ఈ ఏడాది ఇదే మొదటిది..
తూర్పు మధ్య బంగాళాఖాతంలో 20 తర్వాత వాయుగుండం
ఎల్‌నినో, వేడిగాలులు తోడైతే తీవ్రంగా మారే సూచనలు
ఉత్తరాంధ్ర, పశ్చిమ ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం
తుపాను ఏర్పడుతుందని గ్లోబల్ మోడల్స్ ట్రాక్ అంచనా
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. ఈ ఏడాది తొలి తుపాను ముంచుకొస్తున్నట్లు వాతావరణ నమూనాలు స్పష్టమైన హెచ్చరికలు జారీచేస్తున్నాయి. ఈ నెల 20 తర్వాత తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఒక బలమైన వాయుగుండం ఏర్పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సముద్రంలో నెలకొన్న అనుకూల పరిస్థితుల నేపథ్యంలో ఈ వాయుగుండం మరింతగా బలపడితే, అది తుపానుగా రూపాంతరం చెందే అవకాశం ఉంది. దీని ప్రభావం ఉత్తరాంధ్రపై ఉండబోతుందని అంతర్జాతీయ వాతావరణ నమూనాలు (గ్లోబల్ మోడల్స్) అంచనా వేస్తున్నాయి.
19న అల్పపీడన ద్రోణి..
ఈ నెల 19న అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి ఏర్పడనుంది. ఇది క్రమంగా బలపడుతూ పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి 22 నుంచి 26 నాటికి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాలకు చేరుకునే అవకాశం ఉంది. ఈ సమయంలో ఇది వాయుగుండంగా మారి మరింత బలపడే సూచనలున్నాయి. అనంతరం.. ఈ ఏడాది దేశంలో మొదటి తుపానుగా మారబోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తుపానుగా బలపడితే.. దీనికి బంగ్లాదేశ్ సూచించిన ‘ఆర్నబ్’గా నామకరణం చేయనున్నారు. ఆర్నబ్ అంటే బెంగాలీలో సముద్రం లేదా మహా సముద్రం అని అర్థం.
గ్లోబల్ మోడల్స్ ఏం చెబుతున్నాయంటే..?
ఈ తుపాను తీవ్రతపై గ్లోబల్ మోడల్స్ ఆందోళనకరమైన అంచనాలను వెలువరిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడనున్న ఈ వ్యవస్థకు.. ప్రస్తుతం వాతావరణంలో ఉన్న ఎల్‌నినో పరిస్థితులు, అదేవిధంగా.. తీవ్రమైన వేడిగాలులు తోడైతే ఇది మరింత వేగంగా శక్తిని పుంజుకుంటుందని అంచనా వేస్తున్నాయి. ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితులు జతకలిస్తే, ‘ఆర్నబ్’ కేవలం సాధారణ తుపానుగానే కాకుండా అత్యంత ‘తీవ్ర తుపాను’గా బలపడే సూచనలు కూడా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. అయితే, అల్పపీడనం వాయుగుండంగా మారిన తర్వాత దీని తీవ్రతపై మరింత స్పష్టత రావచ్చు.
ఉత్తరాంధ్ర–ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం..
ఇక ఈ ‘ఆర్నబ్’ తుపాను గమనం ప్రధానంగా తూర్పు తీరం వైపు పయనించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తాజా అంచనాల ప్రకారం.. ఈ తుపాను ఉత్తరాంధ్ర, పశ్చిమ ఒడిశా ప్రాంతాల మధ్య తీరందాటే అవకాశం ఉందని సూచిస్తోంది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత 20 నుంచి ఒడిశాతో పాటు ఉత్తరాంధ్ర, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో నెమ్మదిగా వర్షాలు మొదలై 21 రాత్రి నుంచి లేదా 22 ఉదయం నుంచి భారీ వర్షాలు పడేందుకు ఆస్కారం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.
వర్షాభావ పరిస్థితుల నుంచి ఉపశమనం..
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితుల్లో ‘ఆర్నబ్’ రాక ఒక రకంగా వరమే అని చెప్పాలి. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఆశించిన స్థాయిలో వర్షాల్లేక ప్రాజెక్టులు అడుగంటి, భూగర్భ జలాలు పడిపోయి తీవ్ర జలసంక్షోభం నెలకొంది. ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు, రైతులు విలవిల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో తుపాను వస్తే రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయి. దీంతో జలసంక్షోభం నుంచి రాష్ట్రాన్ని కొంతమేర గట్టెక్కించడంతో పాటు, డార్క్ జోన్‌గా మారుతున్న భూగర్భ జలాలకు ప్రాణం పోసి కాస్త ఉపశమనం కలిగిస్తాయని వాతావరణ విశ్లేషకులు భావిస్తున్నారు.


