breaking news
Banjara hills Boy
-
లవర్ చాట్ చేయమంటుంది.. ఫోన్ కొనిస్తే వస్తా.. లేదంటే చస్తా!
సాక్షి, హైదరాబాద్: తనకు స్మార్ట్‌ఫోన్ కొనివ్వాలని తల్లితో వాగ్వివాదానికి దిగిన ఓ బాలుడు తల్లి నిరాకరించేసరికి చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. బంజారాహిల్స్ ఎన్బీటీనగర్ బస్తీలో నివసించే ఓ విద్యార్థి (15) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. కొద్ది రోజులుగా ఏపీలోని తునికి చెందిన ఓ బాలికతో ప్రేమలో పడ్డాడు.చాటింగ్ చేసుకోవడానికి, మాట్లాడుకోవడానికి, ఇన్‌స్టాలో ఫోటోలు షేర్ చేసుకోవడానికి ఫోన్ లేకపోవడంతో బాలిక అఖిల్‌పై ఒత్తిడి పెంచింది. దీంతో తనకు స్మార్ట్ ఫోన్ కొనివ్వాలంటూ కొద్ది రోజుల నుంచి అఖిల్ తల్లితో గొడవ పడుతున్నాడు. పదో తరగతిలో బుద్ధిగా చదువుకోవాలని, ఈ వయస్సులో స్మార్ట్‌ఫోన్ వద్దంటూ తల్లి వారించినా వినిపించుకోలేదు.దీంతో రెండు రోజుల క్రితం తల్లిదండ్రులకు చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో పడుకున్నాడు. అక్కడే గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ తీసుకుని తన తల్లికి ఫోన్ చేసి ‘ఫోన్ కొనిస్తే వస్తా.. లేకపోతే చస్తా..’అంటూ చెప్పాడు. అప్పటికే తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ కాల్ నెంబర్ ఆధారంగా అఖిల్‌ను గుర్తించారు. ఠాణాకు తీసుకువచ్చి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం తల్లికి అప్పగించారు. బంజారాహిల్స్ పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సైకిల్ కోసం తమ్ముడితో గొడవపడి..
బంజారాహిల్స్: సైకిల్ కోసం ఇంట్లో తమ్ముడితో గొడవపడిన ఓ బాలుడు అదృశ్యమైన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని దుర్గా ఎన్‌క్లేవ్‌కు చెందిన అశోక్‌దాస్ స్థానిక సెయింట్ అగస్టీన్ హైస్కూల్లో 7వ తరగతి చదువుతున్నాడు. కొద్ది రోజులుగా తన సోదరుడు అభినాకాంత్తో సైకిల్ విషయమై గొడవపడుతున్నాడు. తల్లిదండ్రులు తమ్ముడికే మద్దతు ఇస్తున్నారంటూ అలిగి బుధవారం ఉదయం చెప్పకుండా బయటికి వెళ్లి తిరిగిరాకపోవడంతో తండ్రి ఆనంద్ కిషోర్ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆచూకీ తెలిసిన వారు 8106216163 నంబర్లో సంప్రదించాలని కోరారు.


