలనీ నిర్మాణం
సర్వే నంబర్ 325లోని మిగులు భూమిని పేదలకు అసైన్ చేసేందుకు చర్యలు.. వెలికట్ట గ్రామంలోని ప్రభుత్వ భూమిలో వైఐఐఎస్‌తోపాటు ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కుటుంబ సభ్యులకు రెవెన్యూ శాఖ ద్వారా భూమి సర్వే నోటీసులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి, శివారు వెంకటాపురం గ్రామాల పరిధిలో 45 ఎకరాల ప్రభుత్వ భూమి విస్తీర్ణం లెక్కలు తేలకపోవడంతో... వాటి గుర్తింపునకు వెంటనే సర్వే నోటిఫికేషన్ విడుదల చేయాలని సీఎం ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. 22ఏ నిషేధిత జాబితా అంశంపై శాసనసభలో గత నెల 16న జరిగిన చర్చలో భాగంగా ఎర్రవల్లి, శివారు వెంకటాపురం గ్రామాల పరిధిలో ప్రభుత్వ భూములపై విచారణకు రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఆ విచారణ పురోగతిపై మంగళవారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలోని బోధీ పెవిలియన్‌లో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎంవో ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి, భూ అక్రమాలపై విచారణకు వేసిన కమిటీ, ధరణి అక్రమాలపై ఏర్పాటు చేసిన విచారణ కమిటీ సభ్యులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విచారణ పురోగతిపై రేవంత్ కమిటీ సభ్యులను ప్రశ్నించారు.
జూన్ 2లోగా అమర వీరుల కాలనీ
ఎర్రవల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 325లో మొత్తం 388 ఎకరాల భూమి ఉన్నట్లు రికార్డుల్లో నమోదైందని, కానీ తాజా సర్వేలో 343 ఎకరాల భూమి మాత్రమే ఉన్నట్లు గుర్తించామని సీఎం రేవంత్ రెడ్డికి అధికారులు వివరించారు. రికార్డులో ఉన్న భూమికి, వాస్తవంగా ఉన్న భూమికి మధ్య 45 ఎకరాల వ్యత్యాసం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఆ 45 ఎకరాల భూమిని తేల్చేందుకు ఎర్రవల్లి, శివారు వెంకటాపురం గ్రామాల్లో సర్వేకు నోటిఫికేషన్ విడుదల చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. సర్వే నంబర్ 325 సమీపంలోనే కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు భూములు ఉన్నందున, వారి భూముల రికార్డులను సమర్పించాల్సిందిగా నోటీసులు జారీ చేస్తామని అధికారులు సీఎంకు వివరించారు. సర్వే నంబర్ 325లో గుర్తించే భూమిని స్థానికంగా అర్హులైన రైతులకు పంపిణీ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. అలాగే, తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాల కోసం ‘తెలంగాణ అమరవీరుల కాలనీ’ని ఇదే ప్రాంతంలో నిర్మించాలని సీఎం ఆదేశించారు. అమరవీరుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించి, అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలతో ఫాంహౌస్ ఎదురుగా కాలనీని అభివృద్ధి చేయాలని సూచించారు. కాలనీ నిర్మాణ బాధ్యతలను గృహ నిర్మాణ శాఖకు అప్పగించాలని, వచ్చే జూన్ 2లోగా తెలంగాణ అమరవీరుల కాలనీ నిర్మాణాన్ని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
యంగ్ ఇండియా స్కూల్‌కు భూమి
కొండపాక మండలం వెలికట్ట గ్రామ పరిధిలో అసైన్డ్ భూములు, మిషన్ భగీరథ భూములు మినహా మిగిలిన భూముల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ స్కూల్ (వైఐఐఎస్)తోపాటు ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ఎల్‌నినో నేపథ్యంలో రిజర్వాయర్లు, చెరువుల నీటిని జాగ్రత్తగా వినియోగించాలని అధికారులకు సూచించారు. మల్లన్న సాగర్ నీటిని అనధికారికంగా వినియోగించే వారిని గుర్తించి, తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.


