బజారులో దళారీ భోజ్యం!
గన్నవరంలో బహిర్గతం..
మార్కెటింగ్ సిబ్బందితో కుమ్మక్కు
కూరగాయలు తాము చెప్పిన వారి వద్ద కొనాల్సిందేనంటూ హెచ్చరికలు
కేజీకి రూ.4 చొప్పున నియోజకవర్గ ప్రజా ప్రతినిధులకు మామూళ్లు
సిండికేట్‌తో తీవ్రంగా నష్టపోతున్న వినియోగదారులు
సహకరిస్తున్న రైతు బజార్ల సిబ్బంది
పచ్చనేతల కబంధ హస్తాల్లో రైతు బజార్లు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: రైతు బజార్లపై ‘పచ్చ’ గద్దలు వాలిపోయాయి. మార్కెట్ సిబ్బందితో కుమ్మక్కై ఇష్టారాజ్యంగా దోపిడీ చేస్తున్నాయి. బజార్లలో షాపుల కేటాయింపు మొదలు, కూరగాయల సరఫరా వరకు అన్నీ తామై వ్యవహరిస్తూ అందిన కాడికి దండుకుంటున్నాయి. కనీసం రైతులు తాము పండించిన కూరగాయలను సైతం అమ్ముకోనివ్వకుండా, తాము చెప్పిన వారి వద్దే కూరగాయలు తీసుకోవాలని దుకాణాల నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఈ దందాలో విజయవాడకు చెందిన ఓ వ్యాపారి కీలకంగా వ్యవహరిస్తున్నారు.
అన్ని రైతు బజార్లలోనూ..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్నీ రైతు బజార్లలో ఈ దందా కొనసాగుతూనే ఉంది. నియోజకవర్గ ప్రజా ప్రతినిధులకు కూరగాయలపై కేజీకి రూ.4 చొప్పున నెలకు రూ. 25లక్షల నుంచి రూ. 35 లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదర్చుకుంటున్నారు. షాపుల కేటాయింపునకు దుకాణదారుల నుంచి రూ.4లక్షలు, స్థానికంగా రైతు బజార్ల పరిధిలో ఉండే పచ్చ నేతలకు నెలకు రూ.7లక్షల మామూళ్లు ముట్టజెబుతున్నట్లు సమాచారం. రోజువారీ మార్కెట్ ధరలు కూడా వారే నిర్ణయిస్తూ, మార్కెట్‌పై పెత్తనం సాగిస్తూ, రోజుకు లక్షల రూపాయలు దండుకొంటున్నారు.
జిల్లాలో ఇదీ పరిస్థితి..
మేం చెప్పిన వారి వద్దే కొనాలి..
ప్రధానంగా ఇంగ్లిష్ కూరగాయలుగా పేర్కొనే క్యారెట్, బీట్‌రూట్, క్యాప్సికం, బీన్స్, కీరతో పాటు పచ్చి మిర్చి, టమాట, అల్లం వంటి వాటిని రైతు బజార్లలో కొంత మంది వ్యాపారులు విజయవాడ, గుంటూరు, హనుమాన్‌జంక్షన్ తదితర ప్రాంతాల నుంచి తీసుకు వచ్చి, రైతు బజార్లలో దుకాణదారులకు హోల్‌సేల్‌గా విక్రయిస్తారు. ప్రస్తుతం అందుకు భిన్నంగా పచ్చనేతలు, మార్కెటింగ్ సిబ్బంది కుమ్మకై తాము చెప్పిన వారి వద్ద నుంచే కొనాలంటూ హెచ్చరిస్తున్నారు. గతంలో కూరగాయలు సరఫరా చేస్తున్న వ్యాపారులకు, ప్రస్తుతం మార్కెటింగ్ సిబ్బంది సూచిస్తున్న విజయవాడ వ్యాపారికి మధ్య గొడవలు తలెత్తడంతో విషయాలు బహిర్గతం అయ్యాయి.
అనధికారిక షాపులు..
విజయవాడ పటమట రైతు బజారులో అధికారికంగా 110 షాపులుండగా, అనధికారికంగా ప్రస్తుతం 200కు పైగా షాపులున్నాయి. ఇందులో ఫుట్‌పాత్‌లకు అటు, ఇటు కూడా షాపులున్నాయి. ఇక్కడ ఆ కూరగాయలు సరఫరా చేసే వ్యాపారి ఆధీనంలో ఏకంగా 24 షాపులు ఉన్నట్లు చర్చ సాగుతోంది. ఒక్కో షాపునకు రూ.4లక్షలు దుకాణదారుల నుంచి వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. పెనమలూరు, ఉయ్యూరు రైతు బజార్లు సైతం ఈ విజయవాడ వ్యాపారి ఆధీనంలో ఉన్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. విజయవాడలో రైతు బజార్లను పర్యవేక్షించే వారితోపాటు, అతను ఉన్నతాధికారులను సైతం బుట్టలో వేసుకొని ఆడింటి ఆట, పాడింది పాటగా దోపిడీ సాగిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతోపాటు విజయవాడ సెంట్రల్ నందిగామ నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
సాక్షి, టాస్క్‌ఫోర్స్: గన్నవరం రైతుబజార్ కేంద్రంగా టీడీపీ నేత సాగిస్తున్న దోపిడీ బహిర్గతమైంది. ఆ నేతకు విక్రయదారులు అడ్డం తిరగడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే నేతకు కూరగాయల సరఫరా అనుమతుల కోసం సాక్షాత్తూ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సిఫార్సు చేయడం గమనార్హం.
వివరాలు ఇవి..
రైతుబజార్‌లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బంగాళదుంప సరఫరా కాంట్రాక్ట్‌ను ఇటీవల ఎమ్మెల్యే సిఫార్సు మేరకు గన్నవరానికి చెందిన టీడీపీ నేత మోర్ల నాగబాబు నిర్వహిస్తున్నారు. రైతుబజార్ ఎస్టేట్ అధికారితో కుమ్మకై ్క ఆ నేత స్టాల్స్ నిర్వాహకులు తాను సరఫరా చేసే కూరగాయలనే విక్రయించాలని నిబంధన పెట్టారు. దీనికితోడు రైతుల వద్ద కొనుగోలు చేసే ధర కంటే అదనంగా వసూలు చేస్తున్నాడు. దీనివల్ల విక్రయదారులు ఆర్థికంగా నష్టపోతుండటంతో ఆ నేత వద్ద కూరగాయలు కొనుగోలు చేయమని తేల్చిచెప్పడంతో వివాదం మొదలైంది. అయినప్పటికీ నాగబాబు తన మనుషులతో విక్రయదారులను బెదిరింపులకు పాల్పడుతున్న ఆడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే రైతుబజార్ నిబంధనలకు వ్యతిరేకంగా నాగబాబుకు కాంట్రాక్ట్‌ను అప్పగించాలని ఎమ్మెల్యే సిఫార్సు లేఖను మార్కెంటింగ్ శాఖకు ఇవ్వడం వివాదాస్పదమైంది. ఇది చిలికి చిలికి గాలివానలా మారడంతో ఎట్టకేలకు ఉన్నతాధికారులు స్పందించి, ఆ కాంట్రాక్ట్ నుంచి నాగబాబును తాత్కాలికంగా తప్పించారు.


