హైడ్రోజెల్స్‌తో కరువుకు చెక్‌! | Sagubadi: Hydrogels as a key solution for sustainable agriculture | Sakshi
Sakshi News home page

హైడ్రోజెల్స్‌తో కరువుకు చెక్‌!

Oct 13 2026 4:32 AM | Updated on Oct 13 2026 4:32 AM

Sagubadi: Hydrogels as a key solution for sustainable agriculture

నేలలో ‘నీటి బుగ్గలు’...

తక్కువ నీటితో అధిక దిగుబడులు 

వర్షాభావ పరిస్థితుల్లో పంటలకు, తోటలకు శ్రీరామరక్ష

వ్యవసాయంలో నీటి కొరత, వాతావరణ మార్పులు, పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు  అన్నదాతలకు పెద్ద సవాలుగా మారాయి. ముఖ్యంగా వర్షాధార ప్రాంతాల్లో సమయానికి
తగినంత వర్షాలు కురవక, కీలక దశల్లో పంటలకు, పండ్ల తోటలు, పామాయిల్‌ తోటలకు తేమ అందక రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నేలలో తేమను ఒడిసిపట్టి, పంటలకు, తోటలకు అవసరమైనప్పుడు కొద్దికొద్దిగా అందించే నూతన సాంకేతికతే ‘హైడ్రోజెల్స్‌’. వ్యవసాయ శాస్త్రవేత్తలు
‘హైడ్రోజెల్స్‌’ను మట్టిలో చెట్ల వేరు వ్యవస్థ దగ్గర్లో దాగి వుండే ‘వాటర్‌ స్పాంజ్‌’గా అభివర్ణిస్తున్నారు.  

ఏమిటీ హైడ్రోజెల్స్‌?  ఎలా పనిచేస్తాయి?
హైడ్రోజెల్స్‌ అనేవి నీటిలో కరగని ప్రత్యేకమైన పాలిమర్‌ సమ్మేళనాలు. ఇవి తమ బరువు కంటే వందల(400–800) రెట్లు ఎక్కువ నీటిని త్వరగా పీల్చుకొని, జెల్‌ రూపంలో నిల్వచేసుకునే అద్భుత సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. వంద గ్రాముల హైడ్రోజెల్‌ సుమారు 50 లీటర్ల నీటిని పీల్చుకోగలదు. నేలలో వీటిని చల్లినప్పుడు, వర్షపు నీటిని లేదా సాగునీటి తడులను పీల్చుకుని చిన్నపాటి నీటి నిల్వ జలాశయాల్లా రూపాంతరం చెందుతాయి.  వర్షాభావం వల్లగానీ, ఎండల తీవ్రత వల్లగానీ నేల ఎండిపోవటం ప్రారంభమైనప్పుడు, ఈ జెల్‌ క్రమంగా తేమను విడుదల చేస్తూ మొక్కల వేర్లకు అందిస్తుంది. దీనివల్ల ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ పంటలు వాడిపోకుండా నిలబడతాయి.  

రైతులకు చేకూరే ప్రధాన ప్రయోజనాలు
→ మెరుగైన మొలక శాతం, వేరు వ్యవస్థ: విత్తనాలు నాటిన సమయంలో నేలలో తేమ నిలకడగా ఉండటం వల్ల విత్తనాలు త్వరగా, ఆరోగ్యంగా మొలకెత్తుతాయి. లోతుగా, బలంగా వేర్లు విస్తరించటానికి అనువైన వాతావరణం ఏర్పడుతుంది 
→ నీటి ఆదా, అధిక ఉత్పాదకత: ఉపరితలం నుంచి నీరు ఆవిరైపోవటం, భూమి లోపలి పొరల్లోకి వృథాగా ఇంకిపోవటం బాగా తగ్గుతుంది. ఫలితంగా నీటి వినియోగ సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది 
→ భూభౌతిక లక్షణాల మెరుగుదల: హైడ్రోజెల్స్‌ ఉపయోగించటం వల్ల భూమి గుల్లబారి గాలి ప్రసరణ బాగుంటుంది. నీరు సులభంగా ఇంకే గుణం పెరుగుతుంది.  

హైడ్రోజెల్స్‌ రెండు రకాలు
మార్కెట్లో ఎక్కువ (5–6) సంవత్సరాలు మన్నే సింథటిక్‌ హైడ్రోజెల్స్‌ బత్తాయి, కొబ్బరి, మామిడి, ఆయిల్‌పామ్‌ వంటి దీర్ఘకాలిక తోటలకు అనుకూలం. అయితే, వీటిని వాడినప్పుడు కాల్షియం, మెగ్నీషియం లోపం వచ్చే అవకాశం ఉండొచ్చు. పంటపై ఆ లక్షణాలు కనిపిస్తే ఆ పోషకాలను పిచికారీ ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. సింథటిక్‌ హైడ్రోజెల్స్‌తో పాటు.. వరి పొట్టు, గోధుమ గడ్డి, చెరకు పిప్పి వంటి వ్యవసాయ వ్యర్థాలతో తయారయ్యే ‘బయోడిగ్రేడబుల్‌ హైడ్రోజెల్స్‌’ కూడా అందుబాటులోకి వస్తున్నాయి. వీటి జీవితకాలం 6 నుంచి 12 నెలలు మాత్రమే. కూరగాయలు, అపరాలు వంటి స్వల్పకాలిక పంటలకు సరిపోతాయి. ఇవి కాలక్రమేణా నేలలోని సూక్ష్మజీవుల ద్వారా విచ్ఛిన్నమై భూసారాన్ని మరింత పెంపొందిస్తాయి. 

కరువు మండలాల్లో, నీటి ఎద్దడి ఎక్కువగా ఉండే దుబ్బ నేలలు, ఎర్ర చెలక నేలల్లోని ఆరుతడి పంటలు, పండ్ల తోటలు, పామాయిల్‌ తోటలకు హైడ్రోజెల్స్‌ వరప్రసాదంగా నిలుస్తున్నాయని చెబుతున్నారు. వీటి కొనుగోలుకు రైతులు అదనంగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఆ మేరకు అది రైతుపై అదనపు భారమే. అయితే, సరైన మోతాదులో వీటిని వినియోగిస్తే ప్రతి నీటి బొట్టునూ సద్వినియోగం చేసుకొని కష్టకాలంలోనూ స్థిరమైన ఆదాయం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. మల్చింగ్‌ ’(ఆచ్ఛాదన), ఫామ్‌ పాండ్లతో పాటు హైడ్రోజెల్‌ కలిపి వాడితే నీటి వృథా బాగా తగ్గి, ఒక్కసారి నీరిస్తే స్థానిక పరిస్థితులను బట్టి 4–5 రోజుల వరకు సరిపోతుంది. 

పూసా హైడ్రోజెల్‌... 
మన శాస్త్రవేత్తల ఆవిష్కరణ!
భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్‌–ఐఏఆర్‌ఐ, పూసా, న్యూఢిల్లీ) శాస్త్రవేత్తలు మన దేశ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ‘పూసా హైడ్రోజెల్‌’ను ప్రత్యేకంగా రూపొందించారు. అధిక ఉష్ణోగ్రతల వద్ద కూడా ఇది నీటిని నిల్వ ఉంచే శక్తిని కోల్పోదు. సాధారణంగా ఎకరానికి కేవలం 1 నుంచి 1.5 కిలోల హైడ్రోజెల్‌ను విత్తే సమయంలో విత్తనాలతో కలిపి లేదా విత్తే వరుసల్లో వేర్ల ప్రాంతంలో పడేలా వేస్తే సరిపోతుంది. గోధుమ, ఆవాలు, పప్పుదినుసులు, సోయాబీన్, కూరగాయ పంటల్లో దీని వాడకం వల్ల 2 నుంచి 3 తడుల నీరు ఆదా అవుతుందని, ఎండల బెడద నుంచి పైరును కాపాడుకోవచ్చని పరిశోధనల్లో రుజువైంది.   

పంటలకు ‘సెలైన్‌ బాటిల్‌’లా..! 
సాధారణంగా నేలలో రసాయన ఎరువులు వేసినప్పుడు వర్షాలకు లేదా నీటి తడులకు కొట్టుకుపోవటం, గాల్లో ఆవిరైపోవటం వల్ల మొక్కలకు పూర్తిగా అందవు. హైడ్రోజెల్‌ సాంకేతికతతో ఈ సమస్యకు చక్కని పరిష్కారం లభిస్తుంది. హైడ్రోజెల్‌ పాలిమర్లతో ఎరువులను లేదా పురుగుమందులను కలిపి వేసినప్పుడు, అవి నెమ్మదిగా కరుగుతాయి.   రోగికి సెలైన్‌ బాటిల్‌ ద్వారా క్రమంగా ఔషధం అందినట్లే, పంటకు కావాల్సిన పోషకాలు కొన్ని వారాలపాటు నిరంతరాయంగా అందుతాయి. నీటితో పాటే పోషకాలు కూడా భూమి అడుగుపొరల్లోకి వెళ్లిపోయి మొక్కలకు అందవు. హైడ్రోజెల్‌ వాడటం వల్ల నీటితోపాటు పోషకాలను కూడా వేర్ల సమీపంలో నిలుపుకోవచ్చు. దీంతో ఎరువుల వృథా, ఖర్చు తగ్గటమే కాకుండా భూగర్భ జలాలు కలుషితం కాకుండా పర్యావరణ పరిరక్షణ కూడా జరుగుతుంది.
 

నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement