శివారు గొంతుల్లో విషం! | Water sources are also becoming toxic In the outskirts of Hyderabad | Sakshi
Sakshi News home page

శివారు గొంతుల్లో విషం!

Oct 7 2026 4:38 AM | Updated on Oct 7 2026 4:38 AM

Water sources are also becoming toxic In the outskirts of Hyderabad

శుద్ధి చేయకుండానే కాలువల్లోకి పారిశ్రామిక రసాయన జలాలు.. కలుషితమవుతున్న తాగునీరు

ప్రమాదకర స్థాయిలో సీసం, నికెల్, కాడ్మియం, నైట్రేట్లు, ఆర్సెనిక్, క్రోమియం లోహాలు 

ఈ నీటి వినియోగంతో చర్మ కేన్సర్, మూత్రపిండ, కాలేయ, జీర్ణకోశ, నాడీవ్యవస్థ దెబ్బతినే వ్యాధులు 

ఎన్‌జీఆర్‌ఐ, సీఎస్‌ఐఆర్‌ అధ్యయనాల్లో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: మహా హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో కేవలం నీటి కొరతే కాదు.. లభ్యమవుతున్న కొద్దిపాటి జలాలు కూడా విషతుల్యంగా మారుతుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పటాన్‌చెరు, జీడిమెట్ల, బొల్లారం వంటి పారిశ్రామిక వాడల్లో ఉన్న కొన్ని పరిశ్రమలు తమ రసాయన వ్యర్థాలను శుద్ధి చేయకుండానే నిబంధనలకు విరుద్ధంగా పైపుల ద్వారా మురుగు కాలువల్లోకి అక్రమంగా వదలడం నిరంతరం కొనసాగుతోంది. దీంతో నికెల్, సీసం, కాడ్మియం, నైట్రేట్లు, హానికర హెవీ మెటల్స్‌ భూగర్భ పొరల్లోకి చేరడంతో జలాలు విషతుల్యంగా మారుతున్నట్లు ఇటీవల నేషనల్‌ జియోఫిజికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఎన్‌జీఆర్‌ఐ), సీఎస్‌ఐఆర్‌ నిర్వహించిన హైడ్రో–జియోకెమికల్‌ అధ్యయనాలలో వెల్లడైంది. శివారు ప్రాంతాల భూగర్భ జలాల్లో సాధారణం కంటే పదుల రెట్లు ఎక్కువ రసాయన సాంద్రత ఉన్నట్లు శాస్త్రీయంగా నిర్ధారణ అయింది. పటాన్‌చెరు, దాని పరిసర గ్రామాలలోని బావుల నీటి నమూనాలలో సాధారణ తాగునీటి పరిమితి కంటే అత్యంత అధికంగా ప్రమాదకర స్థాయిలో నమోదయ్యాయి. ఈ నీటిలో ఆర్సెనిక్, క్రోమియం వంటి రోగ కారక లోహాలు జాతీయ తాగునీటి ప్రమాణాలను తలకిందులు చేస్తూ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయని నివేదిక స్పష్టం చేస్తోంది. ఈ విషపూరిత నీటిని గృహ అవసరాలకు వినియోగించడం వల్ల తీవ్రమైన చర్మ వ్యాధులు, మూత్రపిండాలవంటి ప్రాణాంతక ఆరోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉందని వైద్య నిపుణలు పేర్కొంటున్నారు. 

పరిశోధనల్లో దిగ్భ్రాంతికర నిజాలు 
ఎన్‌జీఆర్‌ఐ, సీఎస్‌ఐఆర్‌ శాస్త్రవేత్తల బృందం శివారు ప్రాంతాల్లోని వందలాది బోర్‌ బావులు నుండి సేకరించిన నీటి నమూనాలను అధునాతన ’ఐసీపీ–ఎమ్‌ఎస్‌’పద్ధతి ద్వారా విశ్లేషించింది. ఈ పరిశోధనల్లో భూగర్భ జలచర పొరలు శాశ్వతంగా దెబ్బతింటున్నాయని, లోతైన పొరల్లోకి సైతం వ్యర్థ రసాయనాలు ఇంకిపోతున్నాయని తేలింది. రసాయనాల ప్రభావం వల్ల నీటిలో ఆక్సిజన్‌ స్థాయిలు శూన్యానికి పడిపోయి, సూక్ష్మజీవుల సమతుల్యత దెబ్బతింటోంది. కేవలం ఉపరితల నీరే కాకుండా, కొన్ని దశాబ్దాల పాటు భవిష్యత్తు తరాలకు లభించాల్సిన భూగర్భ జలాలు సైతం వాడకానికి పనికిరాకుండా పోతున్నాయని, ఇది పర్యావరణ అత్యవసర పరిస్థితికి దారితీస్తోందని శాస్త్రవేత్తలు తమ అధ్యయన నివేదికలో తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. 

తక్షణ చర్యలు లేకపోతే తీవ్ర ముప్పు 
కలుషిత జలాల ముప్పు నుంచి శివారు ప్రజలను కాపాడేందుకు శాస్త్రవేత్తలు, పర్యావరణ వేత్తలు పలు కీలక సూచనలు చేశారు. బాధితులకు తక్షణమే సురక్షితమైన కృష్ణా, గోదావరి తాగునీటిని పూర్తిస్థాయిలో అందించడంతో పాటు, ప్రభావిత ప్రాంతాల్లో భూగర్భ జలాల తోడకాన్ని తక్షణమే నిషేధించాలని స్పష్టం చేశారు. పరిశ్రమలు వదిలే వ్యర్థాలను ఆన్‌లైన్‌ నిరంతర పర్యవేక్షణ వ్యవస్థ ద్వారా కఠినంగా పర్యవేక్షించాలని సిఫారసు చేశారు. కాలుష్య కారక పరిశ్రమలపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే, ఈ ప్రాంతాలు నివాస యోగ్యం కానివిగా మారే ప్రమాదముందని హెచ్చరించారు. 

నిద్రపోతున్న పర్యవేక్షణ వ్యవస్థలు 
పరిశ్రమల్లో రసాయన వ్యర్థాలను శుద్ధి చేయడానికి ప్రతిపాదించిన కామన్‌ ఎఫ్లూయెంట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు (ఒకప్రాంతంలో లేదా పారిశ్రామిక క్లస్టర్‌లో ఉన్న అనేక పరిశ్రమల నుంచి వెలువడే మురుగునీటిని సమిష్టిగా సేకరించి, శుద్ధి చేసే కేంద్రీకృత వ్యవస్థ) ,జీరో లిక్విడ్‌ డిస్చార్జ్‌ వ్యవస్థలు కాగితాలకే పరిమితమవుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకోవడానికి కొన్ని రసాయన, ఫార్మా కంపెనీలు రాత్రి వేళల్లో వ్యర్థ రసాయనాలను మూసీ కాలువల్లోకి, నక్కవాగులోకి చెరువుల్లోకి భారీ పైప్‌లైన్ల ద్వారా వదులుతున్నాయన్న ఆరోపణలున్నాయి. పర్యావరణ పరిరక్షణ చట్టాల అమల్లో నిర్లక్ష్యం,సంబంధిత అధికారుల పర్యవేక్షణలోపం వల్ల ఈ రసాయన రాక్షసి శివారు కాలనీలను మింగేస్తోంది. 

ఇది పర్యావరణ అత్యవసర పరిస్థితి  
శివారు ప్రాంతాల్లో భూగర్భ జలాలు కలుషితం కావడం నిన్నమొన్నటి సమస్య కాదు, ఇది దశాబ్దాలుగా జరుగుతున్న ఘోరం. ఎన్‌జీఆర్‌ఐ, సీఎస్‌ఐఆర్‌ నివేదికలు పర్యావరణ అత్యవసర పరిస్థితిని కళ్ళకు కడుతున్నాయి. కొన్ని ఫార్మా, కెమికల్‌ కంపెనీలు రీ–ఇంజెక్షన్‌ బోర్లు వేసి భూమిలోకి నేరుగా విష రసాయనాలను తోడుతున్నాయి. దీనివల్ల వందలాది అడుగుల లోతులోని జలాలు కూడా విషపూరితమయ్యాయి. ప్రజలకు శుద్ధి చేసిన తాగునీరు అందించడంతో పాటు, ప్రభావిత ప్రాంతాల్లో వెంటనే ‘ఫైటో–రెమిడియేషన్‌’సాంకేతికతతో భూగర్భ జలాలను శుద్ధి చేసే చర్యలు తక్షణమే ప్రారంభించాలి. 
– మద్దిరాల సుధాకర్‌ డెవిడ్‌ , సామాజిక వేత్త 

తీవ్రమైన నేరం...హాట్‌స్పాట్‌లు గుర్తిస్తాం 
పరిశ్రమలు తమ వ్యర్థాలను శుద్ధి చేయకుండా బయటకు వదిలినా లేదా భూమిలోకి ఇంజెక్ట్‌ చేసినా అది తీవ్రమైన నేరం. పీసీబీ పరిధిలో మేము ఇప్పటికే నిరంతర ఆన్‌లైన్‌ నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేశాం. రాత్రి వేళల్లో అక్రమంగా రసాయన వ్యర్థాలు వదులుతున్న కొన్ని యూనిట్లపై ఇటీవల దాడులు చేసి సీజ్‌ చేశాం. ఎన్‌జీఆర్‌ఐ నివేదిక ఆధారంగా ప్రమాదకర హాట్‌స్పాట్‌లను గుర్తించి, నిబంధనలు పాటించని ఫార్మా, పారిశ్రామిక యూనిట్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఏ పరిశ్రమ అయినా జీరో లిక్విడ్‌ డిశ్చార్జ్‌ పాటించకపోతే మూసివేత నోటీసులు జారీ చేస్తాం. 
– టీజీపీసీబీ అధికారి 

జీర్ణకోశ వ్యాధుల నుంచి క్యాన్సర్ల వరకు ప్రమాదం 
భూగర్భ జలాల్లో సీసం, నికెల్, క్రోమియం, ఆర్సెనిక్‌ వంటి హెవీ మెటల్స్‌ నిర్ణీత పరిమితుల కంటే అధికంగా ఉన్న నీటిని సుదీర్ఘకాలం వినియోగించడం వల్ల శరీరంలో తీవ్ర దుష్పరిణామాలు చోటుచేసుకుంటాయి. చర్మంపై అలెర్జీలు, రాషెస్, దురదలతో ప్రారంభమై.. క్రమంగా కిడ్నీల పనితీరు మందగించడం, లివర్‌ దెబ్బతినడం, నాడీ వ్యవస్థ బలహీనపడటం జరుగుతుంది. ఆర్సెనిక్, కాడ్మియం వంటి లోహాల వల్ల జీర్ణకోశ వ్యాధులు, బారిన పడే తీవ్ర ముప్పు ఉంది. ప్రభావిత ప్రాంత ప్రజలు భూగర్భ జలాలను తాగునీటికే కాకుండా గృహ అవసరాలకు కూడా వాడకపోవడమే సురక్షితం. 
– డాక్టర్‌ దేశ్‌ముక్‌ ఉదయ్‌రెడ్డి., చర్మవ్యాధి నిపుణులు, నిమ్స్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement