భారత్‌తో మ్యాచ్‌ రద్దు.. పాకిస్తాన్‌కు తప్పదు భారీ మూల్యం | ICC to lose This MASSIVE amount as Pakistan boycotts India match at T20 World Cup | Sakshi
Sakshi News home page

భారత్‌తో మ్యాచ్‌ రద్దు.. పాకిస్తాన్‌కు తప్పదు భారీ మూల్యం

Feb 2 2026 10:27 AM | Updated on Feb 2 2026 10:41 AM

ICC to lose This MASSIVE amount as Pakistan boycotts India match at T20 World Cup

భారత్‌తో టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌ రద్దు చేసుకొని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు చాలా పెద్ద సాహసం చేసింది. ఈ చర్య వల్ల ఐసీసీకి కలిగే నష్టం మాట అటుంచితే, పీసీబీ మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

ఈ విషయమై ఐసీసీ తీవ్రంగానే స్పందించింది. పీసీబీ ఇంకా అధికారికంగా తమ వైఖరిని తెలియజేయలేదని ప్రకటిస్తూనే.. ఈ నిర్ణయం పాకిస్తాన్ క్రికెట్ భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరించింది. 

క్రీడా సమగ్రతను దెబ్బతీసే ఇలాంటి చర్యలను అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో పీసీబీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని గట్టిగానే వార్నింగ్‌ ఇచ్చింది. ఐసీసీ తీసుకోబోయే చర్యలపై ఒకటి రెండు రోజుల్లో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

కాగా, పాకిస్తాన్‌ ప్రభుత్వం భద్రతా కారణాలను సాకుగా చూపుతూ ఫిబ్రవరి 15న కొలొంబో వేదికగా భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను (గ్రూప్‌ స్టేజీ) రద్దు చేసుకుంటున్నట్లు నిన్న సాయంత్రం అధికారికంగా ప్రకటించింది. తొలుత మెగా టోర్నీ మొత్తం నుంచి వైదొలుగుతామని బెదిరించిన పీసీబీ, చివరికి భారత్‌తో మ్యాచ్‌ మాత్రమే బాయ్‌కాట్‌ చేసుకుంటున్నట్లు స్పష్టం చేసింది.

వివాదం ఎక్కడ మొదలైదంటే..?
ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ రెహ్మ‌న్‌ను త‌ప్పించ‌డంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వ‌ర‌ల్డ్‌క‌ప్ కోసం త‌మ జ‌ట్టును భార‌త్‌కు పంపించేందుకు నిరాక‌రించింది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ త‌మ మ్యాచ్‌ల‌ను శ్రీలంకకు త‌ర‌లించాల‌ని ఐసీసీని బీసీబీ కోరింది. కానీ బీసీబీ విజ్ఞప్తిని ఐసీసీ తిరస్కరించింది.

భ‌ద్రత ప‌రంగా పూర్తి స్ధాయి హామీ ఇచ్చినా బీసీబీ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌లేదు. దీంతో ఐసీసీ వ‌ర‌ల్డ్‌క‌ప్ నుంచి బంగ్లాను త‌ప్పించి వారి స్దానంలో స్కాట్లాండ్‌ను చేర్చింది. ఈ నిర్ణయాన్ని తప్పుబడుతూ, బంగ్లాదేశ్‌కు మద్దతుగా పాకిస్థాన్ కూడా టోర్నీ నుంచి తప్పుకుంటామని పరోక్షంగా హెచ్చరించింది. చివరికి భారత్‌తో మ్యాచ్‌ను మాత్రమే రద్దు చేసుకుంటున్న ప్రకటించింది.

భారత్–పాకిస్తాన్ పోటీ ప్రాముఖ్యత  
- ఈ రెండు జట్ల మధ్య పోటీని “మదర్ ఆఫ్ ఆల్ బ్యాటిల్స్” అని పిలుస్తారు.  
- ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులు ఈ మ్యాచ్‌ను ఉత్కంఠగా వీక్షిస్తారు.

ఆర్థిక నష్టం అంచనా  
- ఈ మ్యాచ్‌ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా జరిగే వ్యాపారం వందల కోట్లలో ఉంటుంది.
- పాకిస్తాన్ నిర్ణయం ఐసీసీకి భారీ ఆర్థిక నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది.  
- క్రిక్‌బజ్‌ నివేదిక ప్రకారం.. ప్రతి భారత్ మ్యాచ్ విలువ సుమారు 10–11 మిలియన్ అమెరికన్ డాలర్లు (దాదాపు ₹100 కోట్లు) ఉంటుంది.  
- పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు వచ్చే సరికి ఈ ఆదాయం మరింత పెరుగుతుంది.  
- ఫిబ్రవరి 15న జరగాల్సిన భారత్‌-పాక్‌ మ్యాచ్‌ ద్వారా రూ. 200 కోట్లకు మించి ఆదాయం వస్తుందని నిర్వహకులు అంచనా వేశారు.
- మ్యాచ్ జరగకపోతే, ఐసీసీతో పాటు ప్రసార సంస్థలు భారీ నష్టాన్ని ఎదుర్కొంటాయి. దీని అంచనా రూ. 500 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తుంది.

పాకిస్తాన్‌కు కలిగే నష్టాలు
- భారత్‌తో మ్యాచ్‌ను రద్దు చేసుకోవడం వల్ల పాక్‌ క్రికెట్‌ బోర్డు ఆర్దికపరమైన నష్టాలతో పాటు పరిపాలనాపరమైన మరెన్నో కఠనమైన శిక్షలు ఎదుర్కొనే అవకాశం ఉంది. 
- టోర్నీలో పాల్గొన్నందుకు ఇచ్చే 250,000 డాల‌ర్లు(రూ. 2 కోట్లు పైమాటే) పార్టిసిపేషన్ ఫీజును పీసీబీ కోల్పోవాల్సి ఉంటుంది.
- పాక్ సెమీఫైనల్ చేరితే 790,000 డాలర్లు(సుమారు రూ. 7 కోట్లు), రన్నరప్ అయితే 1.6 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.15 కోట్లు), ఒకవేళ విజేతగా నిలిస్తే 3 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 25 కోట్లు) కోల్పోతారు.
- ఐసీసీ ప్రతి ఏటా తమ సభ్యదేశాలకు ఇచ్చే రెవెన్యూ వాటాను కూడా నిలిపివేసే అవకాశం కూడా ఉంది. అదే జరిగితే పాక్ క్రికెట్ బోర్డు దివాళా తీయాల్సిందే. 
- ఫైన‌ల్‌గా పాకిస్తాన్ త‌మ ప్ర‌ద‌ర్శ‌న బ‌ట్టి 250,000 డాలర్లు(సుమారు రూ.2.29 కోట్లు) నుంచి 4.42 మిలియన్ల డాల‌ర్లు(సుమారు రూ. 38 కోట్లు) ప్రైజ్ మనీని కోల్పోయే ప్రమాదం ఉంది.
- PSLకు ఇతర బోర్డులు NOCలు ఇవ్వకుండా ఆపుతుంది.
- ఆసియా కప్ నుంచి పాకిస్తాన్‌ను తొలగించే అవకాశం ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement