‘సాక్షి’ కథనంతో దిగొచ్చిన సర్కార్
మెరిట్ ఆధారంగా వెటర్నరీ అసిస్టెంట్
సర్జన్ పోస్టుల భర్తీకి ఇచ్చిన ఉత్తర్వులు రద్దు
ఏపీపీఎస్సీ ద్వారా రాత పరీక్ష ఆధారంగానే భర్తీకి చర్యలు
ఈ మేరకు తాజాగా జీవో 24 జారీ చేసిన ప్రభుత్వం
మెరిట్ ఆధారంగా భర్తీకి గతంలో ఇచ్చిన జీవో 22 రద్దు
‘సాక్షి’ వరుస కథనాలతో ప్రభుత్వ వర్గాల్లో కలకలం
హర్షం వ్యక్తం చేస్తున్న పట్టభద్రులు, నిరుద్యోగులు
సాక్షి, అమరావతి: పశుసంవర్ధక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (వీఏఏస్) పోస్టుల భర్తీలో చంద్రబాబు ప్రభుత్వం అడ్డదారులు తొక్కుతోందంటూ ‘సాక్షి’లో ప్రచురితమైన వరుస క«థనాలు ప్రకంపనాలు సృష్టించాయి. దీంతో ప్రభుత్వం దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఏపీపీఎస్సీ ద్వారానే రాత పరీక్ష ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేసేందుకు తాజాగా ముందుకొచ్చింది. ఈమేరకు ముందుగా జారీ చేసిన జీవో 22 రద్దుచేసి దాని స్థానంలో గురువారం కొత్తగా జీవో 24 జారీ చేసింది. ప్రభుత్వంలో కదలిక తెచ్చిన ‘సాక్షి’కి తామంతా రుణపడి ఉంటామంటూ బీవీఎస్సీ, ఎంవీఎస్సీ పట్టభద్రులు, నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వరుస కధనాలతో ప్రభుత్వ పెద్దల మంత్రాంగం బట్టబయలు..!
పశుసంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న 357 వీఎఎస్ పోస్టుల్లో తొలి విడతగా 164 పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా మెరిట్ ఆధారంగా భర్తీ చేస్తామంటూ ప్రభుత్వం తొలుత ఈనెల 13వతేదీన జీవో ఆర్టీ నెం.21 జారీచేసింది. అయితే 24 గంటలు తిరక్కుండానే ఈ జీవోను వెనక్కి తీసుకొని డిపార్టుమెంటల్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) ద్వారా మెరిట్ ప్రాతిపదికన భర్తీ చేస్తామంటూ రివైజ్డ్ జీవో 22ను జారీ చేసింది. ఈ జీవోల మార్పిడి వెనుక జరిగిన వసూళ్ల పర్వం, పోస్టుల అమ్మకాలపై ప్రభుత్వ పెద్దలు సాగించిన మంత్రాంగంపై లోతైన పరిశీలనతో ఈ నెల16న ‘అంగట్లో వెటర్నరీ పోస్టులు’, 17న ‘అంగట్లో వెటర్నరీ పోస్టులపై అలజడి’ శీర్షికన ‘సాక్షి’ వరుస కధనాల ద్వారా బట్ట బయలు చేసింది. మెగా డీఎస్సీ పేరిట నిరుద్యోగ యువతను దగా చేసి ఉపాధ్యాయ పోస్టులను ఫేక్ సరి్టఫికెట్లతో అమ్మేసుకున్నట్టుగానే మెరిట్ ప్రాతిపదికన వీఏఏస్ పోస్టులను అమ్మేసుకుంటున్న తీరును సాక్షి వెలుగులోకి తీసుకొచ్చింది. మెరిట్ ఆధారంగా అయితే ఇప్పటికే అర్హత పొందిన వారి నుంచి వసూళ్లు సాగించవచ్చని భావించిన ప్రభుత్వ పెద్దలు ఒక్కో పోస్టుకు రూ.15 లక్షల నుంచి‡ రూ.20 లక్షల వరకు వసూళ్లకు తెర తీశారు. పైగా మంత్రి అచ్చెన్నాయుడు ‘సాక్షి’ కథనాలపై స్పందిస్తూ ఈ ఒక్కసారే మెరిట్ ఆధారంగా పోస్టులు భర్తీ చేస్తున్నామని చేసిన ప్రకటన మరిన్ని అనుమానాలకు తావిచ్చింది.
నిరుద్యోగ వెటర్నరీ పట్టభద్రుల మండిపాటు
తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, హర్యానా, అసోం తదితర రాష్ట్రాల్లో వీఏఏస్ పోస్టులను రాత పరీక్ష ద్వారా భర్తీ చేస్తుంటే ఏపీలోమాత్రం మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించడం పట్ల నిరుద్యోగ పట్టభద్రులు మండిపడ్డారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే తాము కోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని హెచ్చరించారు. మరోవైపు బుధవారం సీఎం చంద్రబాబు నిర్వహించిన వ్యవసాయ అనుబంధ శాఖల సమీక్షలో ‘సాక్షి’ వరుస కధనాలే హాట్‌టాపిక్ అయ్యాయి. డీఎస్సీ ద్వారా మెరిట్ ఆధారంగా భర్తీచేస్తే తలెత్తే పరిణామాలపై లోతైన చర్చ జరిగింది. ఇప్పటికే మెగా డీఎస్సీ పేరిట దగా చేసిన వైనంపై పీకల్లోతు ఇరుక్కున్న ప్రభుత్వం వెటర్నరీ పోస్టుల భర్తీలో మరోసారి మొండిగా ముందుకెళ్తే మరింత ఇబ్బందులు ఎదుర్కొక తప్పదని పలువురు సీనియర్ అధికారులు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది.
చేసేదిలేక వెనక్కి తగ్గిన ప్రభుత్వం
వీఏఏస్ పోస్టులపై తర్జన భర్జనల అనంతరం డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలన్న ప్రతిపాదనను వెనక్కి తీసుకొని పొరుగు రాష్ట్రాల్లో మాదిరిగానే రాత పరీక్ష ద్వారానే ఎంపిక చేయాలనే నిర్ణయానికి వచ్చారు. దీంతో ప్రభుత్వం విధిలేని పరిస్థితుల్లో డీఎస్సీ ద్వారా మెరిట్ ప్రాతిపదికన భర్తీ చేయాలంటూ ముందుగా జారీ చేసిన జీవో 22ను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. దాని స్థానంలో గురువారం జీవో 24 వెలువడింది. ఏపీపీఎస్సీ ద్వారా రాత పరీక్ష ఆధారంగానే వీఏఏస్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే అమల్లో ఉన్న మెరిట్ ఆధారిత ఎంపిక విధానం, వెయిటేజ్‌తో పరీక్ష లేకుండా వీఏఏస్ పోస్టుల భర్తీ చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు స్పష్టం చేసింది. పారదర్శకత, ఎంపికలో ఏకరూపతను నిర్ధారించేందుకే మెరిట్ ఆధారిత విధానానికి బదులుగా రాతపరీక్ష నిర్వహించి ఏపీపీఎస్సీ ద్వారా వీఏఏస్‌లను నియమించాలని నిర్ణయించినట్టు ఆ ఉత్తర్వులో పేర్కొంది. నియామక ప్రక్రియలో అభ్యర్థుల ప్రతిభను పరీక్ష ద్వారా అంచనా వేసే విధానాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపింది. దీంతో ఖాళీగా ఉన్న వీఏఏస్ పోస్టులన్నీ ఏపీపీఎస్సీ ద్వారా మాత్రమే భర్తీ చేయనున్నారు. ఈమేరకు సాధారణ పరిపాలన శాఖ, ఏపీపీఎస్సీ కార్యదర్శి, పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ తదుపరి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. పారదర్శకంగా ఈ పోస్టులను భర్తీ చేయాలని నిరుద్యోగ బీవీఎస్సీ, ఎంవీఎస్సీ పట్టభద్రులు డిమాండ్ చేస్తున్నారు. వరుస కధనాలతో ప్రభుత్వం దిగివచ్చేలా చేసిన ‘సాక్షి’ యాజమాన్యానికి ఏపీ నిరుద్యోగ రిజిస్టర్డ్ వెటర్నరీ గ్రాడ్యుయేట్లు కృతజ్ఞతలు తెలియజేశారు.


