ధరలు సగటున 16% పెరుగుదల
రూ.10 వేలలోపు ఫోన్లపై 32% భారం
షిప్‌మెంట్లలో ఏకంగా 65% పతనం
కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ వెల్లడి
న్యూఢిల్లీ: మెమరీ చిప్‌ల ధరలు పెరగడంతో పాటు రూపాయి బలహీనపడటంతో స్మార్ట్‌ఫోన్ల విడిభాగాల దిగుమతి వ్యయం భారంగా మారింది. దీని ప్రభావంతో భారత్‌లో స్మార్ట్‌ఫోన్ల ధరలు గణనీయంగా పెరిగాయి. ఈ ఏడాది ప్రథమార్ధంలో దేశీయంగా స్మార్ట్‌ఫోన్ల ధరలు సగటున 16 శాతం పెరిగినట్లు కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ తెలిపింది. అయితే చైనా బ్రాండ్ వన్‌ప్లస్ ధరలను సగటున 8 శాతమే పెంచిందని పేర్కొంది. మెమరీ చిప్‌ల ధరలు పెరగడంతో 2026 రెండో త్రైమాసికంలో భారత్‌లో స్మార్ట్‌ఫోన్ సగటు విక్రయ ధర (ఏఎస్‌పీ) రికార్డు స్థాయిలో 318 డాలర్లకు చేరినట్లు కౌంటర్‌పాయింట్ వెల్లడించింది. ధరల పెరుగుదల అన్ని విభాగాల్లో కనిపించినప్పటికీ.. రూ.10 వేలలోపు ఫోన్లపై ప్రభావం అత్యధికంగా ఉంది.
చౌక ఫోన్లపై తీవ్ర ప్రభావం
మెమరీ చిప్‌ల ధరల పెరుగుదల ప్రభావం బడ్జెట్ (ఎంట్రీ లెవల్) ఫోన్లపై తీవ్రంగా పడింది. ముఖ్యంగా రూ.10,000లోపు ధర కలిగిన స్మార్ట్‌ఫోన్ల విభాగంలో ధరలు సగటున 32 శాతం వరకు పెరగడంతో.. ఈ కేటగిరీ షిప్‌మెంట్లు తొలి అర్ధభాగంలో ఏకంగా 65% పడిపోయాయి. భారత మార్కెట్లో చారిత్రకంగా అతిపెద్ద విభాగాల్లో ఒకటైన రూ.10,000 నుంచి రూ.15,000 ధరల శ్రేణి షిప్‌మెంట్లు కూడా 20 శాతం క్షీణించాయి. అయితే రూ.20 వేలకుపైగా ధర ఉన్న స్మార్ట్‌ఫోన్ల విభాగం మాత్రం వృద్ధిని కొనసాగించింది. అధిక ప్రారంభ ధరలతో పాటు పాత ఫోన్ మారి్పడి (ట్రేడ్–ఇన్) ఆఫర్లు, నో–కాస్ట్ ఈఎంఐలు ఖరీదైన ఫోన్ల కొనుగోలును సులభతరం చేయడం ఇందుకు దోహదపడినట్లు కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ తెలిపింది.
‘వన్ ప్లస్’ భిన్న వ్యూహం
చాలా బ్రాండ్లు ధరలను పెంచినప్పటికీ.. చైనా బ్రాండ్ వన్‌ప్లస్ మాత్రం భిన్నమైన వ్యూహాన్ని అనుసరించింది. పాత, తక్కువ ధరల వద్దే ముందస్తుగా మెమరీ కాంపోనెంట్లను కొనుగోలు చేసి నిల్వ చేసుకోవడం వల్ల వన్‌ప్లస్ తన ధరల పెంపును కేవలం 8 శాతానికే పరిమితం చేయగలిగింది. దీంతో మొత్తం మార్కెట్ రెండంకెల పతనాన్ని నమోదు చేయనున్నప్పటికీ.. వన్‌ప్లస్ షిప్‌మెంట్లు మాత్రం 5 శాతం వృద్ధి సాధిస్తాయని కౌంటర్‌పాయింట్ అంచనా వేసింది. రూ.20 వేలకుపైగా ధర ఉన్న విభాగంలో 2026 రెండో త్రైమాసికంలో ఆన్‌లైన్ చానళ్లలో టాప్–5 బ్రాండ్లలో వన్‌ప్లస్ అత్యంత వేగంగా వృద్ధి చెందిన బ్రాండ్‌గా నిలిచినట్లు పేర్కొంది. ముందుగానే కాంపోనెంట్లను సమకూర్చుకోవడంతో పాటు విభిన్న ధరల శ్రేణుల్లో విస్తృత పోర్ట్‌ఫోలియో ఉండటం వల్ల వ్యయ ఒత్తిడిని ఒక్క ధరల విభాగంపైనే మోపాల్సిన అవసరం లేకుండా పోయిందని తెలిపింది.
ఏఐ డేటా సెంటర్ల డిమాండ్ ప్రభావం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) డేటా సెంటర్లకు డీఆర్‌ఏఎం, ఎన్‌ఏఎన్‌డీ మెమరీలకు భారీగా డిమాండ్ పెరగడంతో సరఫరాపై ఒత్తిడి ఏర్పడిందని కౌంటర్‌పాయింట్ పేర్కొంది. దీనికి తోడు రూపాయి బలహీనపడటంతో దిగుమతి చేసుకునే కాంపోనెంట్ల ధరలు మరింత పెరిగాయి. భారత్‌లో విక్రయించే మొబైల్ ఫోన్లలో సుమారు 99 శాతం దేశీయంగానే తయారవుతున్నప్పటికీ.. వాటిలో ఉపయోగించే కీలక కాంపోనెంట్లలో కొన్నింటిని దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. రూపాయి బలహీనత ఈ దిగుమతి వ్యయాన్ని మరింత పెంచింది. ఈ అదనపు వ్యయ భారంలో అధిక భాగాన్ని చాలా బ్రాండ్లు వినియోగదారులపైకి బదిలీ చేశాయి.
2028 వరకు ధరలపై ఒత్తిడి
అంతర్జాతీయంగా మెమరీ చిప్‌ల ధరలు 2028కు ముందు తగ్గే అవకాశాలు తక్కువగా ఉన్నాయని కౌంటర్‌పాయింట్ అంచనా వేసింది. రూపాయి బలహీనత కూడా దిగుమతి వ్యయాలను పెంచుతుండటంతో.. స్మార్ట్‌ఫోన్ ధరలపై ఒత్తిడి మరికొంత కాలం కొనసాగవచ్చని పేర్కొంది. ‘‘విడిభాగాల ధరలు ఆకస్మికంగా పెరిగినప్పుడు కంపెనీలు సాధారణంగా రెండు మార్గాల్లో ఒకదాన్ని ఎంచుకోవాల్సి వస్తుంది. ధరలను పెంచకుండా మార్జిన్‌ను వదులుకోవడం లేదా మార్జిన్‌ను కాపాడుకోవడానికి విక్రయాల పరిమాణాన్ని కోల్పోవడం. అయితే వన్‌ప్లస్ ముందుగానే కాంపోనెంట్లను సమకూర్చుకోవడం, విస్తృతమైన పోర్ట్‌ఫోలియోను కలిగి ఉండటం వల్ల
ఈ ఒత్తిడిని అధిగమించగలిగింది’’ అని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ తెలిపారు.


