మన్మోహన్ సింగ్ విగ్రహం వద్ద సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో నవీన్, అనిల్ యాదవ్, వేం నరేందర్‌రెడ్డి, అరెకపూడి గాం«దీ, అడ్లూరి లక్ష్మణ్, శ్రీధర్‌బాబు, జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, జస్టిస్ ఎన్వీ రమణ తదితరులు
మన్మోహన్‌సింగ్ విగ్రహావిష్కరణలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా, ఆర్‌బీఐ
గవర్నర్‌గా పదవులకు వన్నె తెచ్చారు
రాజకీయాలకు అతీతంగా ఆర్థిక వేత్తను గుర్తించాలి
ఢిల్లీలో మన్మోహన్ సింగ్ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేస్తున్నా..
గచ్చిబౌలి (హైదరాబాద్): మాజీ ప్రధాని, ఆర్థిక శాస్త్రవేత్త డాక్టర్ మన్మోహన్‌సింగ్‌కు భారత రత్న ఇవ్వాలని కేంద్రానికి, ప్రధాని మోదీకి సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. దేశం గర్వించదగ్గ వ్యక్తి, ఆర్థిక శాస్త్రవేత్తను రాజకీయాలకు అతీతంగా గుర్తించకపోవడం విచారకరమన్నారు. ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా, రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్‌గా పదవులకు వన్నె తెచ్చారని కొనియాడారు. ఆయన చేసిన సంస్కరణలు, పరిశోధనలు నేటితరానికి తెలియజేయాల్సిన అవసరం చాలా ఉందన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో మన్మోహన్‌సింగ్ స్మారకార్థం విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రధాని మోదీని కోరుతున్నా అని చెప్పారు. రేవంత్‌రెడ్డి శనివారం నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మన్మోహన్‌సింగ్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించి, మె మోరియల్ పార్క్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. 1991లో పీవీ హయాంలో ఆర్థిక మంత్రిగా దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించారని శ్లాఘించారు. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ విధానాలు తెచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ అని కొనియాడారు. మౌన మునిలా దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపారని, ఆయన సంస్కరణలతో 2004 నుంచి 2014 వరకు దేశం ప్రగతిపథంలో నడిచిందన్నారు. మన్మోహన్ సింగ్‌కు భారత రత్న, విజ్ఞాన కేంద్రం ఏర్పాటుపై లోక్‌సభ, రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేస్తారని చెప్పారు. రాహుల్ గాం«దీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే దృష్టికి తీసుకెళ్లి మన్మోహన్‌కు గుర్తింపు తెచ్చేలా కృషి చేస్తానని చెప్పారు.
తెలంగాణ స్వప్నం సాకారం చేయడంలో...
నిజాం నుంచి విముక్తి పొందేందుకు అప్పటి ప్రధాని నెహ్రూ, సర్దార్ పటేల్ కృషి చేశారని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర స్వప్నం సాకారం చేయాలని సోనియా గాంధీ భావించి అన్ని పార్టీలను ఏకం చేయగా.. మన్మోహన్ సింగ్ సహకారం అందించారని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రధానిగా పీవీ నర్సింహారావు, ఆర్థిక మంత్రిగా మన్మోహన్‌సింగ్ సరళీకృత ఆర్థిక విధానాలను అమలు చేయడంవల్లే భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందన్నారు. విద్య ప్రాథమిక హక్కు, సమాచార హక్కు చట్టంతోపాటు ఉపాధిహమీ పథకం ద్వారా పేదలకు ఏడాదికి కనీసం 100 రోజుల పని దినాలు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందని శ్లాఘించారు. అంతేకాకుండా 2013 భూసేకరణ పునరావాస, పునఃనిర్మాణ చట్టం తీసుకొచ్చి అందరికీ న్యాయం చేసేలా కృషి చేశారని గుర్తు చేశారు. ఆ చట్టం ద్వారా భూమి లేని కులవృత్తులకు న్యాయం జరిగిందన్నారు. పాకిస్తాన్‌లో జన్మించిన మన్మోహన్ సింగ్ దేశ విభజన అనంతరం పంజాబ్ రాష్ట్రానికి చేరి ఆయన కుటుంబం స్థానికంగా చదవలేని పరిస్థితులుంటే ఐదారు కిలోమీటర్ల దూరం వెళ్లి చదివారని పేర్కొన్నారు. పంజాబ్ యూనివర్సిటీ, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదివి ఆర్థిక రంగంలో ఎదిగే వీలున్నా విదేశాల్లో స్థిర పడలేదన్నారు. తన అనుభవం, మేదస్సును ఆర్థిక విధానాల అమలుకు అందించాలనే తపనతో తిరిగి భారత్‌కే వచ్చారని గుర్తుచేశారు.
ఆయన పార్కు ఏర్పాటు సముచితం
సరళీకృత ఆర్థిక విధానం వల్ల ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటుకు దారితీసిందని, ఈ ప్రాంతంలో మన్మోహన్‌సింగ్ పార్కు ఏర్పాటు చేయడం సుముచితమని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. కోర్టు తీర్పులను ఆయన గౌరవించే వారని గుర్తు చేసుకున్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ సరళీకృత ఆర్థిక విధానాలతో అట్టడగు ప్రజలకు మేలు చేసిన వ్యక్తిగా మన్మోహన్ సింగ్ నిలుస్తారని కొనియాడారు. ప్రపంచాన్ని, వ్యవస్థలను చదివిన మేధావిగా అభివర్ణించారు. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కారకులైన మన్మోహన్‌సింగ్ స్మారకార్థం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ప్రత్యేక పార్కు ఏర్పాటు సీఎం రేవంత్‌రెడ్డి కృషితో సాధ్యమైందన్నారు. 2.97 ఎకరాల విస్తీర్ణంలో కాంస్య విగ్రహంతోపాటు ఓపెన్‌ఎయిర్ థియేటర్, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చట్టంలో మన్మోహన్ సింగ్ సంతకం జెన్సిస్ వాల్, మన్మోహన్ జీవిత విశేషాలతో కూడిన ఎవల్యూషన్ వాల్, దేశ ఆర్థిక ప్రగతిని సూచించేలా ట్రాన్స్‌ఫార్మర్ ఇండియా వాల్‌ను తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్‌యాదవ్, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అరెకపూడిగాంధీ, నవీన్ యాదవ్, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్, సీఎంసీ కమిషనర్ సృజన పాల్గొన్నారు.


