‘రైజ్’తో మహిళల ఆర్థిక సాధికారత
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
గుంటుపల్లి(ఇబ్రహీంపట్నం): రూరల్ ఇంక్యుబేషన్ స్కిల్లింగ్ అండ్ ఆంత్రప్రెన్యూర్‌షిప్ (రైజ్) కేంద్రం ద్వారా మహిళల ఆర్థిక సాధికారతకు తోడ్పాటు లభిస్తుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. మండలంలోని గుంటుపల్లిలో రైజ్ కేంద్రాన్ని కలెక్టర్ లక్ష్మీశ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు నిర్వహిస్తున్న వివిధ శిక్షణ కార్యక్రమాలు ఆయన పరిశీలించారు. మహిళలకు అందిస్తున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఉపాధి అవకాశాలు, మార్కెటింగ్ సహకారం వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. మహిళలు రైజ్ కేంద్రంలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణ సదుపాయాలను పూర్తిగా వినియోగించుకుని స్వయం ఉపాధి కార్యక్రమాలు ప్రారంభించాలన్నారు. డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వీ నాంచారరావు, మహిళలు పాల్గొన్నారు.
పని ఒత్తిడితోనే డిజిటల్ అసిస్టెంట్ మృతి
వత్సవాయి: జగ్గయ్యపేట మండలం జయంతిపురం గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న గువ్వల అశోక్ పని ఒత్తిడి కారణంగానే మృతి చెందినట్లు సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ల సంఘ నాయకుడు వామన్‌నాయక్ పేర్కొన్నారు. అశోక్ మృతదేహానికి ఉద్యోగులతో కలిసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం టార్గెట్లు విధించడంతో పని భారంతో ఉద్యోగులు మానసిక సంఘర్షణకు గురై మరణిస్తున్నారన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 500మంది ఉద్యోగులు బలైనట్లు చెప్పారు. చిరుద్యోగులమైన తమపై ఇంత పని ఒత్తిడి పెట్టడం ప్రభుత్వానికి మంచిది కాదని, గతంలో ఇంత పని ఒత్తిడి టార్గెట్లు చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికై నా కళ్లుతెరిచి ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలంగా వ్యవహరించాలని కోరారు.
బడ్జెట్ సమావేశాల్లోనే జీతాలు పెంచాలి
గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే అంగన్‌వాడీలకు జీతాలు పెంచాలని ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్, ఏపీ ప్రగతి శీల అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (ఇఫ్టూ) డిమాండ్ చేశాయి. మంగళవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. సుబ్బరావమ్మ మాట్లాడుతూ.. అంగన్‌వాడీలు నిర్వహించిన 42 రోజుల చారిత్రక సమ్మె కాలంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలకు తక్షణమే సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. వేతనాలు రూ. 26వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత అనేకమార్లు సీఎం, మంత్రులకు, ఇతర ప్రజా ప్రతినిధులకు, ప్రభుత్వ ఉన్నతాధికారులకు విన్నవించినా నేటి వరకు వేతనాలు పెంచలేదన్నారు.
మహాశివరాత్రికి భారీ బందోబస్తు
కోనేరుసెంటర్: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లాలోని అన్ని శైవ క్షేత్రాల వద్ద భారీ బందోస్తును ఏర్పాటు చేస్తున్నట్లు కృష్ణాజిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్‌నాయుడు తెలిపారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ జిల్లాలో ప్రధానంగా ఏడు శైవ క్షేత్రాలు ఉన్నాయని, అక్కడ జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు పెద్ద సంఖ్య భక్తులు హాజరు అయ్యేందుకు అవకాశం ఉండటంతో ఆలయాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆలయ పరిసరాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టనున్నట్టు చెప్పారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మహాశివరాత్రిని భక్తిశ్రద్ధలతో జరుపుకునేలా పోలీసు శాఖ అన్ని చర్యలు తీసుకుంటుందని, ప్రజలు సహకరించాలని కోరారు.
‘రైజ్’తో మహిళల ఆర్థిక సాధికారత
‘రైజ్’తో మహిళల ఆర్థిక సాధికారత


