సాక్షి, హైదరాబాద్: పహాడీషరీఫ్ పోలీసుస్టేషన్ పరిధిలోని తుక్కుగూడలో నర్సుపై (21) ‘హత్యా’చారం చేసిన కేసులో నిందితుడిగా ఉన్న మహ్మద్ సనావుల్లాను (34) న్యాయస్థానంలో దోషిగా నిరూపించడానికి పోలీసులు పక్కా ఆధారాలు సేకరిస్తున్నారు. కేవలం సాక్షుల వాంగ్మూలాలు, భౌతికాంశాలే కాకుండా శాస్త్రీయ ఆధారాల పైనా దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా హతురాలి శరీరం నుంచి సేకరించిన జీవ నమూనాలను నిందితుడి నుంచి సేకరించిన శాంపిల్స్ పోలుస్తూ డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించారు.
రాష్ట్ర ఫోరెన్సిక్ లాబోరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) చేపట్టిన పరీక్షల్లో నివేదికలు పాజిటివ్‌గా వచ్చాయి. దీంతో ఈ కేసులో నిందితుడిని దోషిగా నిరూపించడంలో ఈ నివేదిక కీలకం కానుంది. దారుణం జరిగిన మరుసటి రోజే (ఆగస్టు 30) పోలీసులు బిహార్‌కు చెందిన సనావుల్లాను పట్టుకున్నారు. హత్య కేసుగా నమోదైన ఈ కేసులో తర్వాత అత్యాచారం, ఎస్సీ, ఎస్టీలపై అఘాయిత్యాల నిరోధక చట్టంలో సెక్షన్లను చేర్చారు. ఇదిలా ఉండగా నిందితుడు దాదాపు నెల రోజుల పాటు నర్సు కదలికలను గమనించినట్లు వెల్లడైంది. సనావుల్లాను అరెస్టు చేసిన పోలీసులు నేర నిరూపణలో కేవలం అతడి వాంగ్మూలం పైనే ఆధారపడకూడదని భావించారు.
ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలపైనా దృష్టి సారించారు. ఘటనాస్థలంలో లభించిన వస్తువులు, వెంట్రుకలు, ఇతర ఫోరెన్సిక్ ఆధారాలను క్లూస్ టీమ్స్ సాయంతో సేకరించారు. వీటితో పాటు నిందితుడి కదలికలకు సంబంధించిన సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫుటేజ్‌నీ సంగ్రహించారు. హతురాలి శరీరంపై నుంచి సేకరించిన డీఎన్‌ఏ నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిన అధికారులు కోర్టు అనుమతితో నిందితుడి నుంచి శాంపుల్స్ సేకరించి పరీక్ష చేయించారు.
ఈ నేపథ్యంలో ఆమె శరీరంపై లభించిన డీఎన్‌ఏ సనావుల్లా డీఎన్‌ఏతో సరిపోలినట్లు ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక అందించింది. ఇది నర్సుపై నిందితుడే లైంగిక దాడి చేశాడని న్యాయస్థానంలో నిరూపించడానికి తిరుగులేని ఆధారంగా మారనుంది. త్వరలో ఈ కేసు దర్యాప్తు పూర్తి చేసి న్యాయస్థానంలో అభియోగపత్రాలు దాఖలు చేయడానికీ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.
ఇదీ చదవండి: వివాహేతర సంబంధం.. మహిళ దారుణ హత్య!


