బియ్యం.. భారం | Rice prices have increased in Open market | Sakshi
Sakshi News home page

బియ్యం.. భారం

Sep 27 2026 5:47 AM | Updated on Sep 27 2026 5:47 AM

Rice prices have increased in Open market

కిలో సన్నబియ్యం రూ.70 పైనే.. మంచి నాణ్యత రకాలు రూ.80 దాటాయి 

ఎల్‌నినో భయంతో ముందస్తు కొనుగోళ్లకు మిల్లర్లు, వ్యాపారులు  

నిజామాబాద్, నల్లగొండలో రైతులతో ముందస్తు సంప్రదింపులు  

రేషన్‌ దుకాణాల్లో సన్నబియ్యం సరఫరా అవుతున్నా, బహిరంగ మార్కెట్‌లో తగ్గని డిమాండ్‌

సాక్షి, హైదరాబాద్‌: బియ్యం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. రాష్ట్రంలో ధాన్యంభారీగా పండుతున్నా.. బియ్యం ధరలకు మాత్రం కళ్లెం పడటం లేదు. వినియోగదారులు ఎక్కువగా కోరుకునే నాణ్యమైన సన్నబియ్యం కిలో ధర ఇప్పటికే రూ.70 దాటింది. మంచి నాణ్యత, పాత బియ్యం రకాలు రూ.80కు పైగానే పలుకుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ రోజువారీ ధరల పర్యవేక్షణ గణాంకాల ప్రకారం తెలంగాణలో సాధారణ బియ్యం సగటు రిటైల్‌ ధర జూలైలో కిలో రూ.54.4 ఉండగా, ఆగస్టులో రూ.56.7కు, సెప్టెంబర్‌లో రూ.61.6కు చేరింది. అంటే మూడు నెలల్లోనే కిలోకు రూ.7.2 అంటే 13 శాతానికి పైగా పెరిగింది. దేశ సగటు రిటైల్‌ ధర రూ.46.60తో పోలిస్తే తెలంగాణలో కిలోకు దాదాపు రూ.15 ఎక్కువ.’’అంటే రాష్ట్రంలో ధాన్యం కొరత లేకపోయినా, వినియోగదారుడు కోరుకునే రకం బియ్యం మార్కెట్‌లో ఎంత అందుబాటులో ఉందన్నదే ధరను నిర్ణయిస్తోంది. 

ధాన్యం పుష్కలం.. సన్నబియ్యం మాత్రం ఖరీదు 
ఈ ఖరీఫ్‌లో 57.70 లక్షల ఎకరాల్లో 119.57 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. అయినా మార్కెట్‌లో సన్నబియ్యం ధరలు పెరుగుతుండటానికి కారణం మొత్తం ధాన్యం పరిమాణం కాదు.. వినియోగదారుడి డిమాండ్‌కు తగ్గ సన్నబియ్యం సరఫరా ఉందా? అన్నదే కీలకం. రైతు నుంచి కొనుగోలు చేసిన ధాన్యం వెంటనే బియ్యంగా మారి దుకాణానికి చేరదు. కొనుగోలు తర్వాత మిల్లుకు తరలింపు, మిల్లింగ్, నిల్వ, హోల్‌సేల్, రిటైల్‌ మార్కెట్‌కు సరఫరా.. ఇలా పలు దశలు దాటాలి. ఈ ప్రక్రియలో సరఫరా నెమ్మదిస్తే మార్కెట్‌లో అందుబాటులో ఉన్న బియ్యం తగ్గుతుంది. అదే సమయంలో వినియోగదారుల డిమాండ్‌ కొనసాగితే ధర పెరుగుతుంది. ఇదే సన్న బియ్యంలో ప్రస్తుతం స్పష్టంగా కనిపిస్తోంది. ‘‘సోనామసూరి, సాంబ మసూరి, జైశ్రీరాం, తెలంగాణ సోనా, హెచ్‌ఎంటీ, బీపీటీ, ఆర్‌ఎన్‌ఆర్‌ వంటి రకాలపై డిమాండ్‌ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మంచి నాణ్యత, పాత బియ్యం, తక్కువ నూకలు, మంచి వంట నాణ్యత ఉన్న రకాలకు వినియోగదారులు అధిక ధర చెల్లిస్తున్నారు.’’అందుకే సాధారణ బియ్యం ధరతో పోలిస్తే నాణ్యమైన సన్న బియ్యం ధర కిలోకు రూ.70–80 వరకు చేరింది. 


రబీపై కన్ను.. ముందుగానే సన్న ధాన్యం సమీకరణ? 
ఎల్‌నినో ప్రభావం ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో రబీలో సన్నరకాల సాగు తగ్గవచ్చన్న అంచనాలు ఉన్నాయి. దీంతో మిల్లర్లు, బియ్యం వ్యాపారులు వచ్చే పంటపై ముందుగానే దృష్టి పెట్టినట్టు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లో సన్న రకాల ధాన్యం కోసం రైతులతో మిల్లర్లు, వ్యాపారులు సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. భవిష్యత్‌లో సన్నధాన్యం అందుబాటులో తగ్గుతుందన్న అంచనాతో ముందుగానే సరుకు సమీకరించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి.  

పాత పంట తగ్గుతోంది.. కొత్త పంట కోసం ఎదురుచూపులు 
పాత పంట నిల్వలు తగ్గడం–కొత్త పంట పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడం వల్ల ధరల్లో వ్యత్యాసాలు ఉంటున్నాయి. నాణ్యమైన సన్న బియ్యం నిల్వలు తగ్గుతున్న సమయంలో కొత్త పంట బియ్యం మార్కెట్‌కు పెద్దగా రాకపోతే మధ్యంతరంగా ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ధర పెరుగుదలలో ప్రధాన అంశం మాత్రం సరఫరా–డిమాండ్‌ మధ్య అంతరం. మార్కెట్‌లో బియ్యం సరఫరా పెరిగితే వ్యాపారుల మధ్య పోటీ పెరిగి ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. అందుకు విరుద్ధంగా డిమాండ్‌ ఎక్కువగా ఉండి సరఫరా పరిమితంగా ఉంటే ధరలు పెరుగుతాయి. సన్న బియ్యంలో ప్రస్తుతం ఇదే పరిస్థితి కనిపిస్తోంది. 

రేషన్‌ బియ్యం ఎక్కడ పోతోంది..? 
రాష్ట్రంలో కోటికి పైగా రేషన్‌కార్డులు ఉండగా, 3 కోట్ల లబ్ధిదారులు ఉన్నట్టు పౌరసరఫరాల శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఒక్కో లబ్ధిదారునికి 6 కిలోల సన్నబియ్యం చొప్పున ప్రభుత్వం ఉచితంగా బియ్యం అందజేస్తున్నా, రాష్ట్రంలో బియ్యం ధరలు మండిపోవడం వెనుక గల కారణాలను ప్రభుత్వం పరిశీలించాల్సిన అవసరముంది. ‘‘ప్రభుత్వం వ్యయ ప్రయాసలకోర్చి ఒక్కో కిలో బియ్యానికి సుమారు రూ. 45 వరకు వెచ్చించి సరఫరా చేస్తున్నా, బహిరంగమార్కెట్‌లో సన్నబియ్యానికి డిమాండ్‌ తగ్గడం లేదు. అదే సమయంలో సన్నబియ్యం కూడా రీసైక్లింగ్‌ జరుగుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.’’హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్‌ జిల్లాల్లో రేషన్‌ దుకాణాల్లోనే వినియోగదారులు సన్నబియ్యాన్ని డీలర్లకు అప్పగించి, కిలోకి రూ.15 వరకు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. జిల్లాల్లో ఏకంగా మిల్లర్లే వినియోగదారుల నుంచి సన్నబియ్యాన్ని కొనుగోలు చేసి రిసైక్లింగ్‌ చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement