అతిథి అధ్యాపకులు.. అద్దె రోగులు | Private medical colleges are breaking barriers for Renewal, increase in seats | Sakshi
Sakshi News home page

అతిథి అధ్యాపకులు.. అద్దె రోగులు

Oct 7 2026 4:28 AM | Updated on Oct 7 2026 4:28 AM

Private medical colleges are breaking barriers for Renewal, increase in seats

అనుబంధ ఆసుపత్రి లేకపోయినా 900 పడకలతో ఆస్పత్రి ఉన్నట్లు చూపిన యాజమాన్యం 

‘పెద్ద’లకు ఎన్‌ఎంసీ దాసోహం 

ప్రభుత్వ నిధులతో సొంత కాలేజీకి రోడ్డు 

అనుమతుల రద్దుకు విద్యార్థి సంఘాల డిమాండ్‌

సాక్షి, రంగారెడ్డి జిల్లా: రాష్ట్రంలో పలు ప్రైవేటు మెడికల్‌ కాలేజీల యాజమాన్యాలు గుర్తింపు, రెన్యువల్, సీట్ల పెంపు కోసం అడ్డదారులు తొక్కుతున్నాయి. ప్రభుత్వ ‘పెద్ద’ల సహకారంతో అనుమతులు పొందిన కాలేజీలు... ఆ తర్వాత తనిఖీలకు వచ్చిన జాతీయ మెడికల్‌ కౌన్సిల్‌(ఎన్‌ఎంసీ) అధికారులను సైతం తప్పు దోవ పట్టిస్తున్నాయి. తాత్కాలిక అద్దె రోగులు, అతిథి అధ్యాపకులను చూపించి అనుమతుల రెన్యువల్‌ సహా అడ్డగోలుగా సీట్ల సంఖ్యను పెంచుకుంటున్నాయి. భారీగా సొమ్ము చేసుకుంటున్నాయి. వైద్య విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఆయా కాలేజీ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాల్సిన కాళోజీ నారాయణరావు హెల్త్‌ యూనివర్సిటీ సహా డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అధికారులు పరోక్షంగా సహకరిస్తున్నట్లు విమర్శలున్నాయి. అబ్దుల్లాపూర్‌మెట్‌ జాఫర్‌గూడ రెవెన్యూ పరిధిలోని నోవా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ముందు బీఆర్‌ఎస్‌వీ విద్యార్థి సంఘం నేతలు ఆందోళనకు దిగడం గమనార్హం.  

కాలేజీ స్థాపించి మూడేళ్లే.. 250 సీట్లా? 
కొత్తగా ఏదైనా మెడికల్‌ కళాశాల ప్రారంభించాలంటే విశాలమైన క్యాంపస్, అనువైన భవనాలు, ప్రయోగశాలలు, లైబ్రరీ, అకాడమిక్‌ ఇన్‌ ఫ్రాస్టక్చర్, అనుబంధ బోధనాసుపత్రి, క్లినికల్‌ డిపార్ట్‌మెంట్స్, పడకలు, ఆపరేషన్‌ థియేటర్స్, ఐసీయూ, క్యాజువాల్టీ, టీచింగ్‌ స్టాఫ్, సపోర్టింగ్‌ స్టాఫ్‌ తప్పని సరి. కానీ అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం జాఫర్‌గూడ రెవెన్యూలో మూడేళ్ల క్రితం వెలసిన ఓ ప్రైవేటు మెడికల్‌ కాలేజీకి అనుబంధ ఆస్పత్రి, ఔట్‌ పేషెంట్లు, ఇన్‌పేషంట్‌ వార్డుల్లో చికిత్సలు, లే»ొరేటరీ, ఐసీయూ, ఆపరేషన్‌ థియేటర్లు ఇవేవీ లేకుండానే అనుమతులు జారీ చేశారు. తెలంగాణ వైద్య విద్య చరిత్రలో ఎక్కడా లేని విధంగా కేవలం మూడేళ్ల వ్యవధిలో ఎంబీబీఎస్‌ సీట్ల సంఖ్య 150 నుంచి 250కి పెంచారు. నిబంధనల ప్రకారం ప్రతి రోజూ విద్యార్థులు, అధ్యాపకుల హాజరు సహా అనుబంధ ఆస్పత్రి ఓపీ, ఐపీ విభాగాలకు వచ్చి వెళ్లే రోగుల సంఖ్యను కూడా ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంది. 

కానీ ఇక్కడికి బయటి నుంచి ఒక్క రోగి కూడా వచ్చిన దాఖలాలు లేవని స్థానికులు చెబుతున్నారు. కానీ 900 పడకలతో అనుబంధ ఆస్పత్రి, ఓపీ, ఐపీ నమోదవుతున్నట్లు రికార్డుల్లో చూపుతున్నారు. ఎన్‌ఎంసీ బృందాలు తనిఖీలకు వచ్చిన సమయంలో అద్దె రోగులను, అతిథి అధ్యాపకులను చూపిస్తున్నారు. ఇదంతా తెలిసి కూడా ఆ అధికారులు మౌనంగా వెనుతిరుగుతున్నారు. కాలేజీ యాజమాన్యం వెనుక గతంలో ‘పెద్ద’ల సభకు ప్రాతినిధ్యం వహించిన ఓ నేత, ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు ఉండటమే ఇందుకు కారణమనే ప్రచారం ఉంది. సదరు నేత ప్రభుత్వ నిధులతో సొంత కాలేజీకి రహదారి వేసుకున్నట్లు ప్రచారం కూడా ఉంది. ఇదిలా ఉంటే ఈ అంశంపై వివరణ కోరేందుకు కాలేజీ ప్రిన్సిపాల్‌ను ‘సాక్షి’ఫోన్‌లో సంప్రదించగా, ఆయన అందుబాటులోకి రాలేదు. 

గుర్తింపు రద్దు చేయాలి: గెల్లు శ్రీనివాస్‌ యాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు, టీఆర్‌ఎస్వీ 
కాళోజీ హెల్త్‌ వర్సిటీ అధికారులు, నోవా మెడికల్‌ కాలేజీ యాజమాన్యంతో కుమ్మక్కైంది. అనుబంధ ఆస్పత్రి, ఓపీ, ఐపీ, ఐసీయూ సర్వీసులు లేకపోయినా ఉన్నట్లు నిర్ధారించి గుడ్డిగా అనుమతులు జారీ చేశారు. 1985 నుంచి కొనసాగుతున్న దెక్కన్, అపోలో, కామినేని వంటి పెద్ద కాలేజీలకూ ఇప్పటివరకు 250 ఎంబీబీఎస్‌ సీట్లు కేటాయించలేదు. అలాంటిది మూడేళ్ల క్రితం ఏర్పడిన నోవా కాలేజీకి అన్ని సీట్లు ఎలా ఇచ్చారో స్పష్టం చేయాలి. అనుమతులు ఇచ్చిన తనిఖీ అధికారులపై చర్యలు తీసుకోవాలి. నిర్మాణ, ఇతర అనుమతులు కూడా లేని ఆయా భవనాల్లో కాలేజీకి ఎలా అనుమతి ఇచ్చారో స్పష్టం చేయాలి. కాలేజీ గుర్తింపు రద్దుచేయాలి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement