
ఇప్పటివరకు 18.47 ఎల్‌ఎంటీల ధాన్యం కొనుగోలు
ఈ రైతు పేరు సుంకరి నరేష్. నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలం దత్తాపూర్ గ్రామం. 5 ఎకరాలకు పైగా పొలంలో సన్న వడ్లు సాగు చేశాడు. 140 క్వింటాళ్ల వరకు (350 బస్తాలు) దిగుబడి వచ్చింది. ధాన్యాన్ని కుద్వాన్పూర్ సొసైటీకి విక్రయించి నెల రోజులు దాటింది. పంట డబ్బులైతే వచ్చాయి. కానీ బోనస్ డబ్బులు మాత్రం ఇంతవరకు బ్యాంకు ఖాతాలో జమ కాలేదు. ప్రభుత్వం బోనస్ ఇస్తే తనకు రూ.70 వేల వరకు వస్తాయని, తదుపరి పంట పెట్టుబడికి పనికొస్తాయని చెబుతున్నాడు.
సాక్షి, హైదరాబాద్: ఈ యాసంగి సీజన్‌లో సన్న ధాన్యం సాగు చేసిన రైతులు సర్కారు నుంచి రావలసిన బోనస్ కోసం ఎదురుచూస్తున్నారు. మార్చి నెలాఖరు నుంచే యాసంగి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాగా, ఇప్పటివరకు 55.97 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. అయితే గతంలో ఏ యాసంగి సీజన్‌లోనూ లేనివిధంగా 18.47 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్‌ఎంటీల) సన్న ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలో రైతులు విక్రయించారు.
పౌరసరఫరాల సంస్థ చరిత్రలోనే ఇది రికార్డు కాగా, ఈనెలాఖరు వరకు కొనుగోళ్లు సాగే అవకాశం ఉండటంతో 25 లక్షల నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నుల వరకు సన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని పౌరసరఫరాల సంస్థ అంచనా వేస్తోంది. అయితే రైతులకు బోనస్ చెల్లింపులో ప్రభుత్వం తాత్సారం చేస్తోంది.
ఇప్పటివరకు కొనుగోలు చేసిన 55.97 ఎల్‌ఎంటీ ధాన్యం విలువ రూ.12,974.10 కోట్లు కాగా, పౌరసరఫరాల సంస్థ రైతుల ఖాతాల్లో రూ.9,632.66 కోట్లు జమ చేసింది. అయితే ఆర్థిక శాఖ ద్వారా నేరుగా ప్రభుత్వమే విడుదల చేసే బోనస్ విషయంలో మాత్రం ఇప్పటివరకు ఉలుకూ పలుకూ లేకపోవడం గమనార్హం.
బోనస్ ప్రకటనతో సన్న ధాన్యం సాగు
తెలంగాణలో ముఖ్యంగా ఉత్తర ప్రాంతంలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా యాసంగిలో సన్న ధాన్యాన్ని రైతులు ఎక్కువగా పండించరు. అయితే ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తుండటంతో రైతులు ఈసారి పెద్దయెత్తున సన్నాలు సాగు చేశారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించగా, అందులో ఏకంగా 7.15 లక్షల మెట్రిక్ టన్నులు సన్నాలే కావడం గమనార్హం. అలాగే నల్లగొండ, నారాయణపేట, జగిత్యాల, నిర్మల్, సిద్దిపేట, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున సన్న ధాన్యాన్ని పండించారు. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం బోనస్ ఇవ్వకపోవడంతో రైతుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ఈ సీజన్‌లో రూపాయి ఇవ్వలే!
యాసంగి సీజన్‌లో ఇప్పటివరకు 18.47 ఎల్‌ఎంటీల సన్న ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. క్వింటాల్‌కు రూ.500 బోనస్ చొప్పున 2,87,262 మంది రైతులకు రూ.923.40 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే ఆర్థిక శాఖ ఇప్పటి వరకు బోనస్ కింద రైతులకు రూపాయి కూడా విడుదల చేయలేదు. కొనుగోళ్లు మొదలై 45 రోజులు దాటినప్పటికీ, బోనస్ చెల్లించకపోవడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ప్రధానంగా కౌలు రైతులు సకాలంలో బోనస్ రాక, ఎప్పుడు వస్తుందో తెలియక ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ఖజానాలో నిధులు లేకపోవడం వల్లనే రైతులకు బోనస్ చెల్లించడంలో ఆలస్యం అవుతోందని ఓ అధికారి వ్యాఖ్యానించడం గమనార్హం. మరో 15 రోజుల్లో వానాకాలం సీజన్ మొదలు కాబోతుండగా, ఇప్పటివరకు బోనస్ మొత్తం బ్యాంకు ఖాతాలో జమ కాకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయమై పౌరసరఫరాల శాఖకు చెందిన ఓ అధికారిని ప్రశ్నించగా, దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వ్యాఖ్యానించారు.
గత వానాకాలంలో రూ.1,200 కోట్లు చెల్లింపు
గత వానకాలం సీజన్ నుంచే ప్రభుత్వం బోనస్‌ను అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో గత వానాకాలం సీజన్‌లో 24 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా సన్న రకం ధాన్యం పండించిన సుమారు 4.50 లక్షల మంది రైతులకు రూ.1,200 కోట్లకు పైగా ప్రభుత్వం నేరుగా చెల్లించింది. ఆ సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లతో పాటుగానే విడతల వారీగా బోనస్‌ను జమచేస్తూ వచ్చింది. యాసంగి ధాన్యం కొనుగోళ్లు మొదలయ్యే నాటికి పూర్తిస్థాయిలో బోనస్‌ను చెల్లించింది.
180 క్వింటాళ్ల సన్న ధాన్యం అమ్మా
నేను 8 ఎకరాలల్లో సన్న రకం వరి సాగు చేశా. 180 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు కేంద్రంలో అమ్మా. కానీ ప్రభుత్వం ఇప్పటివరకు బోనస్ ఇవ్వలేదు. అలాగే రెండుసార్లు కాంటా పెడితే మొదటిసారి అమ్మిన ధాన్యానికి మాత్రమే డబ్బులు వచ్చాయి. రెండోసారి కాంటా పెట్టిన ధాన్యానికి ఇంకా రాలేదు.
– గడ్డం పాలెం లింగారెడ్డి, రెంజర్ల, ముప్కాల్ మండలం, నిజామాబాద్ జిల్లా
బోనస్ ఊసే లేదు..
వడ్లు కాంటా పెట్టి 45 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ప్రభుత్వం ఇస్తానన్న బోనస్ చెల్లించలేదు. బోనస్ ఇస్తానని ప్రభుత్వం ప్రకటించడం వల్లే వ్యాపారులకు విక్రయించకుండా కొనుగోలు కేంద్రాల్లో అమ్మడం జరిగింది. ఇంటిల్లిపాదీ 15 రోజులు కష్టపడి వడ్లను ఆరబెట్టి కేంద్రాల్లో విక్రయిస్తే ఇప్పటివరకు బోనస్ ఊసే లేదు.
– గుజ్జ రామకృష్ణ , తగిలేపల్లి, వర్ని మండలం, నిజామాబాద్ జిల్లా