33 జిల్లాల్లోనూ పాతాళానికి గంగ | Groundwater levels drop across all districts in September | Sakshi
Sakshi News home page

33 జిల్లాల్లోనూ పాతాళానికి గంగ

Oct 11 2026 5:04 AM | Updated on Oct 11 2026 5:04 AM

Groundwater levels drop across all districts in September

గతేడాదితో పోల్చితే ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే అన్ని జిల్లాల్లో భూగర్భ జలాల పతనం 

2025 సెప్టెంబర్‌లో 4.41 మీటర్ల లోతుల్లోనే లభ్యత.. 

2026 సెప్టెంబర్‌లో 7.52 మీటర్ల లోతుల్లోకి ఇంకిన వైనం 

భూగర్భ జలశాఖ సెప్టెంబర్‌ మాస నివేదికలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో భూగర్భ జలాలు మరింత ప్రమాదకర స్థాయికి పడిపోయాయి. 33 జిల్లాలుండగా, గతేడాది (2025) సెప్టెంబర్‌తో పోల్చితే ఈ ఏడాది (2026) సెప్టెంబర్‌ చివరి నాటికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ భూగర్భ జలమట్టాలు క్షీణించిపోయాయి. ఎల్‌నినో ప్రభావంతో ప్రస్తుత వర్షాకాలంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడంతో భూగర్భ జలమట్టాలు పాతాళానికి చేరాయి.

రాష్ట్ర భూగర్భ జలశాఖ 2026 సెప్టెంబర్‌ మాస రెండో పక్షం నివేదిక ప్రకారం.. 2025 సెప్టెంబర్‌ చివరి నాటికి రాష్ట్ర భూగర్భ జలాల సగటు లోతు 4.41 మీటర్లు కాగా, 2026 సెప్టెంబర్‌ చివరి నాటికి 7.52 మీటర్ల సగటు లోతుల్లోకి పతనమయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రంలో సగటున 3.11 మీటర్ల లోతుల్లోకి నీటిమట్టాలు పడిపోయినట్టు వెల్లడైంది.  

⇒ గతేడాదితో పోల్చితే 2026 సెప్టెంబర్‌లో హైదరాబాద్‌ జిల్లాలోఅత్యధికంగా 6.44 మీటర్ల మేర లోతుల్లోకి భూగర్భజలాలు పడిపోగా, మేడ్చల్‌ జిల్లాలో 6.29 మీటర్లు, వికారాబాద్‌ జిల్లాలో 6.17 మీటర్లు,. రంగారెడ్డి జిల్లాలో 5.43 మీటర్లు, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 5.24 మీటర్లు, సంగారెడ్డి జిల్లాలో 5.13 మీటర్ల లోతుల్లోకి నీటిమట్టాలు పతనమయ్యాయి.  
⇒  గతేడాదితో పోల్చితే కనిష్టంగా పెద్దపల్లి జిల్లాలో 1.02 మీటర్ల లోతుల్లో భూగర్భ జలాలు పడిపోయాయి. అంటే, భూగర్భ జలాల కనీస పతనమూ మీటర్‌ లోతు కంటే ఎక్కువ ఉన్నట్టు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.  

7 జిల్లాల్లోనే సురక్షిత స్థాయిల్లో.. 
జూన్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 30 వరకు రాష్ట్రంలో 741 మి.మీ. ల సాధారణ వర్షపాతం ఉండాల్సి ఉండగా, 616 మి.మీ. మాత్రమే కురిసింది. ఇది 17% లోటు వర్షపాతాన్ని సూచి స్తుంది. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లాలో 3.56 మీటర్ల లోతుల్లోనే భూగర్భ జలాల లభ్యత ఉండగా, వికారాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 11.96 మీటర్ల లోతుల్లోకి నీళ్లు ఇంకిపోయాయి. 7 జిల్లాలలో 5 మీటర్లు, 19 జిల్లాల్లో 5–10 మీటర్లు, మిగిలిన 7 జిల్లాల్లో 10–15 మీటర్ల లోతుల్లో భూగర్భ జలాలు పడిపోయాయి. 5 మీటర్ల లోపు లోతుల్లో భూగర్భ జలాల లభ్యత ఉంటేనే సురక్షిత స్థితిగా పరిగణిస్తారు.  

68% మండలాల్లో దశాబ్ద సగటు కంటే క్షీణత     
వర్షాకా>లం ప్రారంభానికి ముందు గత మే నెలలో 9.26 మీటర్లు ఉన్న రాష్ట్ర భూగర్భ జలాల సగటు లోతు వర్షాల కారణంగా సెప్టెంబర్‌ నాటికి కోలుకుని 7.52 మీటర్ల లోతుల్లోకి చేరాయి. రాష్ట్రంలో మొత్తం 621 మండలాలుండగా, గత దశాబ్దపు సగటుతో పోలిస్తే 198 మండలాల్లో (32%) స్వల్పం నుంచి 14.86 మీటర్ల వరకు నీటిమట్టాలు పెరిగాయి. 423 మండలాల్లో (68%) మాత్రం 0.01 నుంచి 26.93 మీటర్ల వరకు భూగర్భ జలాలు క్షీణించినట్టు తేలింది.

దశాబ్దపు సగటుతో పోలిస్తే మాత్రం 20 మీటర్లకు మించి లోతుల్లో భూగర్భ జలాలు కలిగి ఉన్న ప్రాంతాల విస్తీర్ణం 617 చ.కి.మీ. నుంచి 1,272 చ.కి.మీ.కి రెట్టింపు కావడం గమనార్హం. గతేడాదితో పోలిస్తే అన్ని జిల్లాల్లోనూ భూగర్భ నీటిమట్టాలు తగ్గిపోవడం, దశాబ్దపు సగటుతో పోలిస్తే దాదాపు 68% మండలాల్లో నీటిమట్టాలు పడిపోవడం..సమీప భవిష్యత్‌ నీటి భద్రతపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement