నకిలీ మద్యం కేసులో రిమాండ్ పొడిగింపు
విజయవాడలీగల్: నకిలీ మద్యం కేసులో గురువారం రిమాండ్ ముగియడంతో బెయిల్‌పై ఉన్న అద్దేపల్లి జనార్దనరావు, అద్దేపల్లి జగన్మోహనరావు, నకిరికంటి రవి, షేక్ అల్లాభక్షు, జోగి రమేష్, జోగి రాము తరఫున న్యాయవాదులు గైర్హాజరు పిటీషన్ దాఖలు చేయగా, మిగిలిన బాలాజి, శ్రీనివాసరెడ్డి, అంగలూరు కళ్యాణ్, చెక్కా సతీష్‌కుమార్, సుదర్శన్ న్యాయస్థానంలో హాజరయ్యారు. మదనపల్లి, నెల్లూరు, విజయవాడ జిల్లా జైళ్లలో రిమాండ్‌లో ఉన్న 12 మంది నిందితులను వర్చువల్‌గా విజయవాడలోని ఆరో అదనపు ఫస్టుక్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ న్యాయస్థానంలో ఎకై ్సజ్ పోలీసులు హాజరుపరిచారు. న్యాయమూర్తి లెనిన్‌బాబు ఈ నెల 19వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీచేశారు.
సుదర్శన్ న్యాయస్థానంలో హాజరు
నకిలీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న సుదర్శన్ తన భార్య గర్భవతిగా ఉన్నందున ఆమెను చూసుకునేందుకు పొందిన మధ్యంతర బెయిల్ గడువు గురువారం ముగియడంతో న్యాయస్ధానంలో హాజరయ్యాడు. అనంతరం సుదర్శన్‌ను నెల్లూరు జైలుకు తరలిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు.
జోగి సోదరుల బెయిల్ రద్దు పిటీషన్‌పై విచారణ వాయిదా
నకిలీ మద్యం కేసులో బెయిల్ పొందిన జోగి రమేష్, జోగి రాము బెయిల్ షరతులను ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఎకై ్సజ్ పోలీసులు వారిరువురి బెయిల్ రద్దు చేయాల్సిందిగా దాఖలు చేసిన పిటీషన్‌పై డిఫెన్స్ వారికి నోటీసులు అందించాలని ఆదేశిస్తూ 8వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి శుక్రవారానికి వాయిదా వేశారు.
గుణదల(విజయవాడ తూర్పు): ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన మాచవరం పోలీస్ స్టేషన్ పరిఽధిలోని మొగల్రాజపురంలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తూర్పు గోదావరి జిల్లా అనపర్తికి చెందిన శింగం సుబ్బారావు(35) వస్త్ర వ్యాపారం నిర్వహించే వాడు. ఇతనికి భార్య, ఒక బాబు ఉన్నారు. వ్యాపారంలో నష్టం రావడం వలన దాదాపు రూ.15 లక్షల వరకు అప్పులు చేశాడు. వత్తిడి పెరగటంతో కుటుంబ సమేతంగా అనపర్తి నుంచి విజయవాడకు వచ్చి జీవిస్తున్నాడు. ప్రస్తుతం ఏ పనీ లేకుండా ఖాళీగా ఉంటున్నాడు. మానసిక ఆందోళనకు గురై తాను ఉంటున్న గదిలో ఫ్యానుకు ఉరి బిగించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన భార్య స్థానికుల సహాయంతో పోలీసులకు సమాచారం అందించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి సుబ్బారావును ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షలు చేసిన వైద్యులు సుబ్బారావు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో మృత దేహాన్ని మార్చురీకి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
చాట్రాయి: మండలంలోని గుడిపాడులో గురువారం ఓ స్కూలు బస్సు బోల్తా పడడంతో పలువురికి గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలోని సిద్ధార్థ స్కూల్‌కు చెందిన బస్సు గుడిపాడు గ్రామంలో ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి రోడ్డు పక్కనున్న పంట బోదెలోకి బోల్తా కొట్టింది. దీంతో బస్సులోని ఎనిమిది మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ఒక విద్యార్థినికి పళ్లు కదిలి ఊడిపోయాయి. క్షతగ్రాతులను విస్సన్నపేటలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రమాద ఘటన విషయం తెలిసిన విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడకు చేరుకుని తమ పిల్లలను చూసి కన్నీటిపర్యంతమయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ డి.రామకృష్ణ తెలిపారు. వేగంగా బస్సులు నడపడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు.
విజయవాడ కల్చరల్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సృజనాత్మక సమితి ఆధ్వర్యంలో పరాభవ నామ సంవత్సర ఉగాది పురస్కారాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తునట్లు ఆ శాఖ సీఈవో ఆర్.మల్లికార్జునరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి నిపుణుల ఎంపిక మేరకు పురస్కారాలను ప్రదానం చేస్తామన్నారు. సాహిత్యం, సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, శిల్పం, నాటకం, జానపద, మిమిక్రీ, అవధానం, వైద్యం, ఇంద్రజాలం, మూకాభినయం, హరికథ, బుర్రకథ, జర్నలిజం సామాజిక సేవతోపాటు కమిటీ సిఫార్సు చేసిన వారికి పురస్కారాలను ప్రదానం చేస్తారని వివరించారు. గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అవార్డులు పొందిన వారికి అవకాశం లేదని చెప్పారు. చివరి తేదీ ఈనెల 20వ తేదీలోపు తమ దరఖాస్తులను ఆంధ్రప్రదేశ్ సృజనాత్మక సమితి, ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ నృత్య సంగీత కళాశాల, దుర్గాపురం, విజయవాడ అనే చిరునామాకు పంపాలని సూచించారు.


