పల్నాడులో కలవరపెడుతున్న టీనేజ్ ప్రెగ్నెన్సీలు! | Health problem With Teenage pregnancy | Sakshi
Sakshi News home page

పల్నాడులో కలవరపెడుతున్న టీనేజ్ ప్రెగ్నెన్సీలు!

Sep 1 2026 1:24 PM | Updated on Sep 1 2026 1:27 PM

Health problem With Teenage pregnancy

సత్తెనపల్లి ప్రాంతీయ వైద్యశాలకు గత నెల పురిటి నొప్పులతో మూడో ప్రసవానికి ఓ గర్భిణి వచ్చింది. తీవ్ర ఎనీమియాతో బాధపడుతుండటంతో ప్రసవ సమయంలో ఇబ్బందులు తప్పలేదు. గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. బిడ్డకు జన్మనిచ్చి ఆమె మరణించింది. వైద్యులు ఆరా తీయగా, ఆమె వయసు 18 ఏళ్లు మాత్రమేనని, 14వ ఏటే తొలి బిడ్డకు జన్మనిచ్చిందని తెలిసి ఆశ్చర్యపోయారు. బాల్యవివాహం, టీనేజ్‌ ప్రెగ్నెన్సీతో పుట్టిన ఇద్దరు చిన్నారులు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మూడో కాన్పులో తల్లి మరణించడంతో ముగ్గురు బిడ్డలు అనాథలయ్యారు. ఇటు ప్రభుత్వం, అటు అధికారులు టీనేజ్‌ ప్రెగ్నెన్సీని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది.

సాక్షి, నరసరావుపేట:  పల్నాడు జిల్లాలో కౌమార బాలికల్లో గర్భధారణ (టీనేజ్‌ ప్రెగ్నెన్సీ) ఆందోళన కలిగిస్తోంది. ఆర్థిక, సామాజిక అసమానతలు అధికంగా ఉన్న వెనుకబడిన జిల్లాలో బాల్యవివాహాలు, టీనేజ్‌ ప్రెగ్నెన్సీ అధికంగా ఉండటం మరింత కలవరపాటుకు గురిచేస్తోంది. బాలికల వయసు 13 నుంచి 19 ఏళ్ల మధ్య ఉన్న సమయంలో గర్భం దాల్చడం వల్ల వారి ఆశలన్నీ నీరుగారుతున్నాయి. అక్కడితో వారి జీవితం బాధ్యతల్లో బందీ అవుతోంది. మరోవైపు శారీరక, మానసిక ఆరోగ్యపరంగా వారిలో చాలా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.

దీంతో ఈ ప్రభావం ఆ కుటుంబం, సమాజంపై తీవ్రంగా పడుతోంది. బాల్యవివాహాలు, తెలిసీ తెలియని వయసులో క్షణికావేశం, అత్యాచారాలు వంటి ఘటనలు చిన్న వయసులో గర్భం దాల్చడానికి కారణమవుతున్నాయి. దీంతో తల్లీబిడ్డలను ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో పాటు మాతాశిశు మరణాల ప్రమాదమూ పెరుగుతోంది. బాలికలు గర్భం దాలి్చన సమయంలో హైపర్‌టెన్షన్, ఎనీమియా వంటి సమస్యలు తలెత్తి, అధిక శాతం సిజేరియన్‌ కాన్పులకు దారి తీస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేసే ప్రోత్సాహకాలు అందాలంటే గర్భిణులకు తప్పనిసరిగా 19 ఏళ్లు నిండి ఉండాలి. అయితే చిన్నారి బాలింతలకు ఈ పథకాలు దూరం కావడంతో సరైన పోషకాలు, ఆర్థిక సహకారం, వైద్యసేవలు అందడం లేదు. 

7.71 శాతం మంది వారే... 
పల్నాడు జిల్లాలో అత్యధికంగా మాచర్ల, గురజాల, వినుకొండ, పెదకూరపాడు నియోజకవర్గాల్లో టీనేజ్‌ ప్రెగ్నెన్సీలు అధికంగా నమోదవుతున్నాయి. ఆగస్టు నెలకు సంబంధించి ఐసీడీఎస్‌ లెక్కల ప్రకారం తొమ్మిది ప్రాజెక్టుల కింద మొత్తం 8,900 మంది గర్భిణులు నమోదయ్యారు. ఇందులో ఏకంగా 686 మంది బాలికలు గర్భవతులయ్యారని లెక్కలు చెబుతున్నాయి. ఇందులో మాచర్లలో 1,393 మందికి 116 మంది, ఈపూరు ప్రాజెక్టు పరిధిలో 532 మంది గర్భిణుల్లో 79 మంది, గురజాలలో 643 మందిలో 71 మంది, పిడుగురాళ్లలో 846 మందిలో 70 మంది టీనేజ్‌ ప్రెగ్నెన్సీలు నమోదయ్యాయి. జిల్లాలో టీనేజ్‌ ప్రెగ్నెన్సీ 7.71 శాతంగా నమోదవ్వడం ప్రమాద హెచ్చరికలను జారీ చేస్తోంది. అనధికారికంగా ఇంకా ఎక్కువే టీనేజ్‌ ప్రెగ్నెన్సీలు ఉండే అవకాశముందని, చట్టవ్యతిరేకం కావడంతో కుటుంబ సభ్యులు బయటకు రాకుండా చూస్తున్నారని సమాచారం.

తల్లిదండ్రుల్లో మార్పు రావాలి 
టీనేజ్‌ ప్రెగ్నెన్సీ తగ్గాలంటే మొదట తల్లిదండ్రుల్లో మార్పు రావాలి. అందుకే మొదట వారికి బాల్యవివాహాలు, టీనేజ్‌ ప్రెగ్నెన్సీలపై అవగాహన కల్పిస్తున్నాం. మాచర్ల, వినుకొండ, పెదకూరపాడు లాంటి నియోజకవర్గాల్లో ఎక్కువగా ఇలాంటి ఘటనలు నమోదవుతున్నాయి. చైల్డ్‌ ప్రొటెక్షన్‌ టీం, అంగన్‌వాడీ సిబ్బందితో కలిసి పంచాయతీ స్థాయిలో కమిటీలు వేసి ప్రతి 15 రోజులకు ఒకసారి సమావేశం నిర్వహిస్తున్నాం. యాక్షన్‌ ప్లాన్‌ అమలు చేస్తున్నాం. ఉన్నత పాఠశాలలు,  కాలేజీల్లో విద్యారి్థనులను చైతన్య పరిచేలా పలు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం.   
– నాగమల్లేశ్వరి, పీడీ, ఐసీడీఎస్, పల్నాడు జిల్లా 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement