breaking news
subsidised LPG
-
ఆధార్ బయోమెట్రిక్ లేకుంటే గ్యాస్ సబ్సిడీ కట్
సాక్షి, హైదరాబాద్: గ్యాస్ సిలిండర్ కావాలంటే ఇక ఆధార్ బయోమెట్రిక్ ధ్రువీకరణ తప్పనిసరి. ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ అథెంటికేషన్ (బీఏఏ) పూర్తి చేయని కుటుంబాలకు అక్టోబర్ 1 నుంచి 14.2 కేజీల గృహ ఎల్పీజీ సిలిండర్‌ను సబ్సిడీతో అందించే విధానానికి కేంద్రం బ్రేక్ వేయనుంది. బీఏఏ పూర్తయ్యే వరకు 14.2 కేజీల సబ్సిడీ రీఫిల్ బుక్ చేసుకునే అవకాశం ఉండదు. అయితే కనెక్షన్ రద్దు చేయడం, గ్యాస్ పూర్తిగా నిలిపివేయడం ఉండదు. అవసరమైతే 5 లేదా 10 కేజీల సిలిండర్లను మార్కెట్ ధరకు మాత్రమే కొనుగోలు చేయాలి. బీఏఏ పూర్తి చేసిన వెంటనే 14.2 కేజీల సబ్సిడీ రీఫిల్ సౌకర్యం పునరుద్ధరిస్తారు. బీఏఏ అంటే.. గ్యాస్ కనెక్షన్దారుడి ఆధార్ వివరాలను వేలిముద్ర లేదా ముఖ గుర్తింపు వంటి బయోమెట్రిక్ విధానంలో ధ్రువీకరించడమే బీఏఏ. అంటే గ్యాస్ కనెక్షన్ నిజమైన వినియోగదారుడిదేనని ఆధార్‌తో నిర్ధారించే ప్రక్రియ. బీఏఏ పూర్తి చేసేందుకు తొలుత జూన్ 30ను గడువుగా నిర్ణయించిన కేంద్రం.. ఆ తర్వాత పలుమార్లు పొడిగిస్తూ చివరకు ఈనెల 14 వరకు అవకాశం ఇచ్చింది. అయితే గడువు ముగిసినా, బీఏఏ చేసుకునే అవకాశం పూర్తిగా మూసివేయలేదు. ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్న వినియోగదారులు బీఏఏ పూర్తి చేసుకోవచ్చు. ఇప్పటికే ధ్రువీకరణ పూర్తిచేసిన వారికి ఎలాంటి అదనపు ప్రక్రియ అవసరం లేదు. బీఏఏ పూర్తికాని వినియోగదారులకు వచ్చే నెల 1 నుంచి ప్రధానంగా ఇబ్బంది కలిగేది 14.2 కేజీల సబ్సిడీ సిలిండర్ విషయంలోనే. బీఏఏ పూర్తయ్యే వరకు ఆ రీఫిల్‌ను నియంత్రిత ధరకు బుక్ చేసుకునే అవకాశం ఉండదు. గ్యాస్ అవసరం ఉన్నవారు ఆయిల్ కంపెనీల లభ్యతను బట్టి 5 లేదా 10 కేజీల సిలిండర్లను మార్కెట్ ధరకు తీసుకోవచ్చు. వీటిపై సబ్సిడీ ఉండదు. తెలంగాణలో 88 శాతం పూర్తి తెలంగాణలో సుమారు 1.26 కోట్ల గృహ ఎల్పీజీ కనెక్షన్లు ఉన్నాయి. సెపె్టంబర్ 14 గడువు నాటికి అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం సుమారు 88 శాతం మంది బీఏఏ పూర్తి చేశారు. మరోవైపు దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 19 నాటికి 27.43 కోట్ల మంది యాక్టివ్ గృహ ఎల్పీజీ వినియోగదారులు, అంటే 89.9 శాతం మంది బీఏఏ పూర్తి చేసినట్టు కేంద్రం వెల్లడించింది. గడువు సమీపించిన సమయంలో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గ్యాస్ ఏజెన్సీల వద్ద బీఏఏ కోసం రద్దీ పెరిగింది. దీంతో గడువును కేంద్రం పలు దఫాలు పొడిగించింది. ప్రస్తుతం మిగిలిన వినియోగదారులు ఆలస్యం చేయకుండా ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. వినియోగదారులు సిలిండర్ డెలివరీ సమయంలోనే డెలివరీ సిబ్బంది ద్వారా, గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ కార్యాలయంలో లేదా సంబంధిత ఆయిల్ కంపెనీ మొబైల్ యాప్ ద్వారా బీఏఏ పూర్తి చేసుకోవచ్చు. ఇండేన్, భారత్‌గ్యాస్, హెచ్‌పీ గ్యాస్ సంస్థలు డిజిటల్ మార్గాలను అందుబాటులో ఉంచాయి. -
స్వచ్ఛందంగా ఇచ్చేస్తున్నారు!
పాలకుల ఆరంభ శూరత్వం ప్రభుత్వ పథకాల పాలిట శాపంగా మారుతోంది. పథకాల ప్రారంభానికే పరిమితమవుతున్న విధాన నిర్ణేతల అలక్ష్యంతో అంతిమ లక్ష్యం కొడిగడుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల 'గివ్ ఇట్ ఆప్' కాల్ ఇచ్చారు. వంటగ్యాస్‌ను మార్కెట్ ధరకు కొనుగోలు చేసే స్తోమత ఉన్నవారు ప్రభుత్వం ఇచ్చే రాయితీని స్వచ్ఛందంగావదులుకోవాలని ఎల్పీజీ వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు. పిలుపు వరకు బాగానే ఉంది కానీ అమలు తీరే ఉస్సూరనిపిస్తోంది. ప్రధాని సందేశాన్ని వినియోగదారులకు చేరవేయడంలో సహజవాయు-పెట్రోలియం మంత్రిత్వ శాఖ చతికిలపడింది. అయినప్పటికీ విజ్ఞులైన స్థితిమంతులు తమకు తాముగా ముందుకు వచ్చి రాయితీ వదులుకుంటున్నారు. ఈ విషయంలో తెలుగు ప్రజలు కాస్త ముందున్నారు. తాజా సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 5,628 మంది స్వయంగా సబ్సిడీ రద్దు చేసుకున్నారు. ఏపీలో 2,477 మంది, తెలంగాణలో 3,151 స్వచ్ఛందంగా సబ్సిడీ వద్దనుకున్నారు. ఏపీలో 86 లక్షల మంది, తెలంగాణలో 70 లక్షల మంది ఎల్పిజీ వాడుతున్నారు. సబ్సిడీ వదులుకున్న వారిలో ఎక్కువ మంది వేతనజీవులు ఉండడం విశేషం. దేశవ్యాప్తంగా 3.5 లక్షల మంది రాయితీ రద్దు చేసుకున్నారు. ప్రధాని పిలుపునిచ్చిన వారానికే 2 లక్షల మంది స్వచ్ఛందగా సబ్సిడీ వద్దనుకున్నారు. ఈ విషయంలో నేతాశ్రీలు చివరి నుంచి మొదటి స్థానంలో ఉన్నారని చెప్పక తప్పదు. ప్రధాని పిలుపు స్పందించి రాయితీ రద్దు చేసుకున్న నేతలను వేళ్లపై లెక్కెట్టొచ్చు. 'గివ్ ఇట్ ఆప్' పాలకుల చిత్తశుద్ధిని సాక్షీభూతంగా సాక్షాత్కరింపజేసింది. నాయకులు తమకు తాముగా ముందుకు వచ్చి గ్యాస్ రాయితీ వదులుకుంటే ఆ సందేశం మరింత వేగంగా ప్రజల్లోకి వెళ్లేది. విధాన నిర్ణేతలను ఆచరించి చూపితే ఆ మార్గంలో నడిచేందుకు జనం సదా సిద్దంగా ఉంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సొమ్ములు దండిగా ఉన్న శ్రీమంతులు నుంచి ఆశించిన స్పందన రాకపోవడం విస్తుగొలిపే అంశం. ఈ విషయంలో కుబేరుల కంటే వేతనజీవులే నయమనిపిస్తున్నారు. అధికారులు తమకు పనిగట్టుకుని చెప్పకపోయినా తమంత తాముగా రాయితీ రద్దు చేసుకుంటున్నారు. తమ బాధ్యతగా భావించి స్వయంచలితంగా స్పందిస్తున్నారు. పాలకులు, అధికారులు ఇప్పటికైనా మేలుకుని 'గివ్ ఇట్ ఆప్'పై పెద్దఎత్తున ప్రచారం చేస్తే స్పందన పెరిగే ఛాన్స్ ఉంది. నాయకులు కూడా స్వచ్ఛందంగా రాయితీ వదులుకుని ఆదర్శంగా నిలవాలి. -పి.ఎన్.శ్రీనివాసరావు (సాక్షి వెబ్ ప్రత్యేకం)


