విజయవాడలో హెల్త్ వర్సిటీ గేటు ముందు ఆందోళన చేస్తున్న పారా మెడికల్ విద్యార్థులు
అకడమిక్ క్యాలెండర్‌ను మార్చాలి
పారామెడికల్ విద్యార్థుల ఆందోళన
విజయవాడ హెల్త్ యూనివర్సిటీ ముట్టడి
సాక్షి, అమరావతి: పారామెడికల్ విద్యార్థులకు నెలకు రూ.15 వేలు స్టైపెండ్ ఇవ్వాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ విషయంపై సీఎం చంద్రబాబుకు వినతి పత్రం ఇచ్చినా పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టైపెండ్ పెంపు సహా తాము ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పారామెడికల్ విద్యార్థులు విజయవాడలో గురువారం ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని ముట్టడించారు. వర్సిటీలోకి చొచ్చుకెళ్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో వర్సిటీ ప్రధాన గేట్ ముందు నినాదాలు చేస్తూ, విద్యార్థులు నిరసన తెలిపారు. స్టైపెండ్ ఇవ్వాలని కోరుతుంటే ప్రభుత్వం డబ్బుల్లేవని సమాధానం చెబుతోందని మండిపడ్డారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో చదివే ఎంబీబీఎస్, పీజీ, నర్సింగ్ ఇతర కోర్సుల్లో చదివే వారందరికీ స్టైపెండ్ ఇస్తున్న ప్రభుత్వం పారామెడికల్ విద్యార్థులపై చిన్న చూపు చూస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. మూడేళ్లలో పూర్తవ్వాల్సిన కోర్సును ఆరేళ్లు చేసి తమ జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం వర్సిటీ వీసీ చంద్రశేఖర్‌కు వినతిపత్రం అందించారు.
సర్కారు తీరు దురదృష్టకరం
స్టైపెండ్ పెంచాలని రెండు వారాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పి. రామ్మోహన్, కె. ప్రసన్నకుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. పారామెడికల్ విద్యార్థుల సమస్యలపై నిర్లక్ష్యం తగదన్నారు. 2021లో కోర్సుల్లో చేరిన విద్యార్థులు ఇప్పటికీ తమ కోర్సులను పూర్తి చేసుకోలేకపోవడం దురదృష్టకరమన్నారు. పారామెడికల్ అకడమిక్ క్యాలెండర్‌ను వెంటనే మార్చాలని డిమాండ్ చేశారు.
చెత్త కోర్సులంటూ అవమానించారు
ప్రభుత్వ వైద్య కాలేజీల్లో చదివే ఎంబీబీఎస్, పీజీ, నర్సింగ్ విద్యార్థులకు ప్రభుత్వం స్టైపెండ్, హాస్టల్ వసతి కల్పిస్తోందని పారామెడికల్ విద్యార్థులు చెప్పారు. స్టైపెండ్ సహా, ఇతర సమస్యలను పరిష్కరించాలని ఇటీవల డీఎంఈని కలిస్తే పారా మెడికల్ కోర్సులు చెత్త అంటూ అవమానించారని ఆవేదన వ్యక్తంచేశారు. చెత్త కోర్సులు అయినప్పుడు ప్రభుత్వం ఎందుకు ప్రవేశాలు నిర్వహిస్తోందని విద్యార్థులు ప్రశ్నించారు.


