జనసేనకు మళ్లీ భంగపాటు.. టీడీపీ నిర్ణయమే ఫైనలా? | TDP Janasens Seat Sharing 15 Percent Local Body Elections AP | Sakshi
Sakshi News home page

జనసేనకు మళ్లీ భంగపాటు.. టీడీపీ నిర్ణయమే ఫైనలా?

Jul 22 2026 11:24 AM | Updated on Jul 22 2026 12:32 PM

TDP Janasens Seat Sharing 15 Percent Local Body Elections AP

ఏపీలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేన పార్టీ పరిస్తితి ఏ  విధంగా ఉండబోతోంది? గౌరవమైన స్థాయిలో పోటీ చేసే అవకాశాన్ని జనసేనకు  టీడీపీ ఇస్తుందా?లేదా?అన్న చర్చ ఆ  పార్టీలో జరుగుతోంది. అసలు జనసేన బలం ఎంత అన్నదానిపై కూడా రకరకాల విశ్లేషణలు ఉన్నాయి. టీడీపీ వర్కింగ్ అద్యక్షుడు, కీలక మంత్రి నారా లోకేష్ వెల్లడించినట్లు వచ్చిన  ఒక సమాచారం ప్రకారం 80:15:5 నిష్పత్తులతో శాతాల ప్రకారం ఆయా స్థానిక సంస్థలలో టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య  సీట్ల పంపిణీ జరుగుతుంది. ఈ విషయాన్ని ఆయనే పార్టీ జోనల్ కోఆర్డినేటర్లకు స్పష్టం చేశారు. అంతకు కొద్ది రోజుల ముందు ఈ మూడు పార్టీల  సమన్వయ సమావేశంలో ఈ మేరకు అంగీకారం కుదిరి ఉండాలి. పార్టీ అధినేత,  ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆమోదించి ఉండాలి. లేకుంటే లోకేష్ ఈ విషయాన్ని బహిర్గతం చేసేవారా అన్న సందేహం వస్తుంది.  

ఈ వార్త మీడియాలో రాగానే జనసేన క్యాడర్ ఒక్కసారిగా నీరుకారిపోయిందని  చెబుతున్నారు. పార్టీలో  ఉన్న పలువురు స్థానిక నేతలు మంత్రి,పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ కు  ఫోన్ చేసి తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. దాంతో పార్టీ వైఖరిపై మనోహర్ కొంత వివరణ ఇచ్చారు. నిజానికి నాదెండ్ల మనోహర్ కూడా తమబలాన్ని బట్టే  సీట్ల పంపిణీ ఉంటుందని ఎప్పుడో చెప్పారు.  కాని పార్టీలో ఏర్పడిన అసంతృప్తిని దృష్టిలో ఉంచుకుని ఆయన తన స్వరం మార్చి అసెంబ్లీ ఎన్నికలలో అనుసరించిన ఫార్ములా ఇప్పుడు వర్తించదని పేర్కొన్నారు. జనసేన బలంగా ఉన్నచోట తమ పోటీ తప్పనిసరిగా ఉంటుందని అన్నారు.

అంటే లోకేష్ చెప్పిన ఈ నిష్పత్తి ప్రకారం 15 శాతం సీట్ల ఫార్ములాను ఒప్పుకోవడం లేదని చెప్పినట్లయింది. సీట్ల సర్దుబాటు విషయంలో ఎలాంటి చర్చ జరగలేదని,ఏ నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు. ఇది నిజమే అయితే లోకేష్ ఆప్రకటన ఎలా చేశారు అన్నది తెలియాల్సి ఉంది. కూటమి భాగస్వామ్య పార్టీలు ఏకపక్షంగా వ్యవహరించడం కుదరదని, అంతా సమన్వయంతోనే నిర్ణయం తీసుకుంటటామని మనోహర్  అన్నారు. జనసేనకు ఎంత బలం ఉందన్నదానిపై ఎవరు అంచనావేస్తారు? 2019,2024 ఎన్నికలలో ఆ పార్టీకి వచ్చిన ఓట్లు,సీట్ల ఆధారంగా చూస్తే  వారికి ఉన్న  బలం కన్నా లోకేష్ ఎక్కువ శాతం సీట్లనే కేటాయిస్తున్నట్లు  అనిపిస్తుంది. కాని జనసేన క్యాడర్ అంతా దీనిని అవమానంగా భావిస్తున్నది. 

జనసేనకు  ఆరేడుశాతం ఓట్లు మించి ఉండవన్నది ఒక అంచనా. గత ఎన్నికలలో జనసేన 21 సీట్లు గెలుచుకుంది. అంటే  ఆ రకంగా చూసినా వారికి లభించిన ఎమ్మెల్యే సీట్లు 12 శాతంగా ఉన్నాయి.అందులో కూడా టీడీపీకి చెందినవారికే  దాదాపు పదిమందికి అవకాశం ఇచ్చిన సంగతి గుర్తుంచుకోవాలి.ఉదాహరణకు అవనిగడ్డ,భీమవరం తదితర నియోజకవర్గాలు ఉన్నాయి.   పలు సందర్భాలలో పవన్ కళ్యాణ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనసేనకు బలం ఎక్కడిది అని ప్రశ్నించారు. జనసేనకు యంత్రాంగం ఉందా?వనరులు ఉన్నాయా?అంటూ రకరకాల సందేహాలను లేవనెత్తి ఆయనే జనసేన బలహీనతలను బయటపెట్టారు. అది పార్టీకి పరువు తక్కువ అని పార్టీ నేతలు  భావించినా,  ఆనాడు ఉన్న పరిస్థితిలో ఎవరూ మాట్లాడలేకపోయారు. నిజానికి అసెంబ్లీ ఎన్నికల సమయంలో జనసేనకు 50 సీట్లు, బీజేపీకి 25 సీట్లు కోరాలన్న ఒక  ప్రతిపాదన నడిచింది. ప్రత్యేకించి బీజేపీ నాయకత్వం ఈ సలహా ఇచ్చిందని చెబుతారు. 

కాని పవన్ కళ్యాణ్ తనపై తనకే నమ్మకం లేకపోవడంతో ,ఎలాగైనా తాను  ఎమ్మెల్యేగా గెలవాలన్న కోరికతో పార్టీ నైతిక స్థైర్యం దెబ్బతిన్నా పర్వాలేదన్నట్లుగా వ్యవహరించారు. అప్పుడే కనుక ఏ నలభై,ఏభై  సీట్లను డిమాండ్ చేసి ఉంటే,ఆనాడు  ఉన్న వాతావరణంలో టీడీపీ అంగీకరించి ఉండేదని కొందరి అభిప్రాయం. అలాగే ముఖ్యమంత్రి పదవిని షేరింగ్ అడగాలని చాలామంది జనసేన నేతలు, పవన్ కళ్యాణ్ అభిమానులు సూచించారు. తద్వారా కాపులలో కూడా ఒకరికి సీఎం.  అవకాశం వస్తుందని వారంతా ఆశించారు. ఇదే ప్రశ్నను అప్పట్లో లోకేష్  వద్ద మీడియా ప్రస్తావించగా, ముఖ్యమంత్రి  పదవిని షేర్ చేసుకోవడానికి టీడీపీ సిద్దంగా లేదని స్పష్టం చేసినట్లు కధనాలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ కు ఉప ముఖ్యమంత్రి పదవిని టీడీపీ పాలిట్ బ్యూరో లో చర్చించి నిర్ణయిస్తామని అన్నట్లుగా ఆ రోజుల్లో వార్తలు వచ్చాయి. దీనిపై పవన్ టీడీపీ నాయకత్వాన్ని నిలదీయలేకపోయారు.

 ఆ తర్వాత కాలంలో పవన్ కళ్యాణ్ కూడా దానికి తగ్గట్లుగానే సర్దుకుపోయినట్లు కనబడుతుంది. జనసేన క్యాడర్ కూడా పెద్దగా గొడవ చేయలేదు.ఇప్పుడు స్థానిక ఎన్నికలలో కేవలం 15 శాతం సీట్లే కేటాయిస్తే ,చాలామంది ఆశావహులు నష్టపోయే అవకాశం ఉంటుందని వారు  బాధపడుతున్నారు. ముందుగా కౌన్సిలర్, జడ్పీటిసి,ఎంపిటిసి  స్తానాలలో 15 శాతం చొప్పున కేటాయిస్తే జనసేన ఎన్నిటిలో గెలుస్తుంది?మున్సిపల్ చైర్మన్ ,జడ్పి చైర్మన్,మండల అధ్యక్ష పదవులు ఎన్ని   పొందగలుగుతుందన్నది చర్చనీయాంశం అవుతుంది. కనీసం 30 శాతం సీట్లు అయినా డిమాండ్ చేయాలని కొందరు జనసేన అబిమానులు వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఈ నేపధ్యంలో పార్టీ రహితంగా జరిగే  పంచాయతీ ఎన్నికలలో టీడీపీతో పాటు జనసేనకు చెందినవారు కూడా  పోటీ పడి తమ సత్తా చూపించే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం  ఉంది.

సెప్టెంబర్ నుంచి స్థానిక ఎన్నికల హడావుడి మొదలవుతుందని చెబుతున్నారు. ఈలోగానే ఆయా మున్సిపాల్టీలు, మండలాలు,జడ్పిల విషయంలో జనసేన క్లారిటీ తెచ్చుకోలేకపోతే ఆ పార్టీ కేవలం టీడీపీకి మద్దతు ఇచ్చే పార్టీగానే మిగిలిపోతుందన్న  అనుమానం జనసేనకు చెందిన పలువురిలో ఉంది. ఏది ఏమైనా రాజకీయాలలో ముందుచూపు ఉండాలి. తాత్కాలిక ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకుంటే అవి ఆ తర్వాత నష్టం చేసే అవకాశం ఉంటుందని జనసేన నాయకత్వానికి తెలిసి ఉండాలి. ఒకవేళ జనసేన కేవలం 15 శాతం స్థానాలకే   పరిమితం కావల్సి వస్తే  అది జనసేన  స్వయంకృతాపరాధం అవుతుంది తప్ప మరొకటి కాదు.

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement