‘సురేఖ.. సుస్మిత వ్యాఖ్యలను ఖండించాలి కదా?’ | Telangana Congress Leaders Serious on Konda Surekha Issue | Sakshi
Sakshi News home page

‘సురేఖ.. సుస్మిత వ్యాఖ్యలను ఖండించాలి కదా?’

Aug 21 2026 12:36 PM | Updated on Aug 21 2026 1:18 PM

Telangana Congress Leaders Serious on Konda Surekha Issue

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత రాజకీయం మరోసారి వేడెక్కింది. సీఎం రేవంత్‌రెడ్డిని టార్గెట్‌ చేస్తూ సొంత పార్టీ నేతల నుంచి వస్తున్న విమర్శలపై ప్రభుత్వ విప్‌లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్‌లో కొత్త వివాదానికి దారితీశాయని వారు మండిపడ్డారు. సుస్మిత చేసిన వ్యాఖ్యలను మంత్రి కొండా సురేఖ ఖండించాలని, ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని డిమాండ్‌ చేశారు.

సీఎల్పీలో ప్రభుత్వ విప్‌లు బల్మూరి వెంకట్‌, బీర్ల అయిలయ్య, వేముల వీరేశం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. కొండా సుస్మిత వ్యాఖ్యలపై నేతలు ఘాటుగా స్పందించారు. ‘సీఎంను టార్గెట్‌ చేయడం క్రమశిక్షణా రాహిత్యమే’ అని వ్యాఖ్యానించారు. సుస్మిత చేసిన వ్యాఖ్యలను మంత్రి కొండా సురేఖ ఖండించాలని, ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని డిమాండ్‌ చేశారు. సుస్మిత వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదంటున్నప్పుడు.. కొండా సురేఖ తన కుమార్తె వ్యాఖ్యలను ఎందుకు ఖండించలేదు? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డిపై ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్‌ అధిష్ఠానాన్ని కోరుతున్నామని వారు తెలిపారు. సీఎం నిర్ణయాలను వ్యతిరేకించే వ్యక్తులు పార్టీలో అవసరం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అంతేకాదు.. ఇలాంటి వారిని కేబినెట్‌లో ఉంచొద్దని సీఎంను కోరుతున్నామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ అంతర్గత విషయాలను పార్టీలోనే మాట్లాడుకోవచ్చని, కానీ కొండా సురేఖ కుటుంబం పదేపదే బహిరంగ విమర్శలు చేయడం సరికాదన్నారు. సీనియర్‌ ఎమ్మెల్యేపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. చివరగా మంత్రి కొండా సురేఖకు సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఇది కూడా చదవండి: సీఎం రేవంత్‌ అమెరికా పర్యటన రద్దు.. 

ఇదే సమయంలో తెలంగాణలో 22A భూముల వ్యవహారంపై బీఆర్‌ఎస్‌ అసత్య ప్రచారం చేస్తోందని బల్మూరి వెంకట్‌ ఆరోపించారు. అధికారుల తప్పిదాలను సరిదిద్దుతున్నామని, పేదలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య అందకూడదనే ఉద్దేశంతో బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలిసి కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. అలాగే, సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన రద్దు వెనుక కూడా బీజేపీ, బీఆర్‌ఎస్‌ కుట్ర ఉందని వెంకట్‌ ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ చేసిన తప్పులను సరిదిద్దుతూ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని చెప్పారు. అయితే స్వపక్షంలో ఉంటూ ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని ఖండిస్తున్నామని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement