sannabiyyam
-
సన్నాలకు బోనస్ ఎప్పుడు?
ఈ రైతు పేరు సుంకరి నరేష్. నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలం దత్తాపూర్ గ్రామం. 5 ఎకరాలకు పైగా పొలంలో సన్న వడ్లు సాగు చేశాడు. 140 క్వింటాళ్ల వరకు (350 బస్తాలు) దిగుబడి వచ్చింది. ధాన్యాన్ని కుద్వాన్పూర్ సొసైటీకి విక్రయించి నెల రోజులు దాటింది. పంట డబ్బులైతే వచ్చాయి. కానీ బోనస్ డబ్బులు మాత్రం ఇంతవరకు బ్యాంకు ఖాతాలో జమ కాలేదు. ప్రభుత్వం బోనస్ ఇస్తే తనకు రూ.70 వేల వరకు వస్తాయని, తదుపరి పంట పెట్టుబడికి పనికొస్తాయని చెబుతున్నాడు. సాక్షి, హైదరాబాద్: ఈ యాసంగి సీజన్లో సన్న ధాన్యం సాగు చేసిన రైతులు సర్కారు నుంచి రావలసిన బోనస్ కోసం ఎదురుచూస్తున్నారు. మార్చి నెలాఖరు నుంచే యాసంగి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాగా, ఇప్పటివరకు 55.97 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. అయితే గతంలో ఏ యాసంగి సీజన్లోనూ లేనివిధంగా 18.47 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీల) సన్న ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలో రైతులు విక్రయించారు. పౌరసరఫరాల సంస్థ చరిత్రలోనే ఇది రికార్డు కాగా, ఈనెలాఖరు వరకు కొనుగోళ్లు సాగే అవకాశం ఉండటంతో 25 లక్షల నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నుల వరకు సన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని పౌరసరఫరాల సంస్థ అంచనా వేస్తోంది. అయితే రైతులకు బోనస్ చెల్లింపులో ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. ఇప్పటివరకు కొనుగోలు చేసిన 55.97 ఎల్ఎంటీ ధాన్యం విలువ రూ.12,974.10 కోట్లు కాగా, పౌరసరఫరాల సంస్థ రైతుల ఖాతాల్లో రూ.9,632.66 కోట్లు జమ చేసింది. అయితే ఆర్థిక శాఖ ద్వారా నేరుగా ప్రభుత్వమే విడుదల చేసే బోనస్ విషయంలో మాత్రం ఇప్పటివరకు ఉలుకూ పలుకూ లేకపోవడం గమనార్హం. బోనస్ ప్రకటనతో సన్న ధాన్యం సాగు తెలంగాణలో ముఖ్యంగా ఉత్తర ప్రాంతంలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా యాసంగిలో సన్న ధాన్యాన్ని రైతులు ఎక్కువగా పండించరు. అయితే ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తుండటంతో రైతులు ఈసారి పెద్దయెత్తున సన్నాలు సాగు చేశారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించగా, అందులో ఏకంగా 7.15 లక్షల మెట్రిక్ టన్నులు సన్నాలే కావడం గమనార్హం. అలాగే నల్లగొండ, నారాయణపేట, జగిత్యాల, నిర్మల్, సిద్దిపేట, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున సన్న ధాన్యాన్ని పండించారు. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం బోనస్ ఇవ్వకపోవడంతో రైతుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ సీజన్లో రూపాయి ఇవ్వలే! యాసంగి సీజన్లో ఇప్పటివరకు 18.47 ఎల్ఎంటీల సన్న ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. క్వింటాల్‌కు రూ.500 బోనస్ చొప్పున 2,87,262 మంది రైతులకు రూ.923.40 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే ఆర్థిక శాఖ ఇప్పటి వరకు బోనస్ కింద రైతులకు రూపాయి కూడా విడుదల చేయలేదు. కొనుగోళ్లు మొదలై 45 రోజులు దాటినప్పటికీ, బోనస్ చెల్లించకపోవడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా కౌలు రైతులు సకాలంలో బోనస్ రాక, ఎప్పుడు వస్తుందో తెలియక ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ఖజానాలో నిధులు లేకపోవడం వల్లనే రైతులకు బోనస్ చెల్లించడంలో ఆలస్యం అవుతోందని ఓ అధికారి వ్యాఖ్యానించడం గమనార్హం. మరో 15 రోజుల్లో వానాకాలం సీజన్ మొదలు కాబోతుండగా, ఇప్పటివరకు బోనస్ మొత్తం బ్యాంకు ఖాతాలో జమ కాకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయమై పౌరసరఫరాల శాఖకు చెందిన ఓ అధికారిని ప్రశ్నించగా, దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వ్యాఖ్యానించారు. గత వానాకాలంలో రూ.1,200 కోట్లు చెల్లింపు గత వానకాలం సీజన్ నుంచే ప్రభుత్వం బోనస్‌ను అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో గత వానాకాలం సీజన్లో 24 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా సన్న రకం ధాన్యం పండించిన సుమారు 4.50 లక్షల మంది రైతులకు రూ.1,200 కోట్లకు పైగా ప్రభుత్వం నేరుగా చెల్లించింది. ఆ సీజన్లో ధాన్యం కొనుగోళ్లతో పాటుగానే విడతల వారీగా బోనస్‌ను జమచేస్తూ వచ్చింది. యాసంగి ధాన్యం కొనుగోళ్లు మొదలయ్యే నాటికి పూర్తిస్థాయిలో బోనస్‌ను చెల్లించింది. 180 క్వింటాళ్ల సన్న ధాన్యం అమ్మా నేను 8 ఎకరాలల్లో సన్న రకం వరి సాగు చేశా. 180 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు కేంద్రంలో అమ్మా. కానీ ప్రభుత్వం ఇప్పటివరకు బోనస్ ఇవ్వలేదు. అలాగే రెండుసార్లు కాంటా పెడితే మొదటిసారి అమ్మిన ధాన్యానికి మాత్రమే డబ్బులు వచ్చాయి. రెండోసారి కాంటా పెట్టిన ధాన్యానికి ఇంకా రాలేదు. – గడ్డం పాలెం లింగారెడ్డి, రెంజర్ల, ముప్కాల్ మండలం, నిజామాబాద్ జిల్లా బోనస్ ఊసే లేదు.. వడ్లు కాంటా పెట్టి 45 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ప్రభుత్వం ఇస్తానన్న బోనస్ చెల్లించలేదు. బోనస్ ఇస్తానని ప్రభుత్వం ప్రకటించడం వల్లే వ్యాపారులకు విక్రయించకుండా కొనుగోలు కేంద్రాల్లో అమ్మడం జరిగింది. ఇంటిల్లిపాదీ 15 రోజులు కష్టపడి వడ్లను ఆరబెట్టి కేంద్రాల్లో విక్రయిస్తే ఇప్పటివరకు బోనస్ ఊసే లేదు. – గుజ్జ రామకృష్ణ , తగిలేపల్లి, వర్ని మండలం, నిజామాబాద్ జిల్లా -
రైతన్న.. కొత్త రూటన్న!
సాక్షి, కామారెడ్డి: రైతులు అష్టకష్టాలు పడి పండించిన పంటకు సరైన ‘మద్దతు’ కరువవుతోంది. గత్యంతరం లేక దళారులు చెప్పిన ధరకే దాసోహం కావాల్సిన పరిస్థితి.. సన్నాలు సాగుచేసిన రైతులు అటు పంట దిగుబడి రాక, ఇటు మద్దతు ధర లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం సన్నవడ్లకు బోనస్ ఇస్తామని చెప్పినా, ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. దీంతో కొందరు రైతులు కొత్తదారులు వెతుకుతున్నారు. తక్కువ ధరకు ధాన్యాన్ని అమ్ముకోలేక, వాటిని మర పట్టించి బియ్యం అమ్ముతున్నారు. కామారెడ్డి జిల్లాలో ఇటీవల పలువురు రైతులు సన్నవడ్లను మిల్లింగ్ చేయించి, అవసరం ఉన్న వారికి నేరుగా బియ్యం విక్రయిస్తూ లాభాలు పొందుతున్నారు. దిగుబడి దెబ్బ.. ‘మద్దతు’ కరువు ఈసారి వర్షాకాలంలో రాష్ట్రంలో 52.78 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, 34.45 లక్షల ఎకరాల్లో సన్నరకం వరి సాగైంది. కామారెడ్డి జిల్లాలో 2.40 లక్షల ఎకరాల్లో వరి పండించగా, ఇందులో 1,16,672 ఎకరాల్లో సన్నరకాలే సాగయ్యాయి. ఎంఎస్పీ ప్రకారం మేలు రకం ధాన్యానికి రూ.1,888, సాధారణ రకానికి రూ.1,868 ధర ఉంది. ఈ ధరల ప్రకారం సన్నవడ్లను అమ్మితే నష్టమేనని రైతులు వాపోతున్నారు. క్వింటాకు రూ.2,500 చెల్లిస్తేనే గిట్టుబాటవుతుందని చెబుతున్నారు. మరోపక్క ఈసారి భారీ వర్షాలు, తెగుళ్లు రైతులను నిండా ముంచాయి. గతంలో సన్నాలు ఎకరాకు 25 – 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చేది. ఈసారి చాలాచోట్ల ఎకరాకు 10 – 15 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చింది. నిరుడు దళారులు, రైస్ మిల్లర్లు క్వింటాల్‌కు రూ.2 వేలు చెల్లించి నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేశారు. ఈసారి కొనేందుకు వ్యాపారులు, మిల్లర్లు ముందుకురాలేదు. చదవండి: (విజ్ఞతతో ఆలోచించండి.. మోసపోవద్దు) మా దగ్గరే కొనండంటూ వాట్సాప్‌లో ప్రచారం ఒకపక్క తెగుళ్లు, భారీ వర్షాలతో దిగుబడి పడిపోవడం.. మరోవైపు, గిట్టుబాటు ధర లేకపోవడం, వ్యాపారులకు అమ్ముకునే పరిస్థితి లేక రైతులు కొత్త ఆలోచన చేశారు. పలువురు తాము పండించిన వడ్లను మర పట్టించేందుకు రైస్‌మిల్లులకు వరుస కడుతున్నారు. బియ్యంగా మార్చి 25 – 50 కిలోల చొప్పున బస్తాల్లో నింపి బయట వినియోగదారులకు అమ్ముతున్నారు. నాణ్యమైన బియ్యం కావడంతో క్వింటా రూ.4,200 నుంచి రూ.4,500 వరకు అమ్ముడుపోతున్నాయి. కొందరు రైతులు తమకు తెలిసిన వారికి, హోటళ్లకు బియ్యం సప్లై చేస్తున్నారు. ఇక, రైతులు వాట్సాప్ గ్రూపుల ద్వారా తమ వద్ద సన్నబియ్యం ఫలానా ధరకు లభిస్తాయని, రైతుల వద్దనే నేరుగా బియ్యం కొని రైతులకు లాభం చేకూర్చాలంటూ భారీగా ప్రచారం చేస్తున్నారు. దళారులు, వ్యాపారుల దగ్గర కొనే బదులు రైతుల దగ్గర లభించే కల్తీ లేని నాణ్యమైన బియ్యాన్ని కొందామంటూ చేపడుతున్న ప్రచారానికి విశేష స్పందన వస్తోంది. కామారెడ్డి జిల్లా గన్పూర్(ఎం) గ్రామానికి చెందిన యువ రైతు పేరు శ్రీధర్‌రావు మొన్నటి వానాకాలంలో 15 ఎకరాల్లో సన్న రకం వరి వేయగా భారీ వర్షాలతో దిగుబడి పడిపోయింది. 15 ఎకరాలకు 240 క్వింటాళ్ల వడ్లు వచ్చాయి. ఇందులో 137 క్వింటాళ్లు విక్రయించి, మిగతా 103 క్వింటాళ్లను బియ్యం పట్టిస్తే 42 క్వింటాళ్ల బియ్యం చేతికొచ్చింది. ఇందుకోసం రూ.5 వేల వరకు ఖర్చయ్యాయి. నాణ్యమైన బియ్యం కావడంతో క్వింటా రూ.4,500 చొప్పున అమ్ముడుపోతున్నట్టు రైతు శ్రీధర్‌రావు తెలిపారు. సన్నవడ్లకు క్వింటాకు రూ.2,400 నుంచి రూ.2,500 ఇస్తే మేలు జరిగేదని, ఇప్పుడున్న ధర ఏమాత్రం గిట్టుబాటు కాకపోవడం వల్లే తానే బియ్యం పట్టించి అమ్ముకుంటున్నట్టు చెప్పాడు. కామారెడ్డి జిల్లా గన్పూర్(ఎం)కు చెందిన నర్సింహులు 8 ఎకరాల్లో సన్నవడ్లు పండించాడు. తెగుళ్లు, భారీ వర్షాలతో దిగుబడి తగ్గిపోయింది. ఎకరాకు 12 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. 170 బస్తాల ధాన్యాన్ని అమ్మి, 76 బస్తాలను మర పట్టించగా 30 క్వింటాళ్ల బియ్యం వచ్చాయి. ప్రభుత్వం సన్నాలు సాగు చేయాలని చెప్పి, మద్దతు ధర ఇవ్వకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోయానని, ఈ పరిస్థితుల్లో బయట అమ్మితే నష్టం తప్పదని భావించి ఇలా బియ్యం పట్టించి అమ్ముతున్నట్టు వివరించాడు. -
జూన్ 2 నుంచి అంగన్వాడీలకు సన్నబియ్యం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు సన్నబియ్యం సరఫరా చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఇప్పటికే 2,695 హాస్టళ్లు, 27,865 పాఠశాలలకు ప్రతినెలా 20,389 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం సరఫరా చే స్తున్న ప్రభుత్వం జూన్ 2 నుంచి అంగన్వాడీ కేంద్రాలకు సన్నబియ్యం సరఫరా చేయాలని యోచిస్తోంది. అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన బియ్యం, ఆర్థిక భారం, అంచనాలను సిద్ధం చేయాలని ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో పౌర సరఫరాల శాఖలో కదలిక మొదలైంది. ఈ మేరకు అంగన్వాడీల సమగ్ర వివరాలు తమకు అందివ్వాలని స్త్రీ, శిశు సంక్షేమ శాఖను కోరింది. ప్రాథమికంగా అందించిన సమాచారం మేరకు రాష్ట్రంలోని 35 వేల అంగన్వాడీ కేంద్రాలకు ఏటా సుమారు 40 వేల మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. దీని స్థానంలో ఇప్పుడు సన్నబియ్యం సరఫరా చేయాలని ప్రభుత్వం సంకల్పించినందున ప్రభుత్వంపై అదనంగా రూ.50 కోట్ల మేర భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. -
1 నుంచి ఆరు కేజీల బియ్యం
కుటుంబంలో అందరికీ పంపిణీ: మంత్రి ఈటెల హాస్టళ్లకు, మధ్యాహ్న భోజన పథకానికి సన్నబియ్యం కూడా పేదలకు గులాబీ రంగులో రేషన్ కార్డులు.. పాత గులాబీ కార్డుల స్థానంలో తెల్ల కార్డులు కార్డుల జారీ ఆలస్యమైనా సరుకులు అందిస్తామని వెల్లడి సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని పేదలకు వచ్చే జనవరి 1నుంచి ఒక్కొక్కరికి ఆరు కేజీల చొప్పున బియ్యం పంపిణీని ప్రారంభిస్తామని ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. కుటుంబంలో ఎంత మంది ఉంటే అంత మందికి ఆరు కేజీల చొప్పున బియ్యం ఇస్తామని, అలాగే హాస్టళ్లకు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి సన్నబియ్యాన్ని కూ డా 1వ తేదీ నుంచి పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు. ఈ మేరకు బియ్యం పంపిణీ కార్యక్రమంలో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా జిల్లాల కలెక్టర్లకు, అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. మంత్రి ఈటెల శనివారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. కొత్త కార్డులు సరుకులకే పరిమితం: అల్పాదాయ వర్గాలకు గతంలో ఉన్న తెల్ల రేషన్‌కార్డు ల స్థానంలో కొత్తగా గులాబీ రంగు రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు ఈటెల తెలిపారు. ఇప్పటివరకూ ఉన్న గులాబీ కార్డుల స్థానంలో తెల్ల రేషన్ కార్డులు అందజేస్తామన్నారు. కొత్తగా జారీ చేసే గులాబీ రంగు కార్డులు బియ్యం, కిరోసిన్, గోధుమలు, పంచదార, కందిపప్పు వంటి రేషన్ సరుకులకు మాత్రమే పరిమితమని మంత్రి మరోసారి స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్ తదితర పథకాలకు ఈ కార్డులను పరిగణనలోకి తీసుకోబోరని చెప్పారు. జనవరి నెలాఖరులోగా 99 శాతం రేషన్ కార్డుల పంపిణీని పూర్తి చేస్తామని... కొత్త కార్డులు అందడం ఆలస్యమైనా జనవరి 1వ తేదీ నుంచే బియ్యం పంపిణీ కొనసాగుతుందని ఈటెల వెల్లడించారు. అర్హులైన పేదలకు రేషన్ కార్డుల జారీ ప్రక్రియను నిరంతరం కొనసాగిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో గతంలో ఉన్న రేషన్‌కార్డుల కన్నా ఎక్కువ సంఖ్యలో లబ్ధిదారులకు కార్డులు అందజేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. పాఠశాలలు, హాస్టళ్లలో: ప్రభుత్వం నిర్వహిస్తున్న అన్ని వసతి గృహాలకు సన్న రకం(బీపీటీ) బియ్యాన్ని జనవరి 1నుంచి పంపిణీ చేయనున్నట్లు ఈటెల తెలిపారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజ న కార్యక్రమానికి కూడా సన్న బియ్యాన్ని ఈ నెల 2వ తేదీ నుంచి (1న సెలవు మేరకు) పం పిణీ చేయాలని నిర్ణయించామని చెప్పారు. గ్రా మాల్లో సర్పంచులు, మండలాల్లో ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపాలిటీల్లో కా ర్పొరేటర్లు, చైర్మన్లు, నగరాల్లో మేయర్లు, నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా కేంద్రాల్లో మంత్రులందరూ ఈ బియ్యం పంపి ణీ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు: సంక్షే మ పథకాలను పూర్తి పారదర్శకంగా అమలుచేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని మంత్రి ఈటెల చెప్పారు. గతంలో కన్నా ఎక్కువ బియ్యం, ఎక్కువ రేషన్‌కార్డులు ఇస్తున్నామని... ఎక్కడైనా అవకతవకలు జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. రేషన్‌కార్డుల సంఖ్యకు అనుగుణంగా గ్రామాలు, మండల కేంద్రాలు, మున్సిపాలిటీల వారీగా రేషన్ షాపులను పెంచుతామని తెలిపా రు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, పౌర సరఫరాల శాఖ అధికారులు ఉన్నారు.