ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వారి దర్శనానికి విచ్చేసే భక్తుల వాహనాల పార్కింగ్, టోల్‌గేట్ వసూలు చేసుకునేందుకు విజయవాడకు చెందిన సీఎస్‌ఆర్ ఎంటర్ ప్రైజర్స్ టెండర్‌ను దక్కించుకుంది. దుర్గగుడి ప్రాంగణంలోని మహామండపం ఆరో అంతస్తులో మంగళవారం పార్కింగ్, టోల్‌గేట్ నిర్వహణకు టెండర్ పక్రియ నిర్వహించారు. ఆలయ ఈవో శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణల పర్యవేక్షణలో ఏసీ రంగారావు, ఏఈవోలు ఎన్. రమేష్‌బాబు, చంద్రశేఖర్ టెండర్ పక్రియ కొనసాగించారు. మార్చి 31వ తేదీన ముగిసిన టెండర్‌కు గతంలో రూ. 1.74కోట్లు పలికింది. 22వ తేదీ సోమవారం టెండర్ పక్రియ నిర్వహించగా కాంట్రాక్టర్లు రూ. 2.01కోట్లు పలికింది. అయితే సరైన పాట రాలేదని భావించిన దేవస్థాన అధికారులు టెండర్‌ను వాయిదా వేసి, మంగళవారం వేలం ప్రక్రియను నిర్వహించారు.
టెండరుకు పోటాపోటీ..
రూ. 20లక్షలు ప్రథమ ధరావత్తు చెల్లించిన ఆరుగురు కాంట్రాక్టర్లు బహిరంగ వేలం పక్రియలో పాల్గొన్నారు. విజయవాడకు చెందిన ఎం.విజయ్‌చంద్ సప్లయర్స్, ఎస్ ఇంటీరియల్ అండ్ ఇన్‌ఫ్రా, సీఎస్‌ఆర్ ఎంటర్‌ప్రైజర్స్, కేదార్ జ్యూయలర్స్, అయ్యప్ప ఎంటర్‌ప్రైజర్స్, ఆదిత్య ఎంటర్‌ప్రైజర్స్ వేలంలో పాల్గొన్నారు. దేవస్థానం బహిరంగ వేలాన్ని రూ. 2.10కోట్ల నుంచి ప్రారంభించగా, కాంట్రాక్టర్లు పాటను తగ్గించాలని కోరారు. దీంతో రూ. 2.05 కోట్ల నుంచి పాట ప్రారంభం కాగా, రూ. 2.46కోట్లకు సీఎస్‌ఆర్ ఎంటర్‌ప్రైజర్ పాటను దక్కించుకుంది. ఇక సీల్డ్ టెండర్ బాక్స్‌లో ఇద్దరు కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేశారు. సీఎస్‌ఆర్ ఎంటర్‌ప్రైజర్స్ రూ. 2.21 కోట్లకు, కేదార్ జ్యూయలర్స్ రూ. 2.05కోట్లకు టెండర్ దాఖలు చేశారు. సీల్డ్ టెండర్‌లోనూ సీఎస్‌ఆర్ ఎంటర్‌ప్రైజర్స్ అధిక మొత్తానికి కోట్ చేసింది. ఇక ఆన్‌లైన్ టెండర్‌లో ఒక టెండర్ దాఖలు కాగా, అది అయ్యప్ప ఎంటర్‌ప్రైజర్స్ రూ. 2.22కోట్లకు దాఖలు చేసింది. దీంతో టెండర్‌ను సీఎస్‌ఆర్ ఎంటర్‌ప్రైజర్ దక్కించుకున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు.
ఉచితంగా పార్కింగ్..
కమిషనర్ అనుమతి వచ్చిన తేదీ నుంచి కాంట్రాక్టర్‌కు టోల్‌గేట్, పార్కింగ్ ఫీజు వసూలు చేసుకునే వీలు కల్పిస్తామని అధికారులు ప్రకటించారు. మరో వైపున మంగళవారంతో ప్రస్తుత కాంట్రాక్టర్ కాల పరిమితి ముగిసినందున, కొత్త కాంట్రాక్టర్ టెండర్‌కు కమిషనర్ అనుమతి వచ్చే వరకు పార్కింగ్‌ను ఉచితంగా అనుమతిస్తున్నట్లు ఆలయ ఈవో శీనానాయక్ ప్రకటించారు.
దుర్గగుడి పార్కింగ్, టోల్‌గేట్ టెండరు
సీఎస్‌ఆర్ ఎంటర్ ప్రైజర్స్ కై వసం


