వేగంగా భూముల సర్వే | Land Survey at KCR Farm House | Sakshi
Sakshi News home page

వేగంగా భూముల సర్వే

Sep 19 2026 11:00 AM | Updated on Sep 19 2026 11:43 AM

Land Survey at KCR Farm House

మర్కూక్‌ మండలం ఎర్రవల్లిలోని కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ పరిసరాల్లో సర్వే చేస్తున్న అధికారులు, సిబ్బంది

గజ్వేల్‌/మర్కూక్‌: మర్కూక్‌ మండలం ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ పరిసరాల్లో భూముల సర్వే వేగంగా సాగుతోంది. రెండో రోజైన శుక్రవారం ల్యాండ్‌ సర్వే అసిస్టెంట్‌ డైరెక్టర్‌  సుదర్శన్‌ ఆధ్వర్యంలో గజ్వేల్, హుస్నాబాద్, కలెక్టరేట్‌ డివిజనల్‌ ఇన్‌స్పెక్టర్లు (సర్వే విభాగం) సేవ్యానాయక్, బాలయ్య, వంశీ, మర్కూక్‌ ఆర్‌ఐ బాలయ్య, మండల సర్వేయర్‌ హరీశ్‌కుమార్‌లతోపాటు మరో ఏడుగురు సర్వేయర్లు, నలుగురు జీపీఓలు ఈ సర్వేలో పాల్గొంటున్నారు. వీరంతా బృందాలుగా విడిపోయి.. ప్రధానంగా ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ పరిసరాల్లోని 325 సర్వేనెంబర్‌లోగల 388ఎకరాల ప్రభుత్వ భూమిపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు.

ఈ భూములకు ముందుగా హద్దులు నిర్ణయించే పనిలో ఉన్నారు. రాత్రి వరకు హద్దులు దాదాపుగా ఖరారయినట్లు తెలుస్తోంది. హద్దులు తేలుతుండటంతో సర్వే నెంబర్‌లో సాగులో ఉన్న రైతులవారీగా నోటీసులు ఇచ్చి ఎవరి భూమి ఎంత?, వారికి గతంలో ఇచ్చిన పట్టా ఎంత?, కబ్జాలో ఉన్న భూమి ఎంత? అనే అంశాలను క్షణ్ణంగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. రైతువారీగా భూముల వివరాలు తేలగానే, మొత్తం భూమిలో సాగులో ఉన్నది ఎంత?, మిగిలింది ఎంత? అనే విషయాలను తేల్చనున్నారు. దీని తర్వాత 388ఎకరాల్లో ఇంకా ఏమైనా భూమి ఆక్రమణకు గురైందా? అనే అంశాలను కూడా వెలికి తీయనున్నారు.

ఇదే విషయాన్ని అధికారులు ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు తెలిసింది. ఈ విషయాలను మర్కూక్‌ తహాశీల్దార్‌ సరిత, ఏడీ(సర్వే విభాగం) సుదర్శన్‌లు ధ్రువీకరించారు. రెండో రోజు సర్వే నేపథ్యంలో అధికారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు సర్వే జరుగుతున్న భూముల వద్ద, మర్కూక్‌ తహసీల్దార్‌ కార్యాలయం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా సర్వే నేపథ్యంలో ఏం జరుగుతుందోననే భయంతో దళిత రైతులు భూముల వద్దకు చేరుకున్నారు. మా భూములను ఇతరులకు కట్టబెట్టే కుట్రలు చేయొద్దని అధికారులను వేడుకున్నారు. దశాబ్ధాలుగా పెండింగ్‌లో ఉన్న పట్టాల పంపిణీని కూడా పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. 

జన్వాడలో హైటెన్షన్‌.. కేటీఆర్‌ ఫామ్‌హౌస్‌ పరిశీలనకు కాంగ్రెస్‌ బృందం!


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement