సాక్షి, విజయవాడ: ముంబై జూనియర్ ఆర్టిస్ట్ కాదంబరీ జత్వానీ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో సీఐడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఆమెను పెద్ద బ్లాక్‌మెయిలర్‌గా పేర్కొన్న సీఐడీ.. బెదిరింపుల ద్వారా భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు తేల్చేసింది.
కుక్కల విద్యాసాగర్ నుంచి బ్లాక్‌మెయిల్ ద్వారా డబ్బులు తీసుకున్నట్లు దర్యాప్తులో గుర్తించింది. సుమారు రూ.1.31 కోట్లు బ్లాక్‌మెయిల్ చేసి వసూలు చేసిందని.. ఇందుకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలను సాంకేతిక ఆధారాలతో పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో జత్వానీ కుటుంబ సభ్యుల పాత్ర లేదని సీఐడీ ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
ఐపీఎస్ అధికారులపై చర్యల అంశం
గతంలో జత్వానీని వేధించారంటూ కూటమి నేతలు తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే.. జత్వానీ కేసును అడ్డుపెట్టుకుని గత వైఎస్సార్‌సీపీ హయాంలో పని చేసిన పోలీసు అధికారులను వేధించేందుకు పెద్ద కుట్ర జరిగిందని తాజా పరిణామాలతో స్పష్టమవుతోంది. జత్వానీని ఏపీకి తీసుకొచ్చి అధికారులపై తప్పుడు కేసులు పెట్టించారని, ఆమెకు అనుకూలంగా ఎల్లో మీడియా ప్రచారం చేసిందని విమర్శలు ఆ సమయంలో వెల్లువెత్తాయి. అంతేకాదు ఐపీఎస్ అధికారులపై కూటమి అధికారంలోని వచ్చాక తీసుకున్న చర్యలను కూడా రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణించారు.
విద్యాసాగర్‌కు నోటీసులు
సీఐడీ ఛార్జ్‌షీట్ నేపథ్యంలో కుక్కల విద్యాసాగర్‌కు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. కేసు దర్యాప్తులో భాగంగా పలు కీలక అంశాలపై అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.
జత్వాని లేఖతో మరో మలుపు
సీఐడీ ఛార్జ్‌షీట్ నేపథ్యంలో జత్వాని ఓ లేఖ విడుదల చేసింది. తనను ఈ వ్యవహారంలో బలిపశువును చేశారని ఆమె అందులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే అడ్డంగా దొరికిపోయాక టీడీపీ, దాని అనుకూల మీడియా మళ్లీ కొత్త డ్రామాకు తెర తీస్తున్నట్లు స్పష్టమౌతోంది.
జత్వానీ కేసు గతంలో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అప్పట్లో టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు జత్వానీకి మద్దతుగా నిలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆ తర్వాత ఆమెకు స్టార్ హోటళ్లలో వసతి, విమాన ప్రయాణాలు, ప్రోటోకాల్ సౌకర్యాలు కల్పించడం కూడా హాట్‌టాపిక్‌గా మారింది. అంతేకాకుండా విజయవాడ దుర్గగుడిలో ప్రోటోకాల్ దర్శనం కల్పించడం తీవ్ర చర్చకు దారితీసింది. అయితే తాజాగా సీఐడీ ఛార్జ్‌షీట్‌లో జత్వానీపై బ్లాక్‌మెయిల్ ఆరోపణలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అంశాలు వెలుగులోకి రావడంతో.. కూటమి ప్రభుత్వం హడావుడి చేసి అభాసుపాలైందనే చర్చ నడుస్తోంది.
జత్వాని కేసు నేపథ్యంలో అప్పటి కీలక పోలీసు అధికారులపై చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. డీజీపీ స్థాయి అధికారి పీఎస్‌ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సీపీ క్రాంతిరాణా టాటా, డీసీపీ విశాల్ గున్నీ, ఏసీపీ హనుమంతరావులపై కేసులు నమోదు చేసి సస్పెండ్ చేశారు. తాజాగా సీఐడీ ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్న అంశాలతో ఈ కేసు మరోసారి రాజకీయ, న్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.


