విజయ్‌ మంచివారే.. ఆయనపై ఆ నమ్మకం ఉంది: అన్నామలై | Former BJP Leader Annamalai Backs Vijay, Warns CM Over Ministers, Alleged 2–4% Commission Demands | Sakshi
Sakshi News home page

విజయ్‌ మంచివారే.. ఆయనపై ఆ నమ్మకం ఉంది: అన్నామలై

Aug 17 2026 9:30 AM | Updated on Aug 17 2026 10:34 AM

Vijay Is a Good Man: Annamalai Praise Comes With a Warning

తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. టీవీకే ప్రభుత్వం, ముఖ్యమంత్రి జోసెఫ్‌ సి విజయ్‌పై, బీజేపీ మాజీ నేత కె. అన్నామలై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం విజయ్‌ చాలా మంచివారని, ఆయన అవినీతికి వ్యతిరేకంగా ఉన్నారని ప్రశంసింస్తూనే.. అదే సమయంలో మంత్రులు, అధికారుల పనితీరుపై ఓ కన్నేసి ఉంచాలని సీఎంకు సలహా ఇచ్చారు.

బీజేపీకి గుడ్‌బై చెప్పిన తర్వాత.. సొంత రాజకీయ వేదిక దిశగా అన్నామలై అడుగులు వేస్తున్నారు. ‘వీ ద లీడర్స్‌’ పేరుతో ప్రారంభించిన ఉద్యమాన్ని భవిష్యత్‌లో రాజకీయ పార్టీగా మార్చే ఆలోచనలో ఉన్నట్లు ఆయన ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం ఈ వేదిక ద్వారా కార్యకర్తలు, వాలంటీర్లను సమీకరించే పనిలో ఉన్నారు. అయితే తాజాగా ‘వీ ద లీడర్స్‌’ (WTL) సంస్థ ఆధ్వర్యంలో చెన్నైలో జరిగిన కార్యక్రమంలో అన్నామలై మాట్లాడుతూ.. 

సీఎం విజయ్‌ చాలా మంచివారని, ఆయన అవినీతికి వ్యతిరేకంగా ఉన్నారని తాను బలంగా నమ్ముతున్నానని చెప్పారు. అయితే కొందరు మంత్రులు కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు డిమాండ్‌ చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి తన వద్ద ఆడియో ఆధారాలు కూడా ఉన్నాయని ప్రకటించారు.

‘2 నుంచి 4 శాతం కమిషన్‌ అడుగుతున్నారు’
కొంతమంది మంత్రులు గత ఎన్నికల్లో ఖర్చు చేసిన డబ్బును తిరిగి రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నామలై ఆరోపించారు. ‘‘ఓట్లు కొనడానికి డబ్బు ఖర్చు చేశాం.. ఇప్పుడు టెండర్లలో 2 శాతం, 3 శాతం, 4 శాతం ఇవ్వాలని అడుగుతున్నారంటూ’’ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ అంశాన్ని ఇప్పుడే పెద్ద వివాదంగా మార్చడం లేదని.. ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసిన తర్వాత దీనిపై మరింతగా మాట్లాడతానని అన్నామలై తెలిపారు. 

‘‘సీఎం విజయ్‌ మంత్రులు, అధికారులపై నియంత్రణ ఉంచాలి. లేదంటే పాలన దారి తప్పే అవకాశం ఉంది’’ అని హెచ్చరించారు. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రుల పేర్లను మాత్రం వెల్లడించలేదు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కనీసం ఏడాది సమయం ఇవ్వాలని చెప్పిన ఆయన.. అదే సమయంలో మంత్రులు, అధికారుల పనితీరుపై సీఎం విజయ్‌ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు. ప్రభుత్వం అవినీతి రహిత పాలన అందించాలంటే తరచూ సమీక్షలు నిర్వహించాలని కోరారు.

విజయ్‌ సర్కార్‌కు ఏడాది సమయం
కొత్తగా ఏర్పడిన టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నించడం సరికాదని అన్నామలై అభిప్రాయపడ్డారు. తమిళనాడులో రాజకీయ మార్పు జరిగిందని, ప్రజలు కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారని అన్నారు. 234 మంది ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది తొలిసారి అసెంబ్లీకి వచ్చారని పేర్కొంటూ.. వారికి కనీసం ఏడాది సమయం ఇవ్వాలని సూచించారు. ‘‘వాళ్లు సరిగ్గా పనిచేస్తే అభినందిస్తాం.. తప్పులు చేస్తే మొదట ప్రశ్నించేది మేమే’’ అని అన్నామలై అన్నారు. ప్రభుత్వం తీసుకునే మంచి నిర్ణయాలను కూడా తాము స్వాగతిస్తామని తెలిపారు.

ఆ ప్రచారాన్ని ఖండిస్తూ.. 
తాను బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నానన్న విమర్శలను అన్నామలై ఖండించారు. కేంద్ర హోంశాఖ నుంచి ఢిల్లీకి రావాలని ఆహ్వానం వచ్చినా.. తమిళనాడులోనే ఉండి ప్రజల కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తన రాజకీయ ప్రయాణం రాష్ట్ర ప్రయోజనాలకే అంకితమని చెప్పారు. కావేరీ జలాల అంశంలోనూ తమిళనాడు ప్రయోజనాలకే కట్టుబడి ఉంటానని అన్నామలై తెలిపారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉన్న సమయంలోనూ మేకెదాటు ప్రాజెక్టును వ్యతిరేకించానని గుర్తుచేశారు. కావేరీ వివాదానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి పరిష్కారం చూపాలని కేంద్రాన్ని కోరారు.

అన్నామలై వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఒకవైపు కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని చెబుతూనే.. మరోవైపు అవినీతి ఆరోపణలు చేయడం ద్వారా విజయ్‌ ప్రభుత్వంపై పరోక్ష ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రానున్న రోజుల్లో టీవీకే ప్రభుత్వం ఈ ఆరోపణలకు ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement