ఆర్థికేతర అంశాల పరిష్కారంలోనూ బాబు సర్కారు వైఫల్యం
ప్రజా సమస్యల పరిష్కారంపై కాకి లెక్కలతో సరి..
సామాజిక, వ్యక్తిగత ఇబ్బందులతో జనం సతమతం
సర్కారు తీరుపై 85 శాతం వరకు అసంతృప్తి.. ఆగస్టు 6 నుంచి సెప్టెంబర్ 6 మధ్య ఇదీ పరిస్థితి
ప్రభుత్వ ప్రజాభిప్రాయ సేకరణ ఆడిట్‌లో వెల్లడి
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీలను నెరవేర్చకుండా వివిధ పథకాల కింద పెద్ద ఎత్తున డబ్బులు ఎగ్గొట్టిన చంద్రబాబు సర్కారు కనీసం ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీరు, డ్రెయినేజీ, ఇళ్లు, రేషన్ కార్డులు, పింఛన్లు లాంటి సామాజిక, వ్యక్తిగత సమస్యల పరిష్కారంలోనూ ఘోరంగా విఫలమైనట్లు ప్రభుత్వమే స్వయంగా నిర్వహించిన ఆడిట్‌లో వెల్లడైంది. ఈ ఏడాది ఆగస్టు నుంచి సెప్టెంబర్ మధ్య ప్రభుత్వం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. ప్రజల అర్జీలను పరిష్కరించకుండానే పరిష్కరించినట్లు చెబుతుండటంపై అసంతృప్తి వెల్లువెత్తుతోంది. పరిష్కరించినట్లు చెబుతున్న అర్జీలపై ఆడిట్ నిర్వహించగా 60 నుంచి 85 శాతం వరకు అసంతృప్తి వ్యక్తమైంది. సమస్యలను పరిష్కరించినట్లు చూపుతున్న గణాంకాల్లో వాస్తవం లేదని, అవన్నీ తప్పుల తడకేనని తేలింది. ఎక్కువగా భూములకు సంబంధించిన సమస్యలు, పట్టాదారు పాసు పుస్తకాలు, మ్యుటేషన్, భూమి కొలతలు, విస్తీర్ణంలో తేడాలను సరిచేయడం, 22 ఏ నుంచి తొలగించాలని కోరుతూ రెవెన్యూ శాఖకు లక్షల్లో దరఖాస్తులు వచ్చాయి. వాటిని పరిష్కరించడంలో చంద్రబాబు సర్కారు విఫలమైనట్లు ప్రజాభిప్రాయ సేకరణ ఆడిట్‌లో స్పష్టమైంది.
⇒ ఆగస్టు 6వ తేదీ నుంచి సెప్టెంబర్ 6 వరకు వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోసం ప్రజల నుంచి ప్రభుత్వానికి 66,436 అర్జీలు అందాయి. ఇందులో 19,816 అర్జీలను పరిష్కరించినట్లు చెబుతుండగా దీనిపై నిర్వహించిన ఆడిట్‌లో 38 శాతం అసంతృప్తి వ్యక్తమైంది. మరో 46,620 అర్జీలు పెండింగ్‌లో మగ్గుతున్నాయి.
⇒ వ్యక్తిగత ఇబ్బందుల పరిష్కారానికి సంబంధించి అన్నమయ్య జిల్లాలో 83 శాతం, మార్కాపురం జిల్లాలో 85 శాతం, అనకాపల్లి జిల్లాలో 67 శాతం, తిరుపతి జిల్లాలో 53 శాతం, పల్నాడు జిల్లాలో 57 శాతం, బాపట్ల జిల్లాలో 60 శాతం, కర్నూలు జిల్లాలో 63 శాతం అసంతృప్తి వ్యక్తమైంది.
⇒ కమ్యూనిటీ సమస్యల పరిష్కారంలోనూ అదే స్థాయిలో ప్రజల నుంచి అసంతృప్తి వ్యక్తమైంది. కమ్యూనిటీ సమస్యల పరిష్కారం కోసం ప్రజల నుంచి 23,472 అర్జీలు వచ్చాయి. ఇందులో 8,866 అర్జీలను పరిష్కరించినట్లు తేల్చారు. అయితే పరిష్కరించిన అర్జీలపై ఆడిట్ ద్వారా ప్రజాభిప్రాయాన్ని సేకరించగా 42 శాతం అసంతృప్తి వ్యక్తమైంది. మరో 14,606 సమస్యలకు చెందిన అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయి. కమ్యూనిటీ సమస్యల పరిష్కారం తీరు పట్ల 61 నుంచి 85 శాతం వరకు అసంతృప్తి వ్యక్తమైంది.
⇒ అల్లూరి సీతారామరాజు జిల్లాలో 85 శాతం, పల్నాడు జిల్లాలో 64 శాతం, మార్కాపురం జిల్లాలో 70 శాతం, నెల్లూరు జిల్లాలో 55 శాతం, చిత్తూరు జిల్లాలో 51 శాతం, తిరుపతి, బాపట్ల జిల్లాల్లో 66 శాతం, పోలవరం జిల్లాలో 82 శాతం, పార్వతీపురం మన్యం జిల్లాలో 61 శాతం చొప్పున అసంతృప్తి వ్యక్తమైంది.


