భీతిల్లిన చల్లపల్లి | - | Sakshi
Sakshi News home page

భీతిల్లిన చల్లపల్లి

Apr 1 2026 8:30 AM | Updated on Apr 1 2026 8:30 AM

చల్లపల్లి: చల్లపల్లి భీతిల్లింది. స్థానిక పోలీస్‌ స్టేషన్లో భయానక వాతావరణం ఏర్పడింది. మంగళవారం ఉదయం అకస్మాత్తుగా పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పడిన పేలుడు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. పోలీస్‌ స్టేషన్‌ పరిసరాలను పూర్తిగా ధ్వంసం చేసింది. ఆ సమయంలో అక్కడ ఉన్న ఒక ఎస్‌ఐతో పాటు నలుగురు కానిస్టేబుళ్లను తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాల్జేసింది.

అసలు ఏమైందంటే..

గత దీపావళి సమయంలో అనుమతి లేకుండా టపాసులు అమ్ముతున్న వ్యాపారుల వద్ద నుంచి మందు గుండు సామగ్రిని స్వాధీనం చేసుకుని భద్రపరిచారు. తాజాగా దానికి సంబంధించి కోర్టులో కేసు కొట్టివేయటంతో ఆ మందుగుండు సామగ్రిని నిర్వీర్యం చేసేందుకు వాటిని తరలిస్తున్నారు. ఈ తరుణంలో ప్రమాదవశాత్తూ అవి ఒక్కసారిగా పేలిపోయాయి. దీంతో అక్కడే ఉన్న ఎస్‌ఐ దంపనపూడి దుర్గాంజనేయులు, కోర్టు కానిస్టేబుల్‌ షేక్‌ అబ్దుల్లా, ఎస్‌ఐ వాహనం డ్రైవర్‌ డి.నాగరాజు తీవ్రంగా గాయడ్డారు. పేలిన మందుగుండు సామగ్రి నుంచి వచ్చిన గులకరాళ్లు కాళ్లల్లో, చేతులకు, ఒంటికి గుచ్చుకుపోయాయి. షేక్‌ అబ్దుల్లా, నాగరాజుకు శరీర ముందు భాగంలో తీవ్ర గాయాలు కాగా విస్పోటనం కారణంగా ఏర్పడిన మంటలకు వారి ఇద్దరి శరీరాల్లోని ముందు అవయవాలు కాలిపోయియి. ఎస్‌ఐ దుర్గాంజనేయులుకు వెనుక భాగం, కాళ్లకు గాయాలు కాగా, తలభాగం కొంత వరకూ కాలిపోయింది. అక్కడే ఉన్న మరో హెడ్‌ కానిస్టేబుల్‌ కేటీడీవీ ప్రసాద్‌(తేజ)కు, లేడీ కానిస్టేబుల్‌ కె.శివపార్వతికి పేలుడుకు అందులోని గులకరాళ్లు వేగంగా వచ్చి తగలటంతో గాయాలయ్యాయి. అబ్దుల్లా, నాగరాజులను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా ఎస్‌ఐ దుర్గాంజనేయులు, శివపార్వతి, కేటీడీవి ప్రసాద్‌లను చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

భయానకంగా వాతావరణం..

పేలుడు కారణంగా స్టేషన్‌ ప్రాంగణం అంతా చిందరవందరగా మారింది. స్టేషన్‌ గోడలు బీటలు వారాయి, కిటికీలు అద్దాలు పగిలిపోయాయి. సీలింగ్‌, తలుపులు పగిలిపోయాయి. మొత్తంగా అక్కడ ఒక భయానక వాతావరణం నెలకొంది. ఐదు కిలోమీటర్ల దూరం వరకూ శబ్దం వినిపించిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

క్షతగాత్రులకు పరామర్శ..

కోర్టు ఆదేశానుసారం స్వాధీనం చేసుకున్న మందుగుండు సామగ్రిని నిర్వీర్యం చేసేందుకు చేస్తున్న ప్రయత్నంలో పోలీస్‌స్టేషన్‌ ప్రాంగణంలో పేలిపోయాయని ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చిన జిల్లా ఎస్సీ విద్యాసాగర్‌ నాయుడు తెలిపారు. క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం స్టేసన్‌ వద్ద ఆయన విలేకర్లతో మాట్లాడారు. గాయపడిన వారికి పూర్తిస్థాయిలో మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు. మెరుగైన వైద్యం నిమిత్తం ఎస్‌ఐ దుర్గాంజనేయులు, అబ్దుల్లా, నాగరాజులను గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ ఘటనా స్థలాన్ని, గాయపడిన వారిని పరామర్శించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అవనిగడ్డ సమన్వయ కర్త, మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు పోలీస్టేషన్‌లో జరిగిన ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

పోలీస్‌ స్టేషన్‌లో పేలుళ్లతో కలకలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement