సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్ర మంత్రి, బీజేపీ నేత జి. కిషన్‌రెడ్డి స్పందించారు. ఈ తీర్పు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు చెంపపెట్టు వంటిదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల తీర్పును పక్కనపెట్టి రాజకీయ అవసరాల కోసం ఫిరాయింపులను ప్రోత్సహించడం ఇకనైనా ఆపాలని డిమాండ్ చేశారు.
దానం నాగేందర్ ఎపిసోడ్‌పై తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్బంగా ఆయన.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు పెద్దగా తేడా లేదని విమర్శించారు. గతంలో బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి నేతలను పార్టీలో చేర్చుకుని మంత్రి పదవులు ఇచ్చిందని గుర్తుచేశారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా బీఆర్‌ఎస్ తరఫున గెలిచిన దానం నాగేందర్‌కు సికింద్రాబాద్ లోక్‌సభ టికెట్ ఇచ్చిందని అన్నారు. రాజకీయ అవసరాల కోసం పార్టీ మారే సంస్కృతిని ఇకనైనా నిలిపివేయాలని హితవు పలికారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండూ ఫిరాయింపు చట్టాలను ఉల్లంఘించిన పార్టీలేనని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాయని ఆయన ఆరోపించారు.
రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని కాపాడాలని మాట్లాడుతున్నారని, అలాంటప్పుడు బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన వ్యక్తికి కాంగ్రెస్ తరఫున లోక్‌సభ టికెట్ ఎలా ఇచ్చారని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. రాజ్యాంగం గురించి మాట్లాడే నైతికత రాహుల్ గాంధీకి ఉందా? అని నిలదీశారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ వ్యవహారశైలి ‘నువ్వు పీనుగలు తింటే.. నేను ఏనుగులను తింటా’ అన్నట్లుగా ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజల తీర్పుకు విలువ ఇవ్వకుండా రెండు పార్టీలు ఫిరాయింపులను ప్రోత్సహించాయని ఆరోపించారు.
భూముల ధరలపైనా విమర్శలు..
తెలంగాణలో భూముల ధరలను కృత్రిమంగా పెంచి హైప్ చేస్తున్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు. గతంలో కేసీఆర్.. ఇప్పుడు రేవంత్‌రెడ్డి అదే విధానాన్ని కొనసాగిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ కాంక్రీట్ జంగిల్‌గా మారిపోయిందని, ఓపెన్ ప్లాట్‌ను ఎలా విక్రయించాలనే దానిపైనే ప్రభుత్వం దృష్టి పెడుతోందని అన్నారు. అపార్ట్‌మెంట్ నిర్మాణానికి అనుమతుల కోసం చదరపు అడుగుకు వసూలు చేస్తున్నారని ఆరోపించిన ఆయన.. “ఈ రకమైన అక్రమాల కోసమేనా 1,200 మంది బలిదానాలు చేసుకున్నది?” అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చారని, ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు అవుతున్నా రేవంత్‌రెడ్డి ఏం చేశారని నిలదీశారు.
ఆదిలాబాద్, వరంగల్ ఎయిర్‌పోర్టులపై కీలక వ్యాఖ్యలు
ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు పనులను వేగంగా పూర్తి చేసేందుకు నోడల్ ఆఫీసర్ల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. సుమారు 1,500 ఎకరాల్లో ఎయిర్‌ఫోర్స్ శిక్షణ కేంద్రం, బేస్‌తో పాటు సివిల్ ఎయిర్‌పోర్టు ఏర్పాటు కానుందని చెప్పారు. రక్షణ శాఖ నుంచి మెజారిటీ నిధులు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. వరంగల్ ఎయిర్‌పోర్టుకు డీపీఆర్ సిద్ధమవుతోందని, ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుందని కిషన్‌రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి: కోర్టుకు వెళ్లను.. ఎన్నికలొస్తే కొట్లాడుతా: దానం


