తిరుపతమ్మ హుండీ ఆదాయం రూ.76.38 లక్షలు | - | Sakshi
Sakshi News home page

తిరుపతమ్మ హుండీ ఆదాయం రూ.76.38 లక్షలు

Apr 1 2026 8:30 AM | Updated on Apr 1 2026 8:30 AM

పెనుగంచిప్రోలు: స్థానికంగా వేంచేసి ఉన్న శ్రీతిరుపతమ్మవారికి భక్తులు రూ.76.38 లక్షల నగదును కానుకల రూపంలో సమర్పించారు. ఆలయంలోని హుండీల్లోని కానుకలను మంగళవారం అమ్మవారి మండపంలో లెక్కించారు. 48 రోజులకు గాను నగదు రూపంలో రూ.76,38,287, బంగారం 20 గ్రాములు, వెండి 375 గ్రాములు వచ్చినట్లు ఆలయ ఈఓ బి. మహేశ్వరరెడ్డి పేర్కొన్నారు. అలాగే యూఎస్‌ఏ డాలర్లు 34, సౌదీ రియాల్స్‌ 5, మలేషియా రింగిట్స్‌8, ఆస్ట్రేలియా డాలర్లు 175 వచ్చాయన్నారు. కానుకలను ఆలయ సిబ్బందితో పాటు పరిటాలకు చెందిన ఉమ సేవా సమితి సభ్యులు, గ్రామానికి చెందిన భక్తులు లెక్కించారు. కానుకల లెక్కింపును ఆలయ ఈఓతో గ్రూపు ఆలయాల ఈఓలు సీహెచ్‌ జయప్రకాష్‌బాబు, బీవీ సుబ్బారావుతో, ఏఈఓ జంగం శ్రీనివాసరావు, దేవదాయ శాఖ అధికారులు, ఉత్సవ కమిటీ మాజీ సభ్యులు పర్యవేక్షించారు.

చందాపురంలో కొనసాగుతున్న సర్వే

లబ్బీపేట(విజయవాడతూర్పు): కలుషిత ఆహారం తిని అతిసారకు గురైన నందిగామ మండలం చందాపురంలో వైద్యశాఖ అధికారులు, సిబ్బంది సర్వే కొనసాగుతోందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ మాచర్ల సుహాసిని మంగళవారం తెలిపారు. వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడంతో పాటు, వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. తాగునీటి పరిశుభ్రత, ఓవర్‌హెడ్‌ ట్యాంకులను ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం క్లోరినేషన్‌ చేయడం వంటి అంశాలను సిబ్బందికి తెలియజేస్తున్నారు. అతిసారలో వేర్వేరు ఆస్పత్రుల్లో చేరిన వారిలో కొందరు డిశ్చార్జి కాగా ఇంకా నలుగురు చికిత్స పొందుతున్నారు. వారిలో ఒకరు విజయవాడ జీజీహెచ్‌లో, ముగ్గురు నందిగామ సీహెచ్‌సీలో చికిత్స పొందుతున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ మాచర్ల సుహాసిని తెలిపారు.

ఉద్యోగ విరమణ చేసిన పోలీసు సిబ్బందికి సత్కారం

లబ్బీపేట(విజయవాడతూర్పు): సుధీర్ఘకాలం పాటు పోలీసు శాఖలో విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ చేసిన సిబ్బందికి పోలీస్‌ కమిషనరేట్‌లో మంగళవారం సత్కరించారు. పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ కేజీవీ సరిత వారిని సత్కరించారు. పదవీ విరమణ పొందిన వారిలో ఎస్‌ఆర్‌పేట ఏఎస్‌ఐ కె. సూర్యప్రకాశరావు, హోంగార్డులు పి. రాయప్ప, బి. వెంకన్న, ఎం. దుర్గాభవానీ ఉన్నారు. పోలీసు అసోసి యేషన్‌ అధ్యక్షుడు సోమయ్య పాల్గొన్నారు.

దొనబండలో ఎనిమిది రాతి క్వారీలు సీజ్‌

కంచికచర్ల: మండలంలోని పరిటాల శివారు దొనబండ రాతి క్వారీల్లో మైనింగ్‌ శాఖ అధికారులు మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా లారీల్లో మెటల్‌ తరలిస్తున్నారా లేదా అని లారీలను ఆపి తనిఖీ చేశారు. అనంతరం మైనింగ్‌శాఖ ఏడీ వీరాస్వామి మాట్లాడుతూ పర్యావరణ అనుమతులు తప్పనిసరిగా ఉండాలని, లేకపోతే సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధన మేరకు రాతి క్వారీలు నడపాలన్నారు. లారీలకు తప్పనిసరిగా పర్మిట్‌లు ఉండాలని లేకపోతే వాహనాలను కూడా సీజ్‌ చేస్తామని చెప్పారు. దొనబండ క్వారీల్లో పర్యావరణ అనుమతులు లేని 8 క్వారీలను సీజ్‌ చేశామన్నారు. కార్యక్రమంలో మైనింగ్‌ శాఖ సిబ్బంది, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement