కృష్ణా జిల్లా: బడి పిల్లలకు స్టీలు గ్లాసులు పంపిణీ చేస్తామంటే పెద్ద మనుతో ఇస్తున్నారని అనుకున్నారంతా.. ఆనక ఆ గ్లాసులపై పార్టీ గుర్తులు వేసి ఇవ్వడంతో రాజకీయ ప్రచారానికా అంటూ ముక్కున వేలేసుకున్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలలో రాజకీయ గుర్తులకు, పార్టీ నేతలు, ఇతరుల ప్రవేశానికి పలు నిబంధనలు విధిస్తూ చంద్రబాబు సర్కారు ప్రత్యేకంగా జీవో విడుదల చేసింది.
నాయకులు, ఇతరులు పాఠశాలలో ప్రవేశించాలంటే తప్పనిసరిగా ప్రధానోపాధ్యాయులు లేదా ప్రిన్సిపల్ అనుమతి తప్పనిసరి. రాజకీయ గుర్తులకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుమతుల్లేవు. ఇందుకు విరుద్ధంగా శుక్రవారం కృష్ణాజిల్లా పెడన మండలం బల్లిపర్రు ఉన్నత పాఠశాలలో స్థానిక జనసేన నేతలు స్టీలు గ్లాసులపై జనసేన గుర్తు వేసి మరీ పంపిణీ చేయడం విమర్శలకు దారి తీసింది.
ఈ విషయం విద్యాశాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది. వాట్సప్ గ్రూపుల్లో రావడంతో జిల్లా విద్యాశాఖాధికారి సుబ్బారావు స్పందించి ఆ పాఠశాల ఉపాధ్యాయులను వివరణ కోరినట్లు తెలిసింది. ఉన్నతాధికారి ఆదేశాలతో కంగుతిన్న ఉపాధ్యాయులంతా విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి రాజీచేసుకునే ప్రయత్నాలు ప్రారంభించినట్లుగా సమాచారం.


