ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాటర్ మాన్ ఎప్పుడు అయ్యారు? వాటర్ మాన్ అంటే రాష్ట్రానికి పుష్కలంగా నీటిని అందించిన వ్యక్తి అన్నమాట. నిజంగా ప్రాజెక్టులు నిర్మించి, ఏపీలో కరువు పరిస్థితిని పారదోలి ఉంటే ఆయన అందుకు అర్హుడు అయి ఉండేవారు. కాని వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్న అభిప్రాయం ఉంది.
అయినా ప్రాజెక్టులు ఎవరు నిర్మించినా, నీటిని కొంతమేర విడుదల చేసే అవకాశం వచ్చినంతవరకు క్రెడిట్ తీసుకుంటే ఆక్షేపణ లేదు. కాని మొత్తం ప్రాజెక్టులన్నీ ఆయనే పూర్తి చేశారేమో అన్న విధంగా ప్రచారం చేసుకోండం, దానికి తోడు వాటర్ మాన్ పదాన్ని ఎకనమిక్ టైమ్స్ పత్రిక వాడింది కనుక ఆయనకు సన్మానాలు, అభినందనలు, స్టాండింగ్ ఒవేషన్లు ఇప్పించడం మరీ కృతకంగా ఉన్నట్లు అనిపిస్తుది. పార్టీపరంగా ఏదో చేసుకుంటే చేసుకున్నారులే అనుకోవచ్చు. కాని ఏకంగా అధికారిక సమావేశంలో ఐఏఎస్ అధికారులంతా పాల్గొన్న కలెక్టర్ల సదస్సులో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వాటర్ మాన్ అంశాన్ని ప్రస్తావించి చప్పట్లు కొట్టించారు. దానికి చంద్రబాబు మురిసిపోయారు.
ఇది ఒక రకంగా అతి ప్రచారంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఐఏఎస్‌లలో చాలామంది సీనియర్లు గత పాతికేళ్లుగా ఉమ్మడి ఏపీలోకాని, విభజిత ఏపీలో కాని పనిచేసి ఉంటారు. వారందరికి వాస్తవ పరిస్థితి తెలియకుండా ఉండదు కదా! వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జలయజ్ఞం పేరుతో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిన విషయం, ఆ సమయంలో చంద్రబాబు వాటిపై విమర్శలు చేయడం, పోలవరం ప్రాజెక్టుపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం, అంతేకాక పోలవరం కాల్వలను వైఎస్ తవ్విస్తుంటే తీవ్రంగా అభ్యంతరం తెలిపి, ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని చేసిన వ్యాఖ్యలన్నీ వీడియోల రూపంలో నిక్షిప్తం అయి ఉన్నాయి.
అలాగే వెలిగొండ ప్రాజెక్టు టెక్నికల్‌గా సాధ్యం కాదని కొంతకాలం, నిధులు లేవని మరికొంతకాలం చంద్రబాబు కాలయాపన చేసిన అంశంపై వార్తలు ఇప్పటికీ వస్తూనే ఉంటాయి. అయినా అదృష్టం కొద్ది నీటిని విడుదల చేసే అవకాశం పొందారు. కాని వెలిగొండ ప్రాజెక్టు నీరు నల్లమలసాగర్‌లోకి రావడానికి అవసరమైన టన్నెల్స్ తవ్వకం, ఫీడర్ కాల్వ ఏర్పాటు, డామ్ నిర్మాణం మొదలైనవన్నిటిని చేపట్టింది వైఎస్ రాజశేఖరరెడ్డి కాదా!
ఆయన కుమారుడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టన్నెల్స్‌ను పూర్తి చేసి ఆరంభించిన సంగతి తెలియదా! నిర్వాసితులకు పెండింగులో ఉన్న పునారావాస చర్యలను అరకొరగా చేపట్టి, హడావుడిగా నీళ్లను వదలితే వాటర్ మాన్ అయిపోతారా? అలాగే పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకుండా, గ్రావిటీ ద్వారా కాకుండా లిప్ట్ ద్వారా నీటిని కాల్వలోకకి తోడితే వాటర్ మాన్ అయిపోయినట్లేనా? ఎకనమిక్ టైమ్స్ పత్రిక ఈ కార్యక్రమాలకు సంబంధించి ఒక కథనాన్ని ఇస్తూ అందులో వాటర్ మాన్‌గా పేర్కొంది.
సాధారణంగా వార్త ఇవ్వడం తప్పుకాదు. కాని అతిశయోక్తులతో, లేని బిరుదులు ఆపాదించి స్టోరీలు ఇస్తే ఆ పత్రిక విమర్శలకు గురి అవుతుంది. చంద్రబాబుకు ఎంతవరకు క్రెడిట్ ఇవ్వాలో అంతవరకు కాకుండా, మొత్తం ఏపీకి ఈయనే వాటర్ మాన్ అన్నచందంగా వార్త ఇస్తే జనం నమ్ముతారా? కాకపోతే టీడీపీ ప్రచారానికి వాడుకోవచ్చు. ఒకపక్క ఏపీలో ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. విశాఖ నగరంలో సైతం తాగు నీటి కష్టాలు ప్రజలను కలవరపెడుతున్నాయి. ఏభై శాతం పైగా వర్షపాతం లోటు ఉందని స్వయంగా చంద్రబాబే చెబుతున్నారు. వరి వేసుకోవద్దని సలహాలు ఇచ్చారు. రైతులు నానా అవస్థలు పడుతున్న టైమ్ లో చంద్రబాబును వాటర్ మాన్ అని పొగిడితే కాస్త ఎబ్బెట్లు అనిపించదా!
ఇదీ చదవండి: కలెక్టర్ల సదస్సా.. ఏకపాత్రాభినయమా? చంద్రబాబు తీరుపై చర్చ!
సుదీర్గకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడుకు నిజానికి భారీ ప్రాజెక్టులపైనే నమ్మకం లేదు. ఆ మాట ఆయన దాచుకోకుండానే గతంలో చెప్పిన సందర్భాలు ఉన్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలు వడ్డీ వీరభద్రరావు, ఎర్రా నారాయణస్వామి వంటివారు పోలవరం ప్రాజెక్టుపై ఉద్యమం చేస్తుంటే వారిని చంద్రబాబు అసలు పట్టించుకోలేదు. ఆయన చెరువుల పూడిక తీయడం, పట్టణాలలో ఇంకుడు గుంతలు వంటివాటిపైనే ఎక్కువగా కేంద్రీకరించేవారు. అయితే ఎన్నికల సమయంలో మాత్రం ఈ భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన ఫలకాలు వేసి వదలివేసేవారు.
నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి తదితరుల సమయంలో శ్రీశైలం, నాగార్జున సాగర్, పోచంపాడు వంటి ప్రాజెక్టులు రాకపోతే ఉమ్మడి ఏపీలో పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో ఊహించుకుంటేనే భయం వేస్తుంది. అంతకు ముందు ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా ఉండి విజయవాడవద్ద బారేజీ నిర్మించారు. ఆంగ్లేయుడైన కాటన్ దొర తొలుత కృష్ణా, గోదావరి నదులపై డామ్‌లు నిర్మించారు.
ఆ తర్వాత కాలంలో భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకున్నాయి. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ తెలుగు గంగ ప్రాజెక్టును చేపట్టారు. అలాగే హంద్రీ-నీవా, గాలేరు-నగరి మొదలైన ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. తదుపరి వైఎస్ రాజశేఖరరెడ్డి 48 ప్రాజెక్టులకు జీవం పోశారు. ఆయన చొరవ లేకపోతే పోలవరం, పులిచింతల, వెలిగొండ, పోతిరెడ్డిపాడు విస్తరణ మొదలైన ప్రాజెక్టులు ఉండేవి కావేమో! వైఎస్ ఆర్ పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్‌ను విస్తరిస్తున్నప్పుడు కృష్ణా డెల్టాకు అన్యాయం జరుగుతోందంటూ టీడీపీ ఎమ్మెల్యేలు విజయవాడలో ధర్నా చేయడానికి చంద్రబాబు అంగీకారం ఉందా? లేదా? అలాగే జగన్ పాలనలో రాయలసీమ లిఫ్ట్ స్కీమ్‌ను చేపడితే, దానిని వ్యతిరేకించడమే కాకుండా, తెలంగాణ సీఎం కోరారని దానిని నిలుపుదల చేయించింది ఈయన కాదా! అయినా వాటర్ మాన్ అని పిలిపించుకుంటే ఏమి చెబుదాం.
అవన్ని ఎందుకు! చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంకు జగన్ టైమ్‌లో కదా నీరు వచ్చింది. అప్పటికే సుమారు 14 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ఈ ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేకపోలేదు? కేవలం నీటిని విడుదల చేస్తేనే వాటర్ మాన్ అయిపోతే ప్రాజెక్టులు ఒక రూపానికి తీసుకువచ్చిన ఇతర ముఖ్యమంత్రులు ఏమి అవుతారు? అసలు వాటర్ మాన్‌గా ప్రసిద్ది చెందిన రాజేంద్రసింగ్ గురించి ఏమి చెప్పుకోవాలి. ఏడారిలో పచ్చదనం సృష్టించిన ఆయన ఘనత తెలియదా! మంత్రి కేశవ్‌కు ఈ విషయాలేవి తెలియక కాదు. కాని చంద్రబాబు మెప్పు పొందడానికి, టీడీపీ ప్రచారానికి ఇది ఉపయోగపడవచ్చు. అంతే తప్ప ఆయన చెప్పింది పూర్తి వాస్తవం కాదు.
ఈ పాతికేళ్లలో ఏడెనిమిది సార్లు కరువు పరిస్థితులు ఏర్పడితే అందులో ఐదారుసార్లు చంద్రబాబు పాలనలోనే అని గణాంకాలు ఇస్తూ ఎల్లో మీడియాలోనే ఒక కథనం వచ్చింది. 2014 టరమ్‌లో రెయిన్ గన్స్ ద్వారా కరువు నివారిస్తామంటూ సుమారు 400 కోట్లు వ్యయం చేశారు. ఆ తర్వాత ఆ రెయిన్ గన్స్ ఏమయ్యాయో తెలియదు. ఇజ్రాయిల్ టెక్నాలజీ అంటూ 2004 కి ముందు చంద్రబాబు కొంత హడావుడి చేసి చాలా ఖర్చు చేశారు. కుప్పంలో ప్రయోగాత్మకంగా పెట్టారు. కాని అది సఫలం అయి ఉంటే దానిని ఎందుకు చంద్రబాబు ప్రభుత్వం కొనసాగించడం లేదు? పోలవరం ప్రాజెక్టును జాప్యం చేసి, పట్టిసీమ వద్ద లిఫ్ట్ పెట్టామని చెబితే సరిపోతుందా? ఆ లిఫ్ట్ ద్వారా వచ్చే నీళ్లు వైఎస్ నిర్మించిన కాల్వలలోనే ప్రవహిస్తున్నది.
ఎకనమిక్ టైమ్స్ పత్రిక ప్రతినిధికి అన్ని విషయాలు తెలిసి ఉండకపోవచ్చు. ఆ పత్రికలో వాటర్ మాన్ అని రాసేస్తే అయిపోతుందా!అన్ని విషయాలు విశ్లేషించాలి కదా! ఈ మధ్య అమరావతిపై న్యూయార్క్ టైమ్స్ కథనం అంటూ ఒక దానిని ప్రచారం చేశారు. అందులో వాస్తవాలకన్నా అతిశయోక్తులే ఎక్కువగా కనిపించాయి. దాంతో అంతర్జాతీయ పత్రికలైనా, జాతీయ పత్రికలైనా మేనేజ్ మెంట్‌కు అతీతం కావు అన్న భావన ఏర్పడింది.
తనకు డాక్టరేట్ ఇవ్వడానికి ఆయా యూనివర్శిటీలు ఆసక్తి చూపినా తాను ఒప్పుకోలేదని చంద్రబాబు అన్నారట. గతంలో ఒకసారి చికాగోకు చెందిన ఒక యూనివర్శిటీ ఆయనకు డాక్టరేట్ ప్రకటించినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కాని ఆ తర్వాత ఆ యూనివర్శీటీ స్థితిగతులపై అనేక విమర్శలు వచ్చాయి. వీటిని పక్కనబెడితే ఏపీలో కరువును శాశ్వతంగా నివారించే దిశగా ఇప్పటికైనా చంద్రబాబు చిత్తశుద్దితో చర్యలు చేపట్టి మంచి పేరు తెచ్చుకోవాలి. అప్పుడు ఎవరూ అడగకుండానే ఐఏఎస్ లైనా, మరెవరైనా చప్పట్లు కొడతారన్న సంగతి గ్రహించాలి.
-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


