హెల్త్
మేల్ ఇన్‌ఫెర్టిలిటీ
ముందే 'మేల్' ఎంచాలి!
ఇటీవల సంతానలేమి సమస్య బాగా పెరుగుతున్న నేపథ్యంతో పాటు ఈ నెల 25న ఐవీఎఫ్ / ఎంబ్రియాలజీ డే సందర్భంగా ‘సాక్షి’ వరుస కథనాలను వెలువరించింది. ప్రత్యేకంగా 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకు వచ్చిన వరుస కథనాల్లో సంతానలేమి కారణాలతో పాటు ఐవీఎఫ్ ప్రక్రియను ఎలా నిర్వహిస్తారు, అందులోని కాంప్లికేషన్లూ, నైతికాంశాలను విపులంగా చర్చించింది.
ఈ నేపథ్యంలో అత్యంత సంక్లిష్టమైన హార్మోన్ సైకిళ్లు కొనసాగే మహిళల్లో వచ్చే సమస్యలపై మరింత వివరమైన కథనాలొచ్చాయి. అయితే పురుషుల్లో సంతానలేమికి కారణాలపై చిన్న ప్రస్తావనలకే పరిమితమైనందున ఈ కథనంలో పురుషుల్లో పెరుగుతున్న వంధ్యత్వ సమస్యలు దంపతుల సంతానలేమికి ఏ మేరకు కారణమవుతున్నాయనే అంశంపై ఓ వివరణాత్మకమైన కథనమిది. నిజానికి దంపతుల్లో సంతానలేమి సమస్య ఉన్నప్పుడు పురుషులే తొలి చొరవ తీసుకోవాలని చెప్పడంతో పాటు... అందుకు కారణాలేమిటో తెలిపే కథనమిది.
సంతానలేమి సమస్య ఉన్న దంపతుల్లో మహిళలతో పాటు పురుషులూ అందుకు కారణం కావచ్చు. నిజానికి సంతానలేమికి మహిళలూ, పురుషులూ సమానంగా కారణం కావచ్చని గుర్తించాలి. అయితే పురుషాధిక్యత కారణంగా... ఇంత పురోగతీ, జెండర్ ఈక్వాలిటీ తర్వాత కూడా సమాజం ఇప్పటికీ మహిళలనే ఇందుకు బాధ్యులను చేస్తుండటం గమనించవచ్చు.
పురుషులలో సంతాన లేమికి కారణాలు
పురుషుల్లో సంతాన లేమికి కారణాలను ప్రధానంగా మూడు రకాలుగా చెప్పవచ్చు. అవి జీవనశైలికి సంబంధించినవీ, పర్యావరణ కారణాలూ, వైద్యపరమైన అంశాలు. వాటి గురించి వివరంగా...
జీవనశైలికి సంబంధించినవి...
పొగతాగడం, మద్యం వంటి దురలవాట్లు. (ఇవి శుక్రకణాల సంఖ్య, నాణ్యత, కదలిక (మొటిలిటీ)ని తగ్గిస్తాయి. మరీ ముఖ్యంగా పొగతాగడమనే అలవాటు శుక్రకణాల మొటిలిటీని విపరీతంగా ప్రభావితం చేస్తుంది).
కూర్చుని చేసే వృత్తులతో శారీరక శ్రమ లేకపోవడం, స్థూలకాయం (ఒబేసిటీ)
ఆధునిక జీవనశైలిలో ఉండే తీవ్రమైన ఒత్తిడి.
ఈ అంశాలన్నీ పురుషుల్లో హార్మోన్లపై దుష్ప్రభావం కలిగించి శుక్రకణాల (స్పెర్మ్) ఉత్పత్తిని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి/ చేస్తున్నాయి.
పర్యావరణ అంశాలు...
కాలుష్యం, వాతావరణంలోని విషపదార్థాలు (టాక్సిన్స్), భారలోహాల (హెవీమెటల్స్) తాలూకు దుష్ప్రభావాలు.
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, రకరకాల ఎలక్ట్రానిక్ ఉత్పాదనల ఉపయోగంతో వాతావరణంలోని రేడియేషన్... వంటి అంశాలూ స్పెర్మ్‌పై ప్రతికూలంగా పనిచేస్తుంటాయి. (ఉదాహరణకు సెల్‌ఫోన్ ప్యాంటు జేబులో పెట్టుకోవడం, ల్యాప్‌టాప్ ఒళ్లో పెట్టుకుని పనిచేయడం వంటివి స్పెర్మ్ కౌంట్‌ను తగ్గిస్తాయన్న పరిశీలనలూ, అధ్యయనాలూ ఉన్నాయి).
వైద్యపరమైన అంశాలు...
వృషణాల్లో రక్తనాళాలు ఉబ్బడం వల్ల కనిపించే వేరికోసీల్.
టెస్టోస్టెరాన్ మొదలగు హార్మోన్ సమస్యలు.
కొన్ని జన్యుపరమైన అంశాలు, పురుష ప్రత్యుత్పత్తి అవయవాల ఇన్ఫెక్షన్లు
కారణాలు తెలుసుకోవడం కోసం...
పురుషుల్లో సంతానలేమికి కారణాలను తెలుసుకోడానికి దంపతులకు మొట్టమొదటగా డాక్టర్ నుంచి కౌన్సెలింగ్ అవసరం. పరీక్షల కంటే ముందుగా ఇదే ఎందుకు అవసరమంటే... సాధారణంగా మన దేశంలో లైంగిక అంశాలపై విజ్ఞానం చాలా తక్కువ. పైగా లైంగికపరమైన సమస్యలూ, పరిష్కారాల కోసం నోరుతెరచి ఓపెన్‌గా మాట్లాడటానికి కొంత వెనకాడుతుంటారు. అందుకే దంపతులు మొట్టమొదట తమ మనసు విప్పి డాక్టర్ ఎదుటనైనా మాట్లాడేలా దంపతులను సంసిద్ధం చేయాలి. ఆ తర్వాత వారి లైంగిక జీవితం పై కొన్ని ప్రశ్నలు అడగాల్సి ఉంటుంది. నిజానికి లైంగిక జీవితంపై ప్రశ్నలు అనగానే దంపతులు సంకోచిస్తుంటారు. కానీ అవి వైజ్ఞానికంగానూ, ఏవైనా తప్పులు / లోపాలు ఉంటే కనుగొనేందుకు ఉపయోగపడేవిగానూ ఉంటాయని గుర్తించాలి. ఉదాహరణకు ఆ ప్రశ్నలెలా ఉంటాయంటే...
పురుషుల్లో సంతానలేమికి కారణాలు కనుక్కునే ముందర అసలు ఆ పురుషుడిలో అంగస్తంభన సరిగా ఉందా, లేదా?
ఒక నెలలో మహిళకు నెలసరి మొదలైన తర్వాత 10వ రోజు నుంచి 20వ రోజుల్లో ఎలాంటి ప్రొటెక్షన్ లేకుండా రోజూ గానీ లేదా రోజు తప్పించి రోజుగానీ క్రమం తప్పకుండా కలుస్తున్నారా?
కలయిక తర్వాత పురుషుడి వీర్యం మహిళలోకి సక్రమంగానే చేరుతోందా అన్నది తెలుస్తోందా?
పురుషుల్లో అంగస్తంభన సమస్య ఉన్నా, ఒకవేళ కలయిక సాధ్యమైనప్పటికీ... వీర్యం సక్రమంగా మహిళలోకి పూర్తిగా ప్రవేశించకపోయినా... ఆ మహిళకు ఎన్ని పరీక్షలు, చికిత్సలూ చేయించినా ప్రయోజనం ఉండదు. అందుకే పురుషుల్లో సాధారణంగా కనిపించే ఈ సమస్యలను యాండ్రాలజిస్ట్ / యూరాలజిస్ట్ ద్వారా ముందుగా పురుషుల విషయంలోనే తెలుసుకోవాలి.
సమాజపరంగా అందరి బాధ్యత ఇది...
ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే... ఒకవేళ పురుషుల్లో ఏదైనా సమస్య ఉన్నప్పటికీ అది కూడా మిగతా సాధారణ ఆరోగ్య సమస్యల్లాంటిదే. నిజానికి దాన్ని లోపంగా కూడా చూడకూడదు. అన్నిసాధారణ ఆరోగ్య సమస్యలకు చికిత్స ఎలా చేయిస్తారో, ఈ సమస్యకూ అలాగే చికిత్స అందించాలి. నిజానికి ఈరోజు అందుబాటులో ఉన్న వైద్యపరిజ్ఞానంతో లైంగిక సమస్యలను చక్కదిద్దడం దాదాపు పూర్తిగా సాధ్యమేనని గుర్తించాలి. అంతేతప్ప ‘మగ’తనం లోపమంటూ, మరొకటంటూ ఈ లైంగిక సమస్యను సమాజం చిన్నచూపు చూడకూడదు. అలా చూడటమూ సరికాదు.
తొలుత భౌతిక పరీక్షల (ఫిజికల్ ఎగ్జామినేషన్స్)తో మొదలు...
పురుషులతో మాట్లాడాక... ఫిజికల్ ఎగ్జామినేషన్స్‌గా పిలిచే కొన్ని భౌతిక అంశాల పరీక్షలు నిర్వహించాలి. ఇందులో... పురుషుల్లో సెకండరీ సెక్సువల్ కారెక్టరస్టిక్స్ అన్నీ సరిగా అభివృద్ధి చెందాయా అని చూడాలి. సెకండరీ సెక్సువల్ కారెక్టరిస్టిక్స్ అంటే... ఆ వ్యక్తికి మీసాలూ గడ్డాలూ బాగానే ఉన్నాయా, అతడి ప్యూబిక్ హెయిర్ పెరుగుదల సాధారణంగానే ఉందా, పురుషాంగం పరిమాణం కనీసంగా ఉందా, వృషణాల సైజ్ సాధారణంగానే ఉందా... లాంటి అనేక అంశాలను ఫిజికల్ ఎగ్జామినేషన్స్‌లో పరీక్షిస్తారు. ఇవన్నీ చేశాక ఆ తర్వాతి పరీక్షలకు వెళ్తారు.
తర్వాత నిర్ధారణ పరీక్షలు...
వీర్యపరీక్ష (సెమెన్ ఎనాలసిస్ టెస్ట్) : ఈ పరీక్షలో వీర్యకణాల సంఖ్య (కౌంట్), నాణ్యత (క్వాలిటీ), కదలికలు (మొటిలిటీ), వీర్యకణాల ఆకృతి (మార్ఫాలజీ) వంటి అంశాలు తెలుస్తాయి. ఈ పరీక్షకు ముందుగా కనీసం మూడు రోజుల పాటు కలయికగానీ లేదా హస్తప్రయోగంగానీ కూడదు. ఒక్కోసారి ఒక పరీక్షకూ మరో పరీక్షకూ కూడా పొంతన లేని ఫలితాలు ఉండకపోవచ్చు. అందుకే కేవలం ఒక పరీక్షతోనే సెమెన్ ఎనాలసిస్‌పై ఒక నిర్ధారణకు రాకూడదు. చాలా రకాల అంశాలు వీర్యపరీక్ష ఫలితాలపై ప్రభావం చూపిస్తాయి. ఉదాహరణకు... కొందరిలో సాధారణ జ్వరం వచ్చినప్పుడు కూడా వీర్యకణాల ఉత్పత్తి పడిపోయి, వీర్యకణాల సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లుగా ఫలితం వస్తుంది. అందుకే పూర్తి ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉన్నప్పుడే వీర్యపరీక్ష ఫలితాలు మెరుగ్గా వస్తాయి. అందుకే సెమెన్ టెస్ట్‌లో ఒక్కోసారి కేవలం పరీక్షకే పరిమితమయ్యే బదులు కొన్నిసార్లు డాక్టర్లు ఒకటికి రెండుసార్లు ఈ పరీక్ష చేయించే అవకాశం ఉండవచ్చు.
చికిత్స ప్రక్రియలు...
ఇన్ఫెక్షన్లు ఉండటం వల్ల వీర్యకణాల సంఖ్య తగ్గితే... యాంటీబయాటిక్స్ ఇవ్వడం.
హార్మోన్ల లోపం ఉంటే... దాన్ని భర్తీ చేసేందుకు అందుకు అవసరమైన హార్మోన్ చికిత్స అందిస్తారు.
వీర్యంలో అసలు వీర్యకణాలే లేకపోతే : నిజానికి వీర్యం అనేది వీర్యకణాలు జీవిస్తూ, చురుగ్గా కదలడానికి అవసరమైన ఒక ద్రవపు మీడియం మాత్రమే. దీన్ని ప్రోస్టేట్ గ్రంథి అండ్ సెమినల్ వెసికిల్స్ తయారు చేస్తాయి. సంతానానికి కారణమయ్యే ‘వీర్యకణాలు’ వృషణాల్లో ఉత్పత్తి అవుతాయి. అక్కడ పుట్టిన ఆ కణాలు, వాస్ డిఫరెన్స్ అనే సన్నటి గొట్టం ద్వారా వీర్యంలోకి చేరి, అందులో ఈదుతూ ఉంటాయి.
పురుషులకే తొలి పరీక్షలు మేలు...
నిజానికి సంతాన లేమి సమస్యలు ఉన్నప్పుడు తొలి పరీక్షలు పురుషులు చేయించుకోవడమే మంచిది. ఇలా చెప్పడానికి అనేక కారణాలతో పాటు అనేక ప్రయోజనాలూ ఉన్నాయి. అవేమిటంటే... పురుషుల్లో కారణాలు కనుగొనడం చాలా సులువు. ఖర్చు కూడా చాలా తక్కువ. మొదటే మహిళల్లో సమస్యల కోసం పరీక్షలు చేయిస్తే... పురుషుల విషయంలో చేయించాల్సిన పరీక్షల కన్నా అవి చాలా ఎక్కువ. పైగా అవన్నీ చేయించాక మహిళల్లో సమస్య ఏదీ లేదని తేలితే ఎంతో డబ్బు, శ్రమ, సమయం... ఇవన్నీ వృథా అవుతాయి.
మన సమాజంలోని పురుషాధిక్యతతో కూడిన వివక్ష, పురుషుడిలో సమస్య ఉందంటే... ముఖ్యంగా పల్లెల్లో పొరుగువారి నుంచి ఎదురయ్యే చిన్నచూపు వంటి అంశాలు పురుషుడు తన సమస్యను కప్పిపెట్టుకునేలా ప్రేరేపిస్తుంటాయి. నిజానికి సంతానలేమికి మహిళల్లో ఎన్ని కారణాలు ఉంటాయో వాస్తవానికి పురుషుల్లోనూ అన్నే ఉంటాయన్నది వైద్యపరంగా తేలిన సత్యం. అందుకే సంతానం లేని దంపతుల్లో... పురుషులే తొలి పరీక్షలు చేయించుకోవడం అని రకాలా ప్రయోజనకరం.
ఈరోజు అందుబాటులో ఉన్న వైద్యపరిజ్ఞానంతో లైంగిక సమస్యలను చక్కదిద్దడం దాదాపు పూర్తిగా సాధ్యమేనని గుర్తించాలి. అంతేతప్ప ‘మగ’తనం లోపమంటూ, మరొకటంటూ ఈ లైంగిక సమస్యను సమాజం చిన్నచూపు చూడకూడదు. అలా చూడటమూ సరికాదు.
కౌంట్‌ను ప్రభావితం చేసే దురలవాట్లు
సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ అలవాటు ఉన్నవారిలో కూడా వీర్యకణాల సంఖ్య తగ్గుతుంది. ఒత్తిడి కూడా వీర్యకణాల సంఖ్యను ప్రభావితం చేస్తుంది. అంతెందుకు... తీవ్రఒత్తిడిలో పనిచేసే వారిలో అంగస్తంభన సమస్య కనిపించడమన్నది చాలా సాధారణం. అంతేకాదు... వీళ్లలో వీర్యకణాల సంఖ్య, నాణ్యత, కదలికలు చురుగ్గా ఉండవు. ఈ కారణం వల్ల కూడా వాస్తవానికి పురుషుల్లో పరీక్షల కంటే ముందుగా యాండ్రాలజిస్ట్ ఆ దంపతుల సెక్స్ జీవితానికి సంబంధించిన వివరాల సేకరణకే ఎక్కువ ్రపాముఖ్యత ఇస్తుంటారు.
లైంగిక జీవితంపై ప్రశ్నలు అనగానే దంపతులు సంకోచిస్తుంటారు. కానీ అవి వైజ్ఞానికంగానూ, ఏవైనా తప్పులు / లోపాలు ఉంటే కనుగొనేందుకు ఉపయోగపడేవిగానూ ఉంటాయని గుర్తించాలి.
హార్మోన్ పరీక్షలు...
ఇందులో ఎఫ్‌ఎస్‌హెచ్, ఎల్‌హెచ్,ప్రోలాక్టిన్, టెస్టోస్టెరాన్. ఈస్ట్రోడియల్ ఈ ఐదు పరీక్షలూ చేయించడం వల్ల హార్మోన్ సమతౌల్యత ఉందా లేదా అన్న సంగతి తెలుస్తుంది. (నిజానికి ఒక టెస్టోస్టెరాన్ మినహా మిగతా వైద్య పరీక్షలు మహిళలకే చేస్తారనేది సాధారణ అపోహ. కానీ ఈ హార్మోన్లు మహిళలూ, పురుషుల్లో వేర్వేరు మోతాదుల్లో వెలువడి ఒక క్రమమైన సమతౌల్యతను నిర్వహిస్తుంటాయి. ఆ సమతౌల్యత సక్రమంగానే ఉందా లేక అసమతౌల్యతా ఉందా అని తెలుసుకునేందుకు పురుషులకూ ఈ హార్మోన్ పరీక్షలు చేస్తారు).
జన్యుపరమైన పరీక్షలు: సంతానలేమికి ఏవైనా జన్యుపరమైన కారణాలున్నాయా అని తెలుసుకునేందుకు చేసే పరీక్షలివి.
ఇమేజింగ్ పరీక్షలు: వీర్యంలో వీర్యకణాల సంఖ్య తగ్గినా లేదా వీర్యకణాలు నార్మల్‌గానే ఉండి పిల్లలు పుట్టకపోయినా డాక్టర్లు ‘స్క్రోటల్ అల్ట్రాసౌండ్ డాప్లర్’ అనే స్కానింగ్ పరీక్ష నిర్వహిస్తారు. ఇది ఏమాత్రం నొప్పి ఉండని సాధారణ పరీక్ష. దీనివల్ల వృషణాల పరిమాణం, వేరికోసిల్ సమస్య ఏదైనా ఉందా అని తెలుస్తాయి.
వేరికోసిల్ అంటే...
వృషణాల్లోని రక్తనాళాల వాపు. ఇది ఉన్నవారిలో చెడు రక్తం తీసుకెళ్లే రక్తనాళాలు (సిరలు) ఉబ్బిపోయి రక్త ప్రవాహం సరిగా లేకపోవడం. దీనివల్ల వీర్యకణాల సంఖ్య, నాణ్యత తగ్గుతాయి. ఈ సమస్యను ఓ సాధారణ శస్త్రచికిత్సతో చక్కదిద్దాల్సి ఉంటుంది. వేరికోసిల్ ఆపరేషన్ పూర్తయ్యాక దాదాపు 70 శాతం మంది పురుషుల్లో వీర్యకణాల సంఖ్య బాగా పెరిగే అవకాశం ఉంటుంది. మైక్రోస్కోప్ ద్వారా గజ్జల్లో చిన్న కోతతో చేసే ఈ సర్జరీని అనుభవజ్ఞులు నిర్వహిస్తే ఫలితాలు చాలా మెరుగ్గా ఉంటాయి. ఈ శస్త్రచికిత్స నిర్వహించిన మూడు నెలల తర్వాత ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశాలు పెరుగుతాయి.
వీర్యకణాలే లేని కండిషన్ ‘అజూస్పెర్మియా’
ఏవైనా కారణాల వల్ల కొందరి వీర్యంలో అసలు వీర్యకణాలే ఉండకపోవచ్చు. ఈ కండిషన్‌ను అజూస్పెర్మియా అంటారు. ఈ సమస్య ఉంటే గర్భం రాదు. ఎందుకంటే... 60 లక్షల నుంచి కోటికణాలు ఉండాల్సిన చోట ఒక్క కణం కూడా లేకపోతే గర్భం వచ్చే అవకాశం ఉండదు. అయితే ఇందుకు కారణాలను కచ్చితంగా కనుగొంటే... దీన్ని అధిగమించడం సాధ్యమే. వీర్యకణాలు లేవని రిపోర్టు వచ్చినప్పుడు నిర్ధారణ కోసం ఒక నెల తర్వాత మళ్లీ పరీక్షలు చేయించాలి. అప్పుడు కూడా వీర్యకణాలు లేవని రిపోర్ట్ వస్తే అప్పుడు టెస్టిక్యులార్ బయాప్సీ అనే పరీక్ష చేయాల్సి ఉంటుంది. ఇందులో వృషణాల్లోంచి ఒక చిన్న ముక్కను తీసి పరీక్షిస్తారు. అసలు వృషణాల్లో వీర్యకణాల ఉత్పత్తి జరుగుతుందో లేదో అన్నది ఈ పరీక్షతో తెలుసుకుంటారు.
వాస్ రిపేర్ (వాసో వాసాస్టమీ) : కొందరిలో వృషణాల్లో వీర్యకణాల ఉత్పత్తి జరుగుతూ ఉండి, అవి వీర్యరాశిలోకి రాని కండిషన్ కూడా ఉంటుంది. టెస్టిక్యులార్ బయాప్సీలో వృషణాల్లో వీర్యకణాలను ఉత్పత్తి చేసే శక్తి ఉందని తెలిశాక... ఆ వీర్యకణాలను వీర్యరాశి వరకు తీసుకొచ్చే నాళాన్ని (వాస్)ని రిపేర్ చేసి, కలయిక సమయంలో అవి బయటకు వచ్చేలా చేయవచ్చు. అయితే ఇది కాస్త సంక్లిష్టమైన శస్త్రచికిత్స ప్రక్రియ. వృషణాల్లో వీర్యకణాల తయారీ నార్మల్‌గా ఉందని తెలిశాకే ఈ సర్జరీ గురించి ఆలోచించాలి.
టెస్ట్‌ట్యూబ్ బేబీ కోసం : వీర్యకణాల తయరీ బాగుండి, మహిళలకు సమస్యలు ఉన్నప్పుడు... డాక్టర్లు వీర్యకణాల్లో నాణ్యమైన వాటిని సేకరించి, వాటిని ల్యాబ్ ఫ్రిజ్‌లో (క్రయో ప్రిజర్వేషన్ పద్ధతిలో) నిల్వచేసి నెలనెలా టెస్ట్‌ట్యూబ్ బేబీ ప్రక్రియ కోసం వీటిని ఉపయోగిస్తారు. సేకరించిన వీర్యకణలను కోల్డ్ స్టోరేజీలో పెట్టుకొని, ఇన్‌ఫెర్టిలిటీ సెంటర్‌లో టెస్ట్‌ట్యూబ్ బేబీ ప్రక్రియకు వెళ్తారు. ఇందులో వీర్యకణాన్ని, అండాన్ని టెస్ట్‌ట్యూబ్‌లో ఫలదీకరించి, ఆ పిండాన్ని మహిళ గర్భంలోకి ప్రవేశపెడతారు.
చివరగా... ఆరోగ్యకరమైన జీవనశైలి; మంచి సమతులాహారం; పరిశుభ్రమైన వాతావరణంలో నివాసం; శారీరకంగా శ్రమ చేస్తూ దేహానికి తగినంత వ్యాయామం ఇవ్వడంతో పాటు పొగతాగడం, మద్యం వంటి దురలవాట్లకు దూరంగా ఉండటం, మానసికంగా, శరీరకంగా ఒత్తిడికి దూరంగా ఉండటం వంటివి చేస్తుంటే... అసలు వైద్యపరీక్షలూ, చికిత్సలేమీ లేకుండానే సంతానాన్ని పొందే అవకాశాలుండవచ్చు. ఒకవేళ ఏవైనా సమస్యలు ఉన్నప్పటికీ ఇప్పుడున్న వైద్యవిజ్ఞానంతో దాదాపు ప్రతి సమస్యకూ పరిష్కారముందని పురుషులు గుర్తుంచుకోవడం అవసరం. చాలా ముఖ్యం కూడా.
- డా. రాఘవేందర్ కొస్గీ, సీనియర్ కన్సల్టెంట్, మైక్రో సర్జికల్ యూరో–యాండ్రాలజిస్ట్
నిర్వహణ: యాసిన్


