520 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం
గన్నవరం రూరల్: రేషన్ బియ్యం అక్రమ నిల్వలపై అధికారులు దాడులు నిర్వహించి 520 బస్తాలు స్వాధీనం చేసుకున్నారు. గన్నవరం మండల సూరం పల్లి పారిశ్రామిక ప్రాంతంలో నిల్వ ఉంచిన రేషన్ బియ్యం బుధవారం తెల్లవారు జామున ఏలూరు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్‌ఐ నాగరాజు, ఆగిరిపల్లి పీడీఎస్ డీటీ జి.వెంకటేశ్వరరావు విజయవాడ వైపు రేషన్ బియ్యంతో వస్తున్న గూడ్స్ ఆటోను వెంబడిస్తూ వచ్చారు. ఆ వాహనం సూరంపల్లి పారిశ్రామికవాడ సమీపంలోని గోదాము దగ్గరకు వెళ్లి ఆగింది. వెనకే వెళ్లిన అధికారులు గోదాములోకి వెళ్లగా రేషన్ బియ్యం అని నిర్ధారించారు. వాళ్ల పరిధి కాకపోవ టంతో గన్నవరం పీడీఎస్ డీటీ అంకాలుకు సమాచారమిచ్చారు. ఆయన వీఆర్వో సందీప్‌తో కలసి గోదాము దగ్గరకు వచ్చారు. పామర్రు వాసి గొట్టపు రమేష్‌బాబుకు చెందిన గోదాములో 520 బస్తాల్లో 260 క్వింటాళ్ల రేషన్ బియ్యం అక్రమంగా నిల్వచేశారని గుర్తించారు. పలు ప్రాంతాల నుంచి రేషన్ బియ్యాన్ని తీసుకొచ్చి 50 కిలోల సంచుల్లో ప్యాకింగ్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పీడీఎస్ సంచుల్లోనే రేషన్ బియ్యం గోదాములో ఉన్నాయి. వీటితో పాటు అంగన్వాడీ చిన్నారులకు పౌష్టికాహారం కింద అందజేసే 2.5 కిలోల 14 బాలామృతం ప్యాకెట్లు కూడా ఉన్నాయి. చెందిన గౌడౌన్‌లో 260 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని ఉయ్యూరు తర లించారు. రేషన్ బియ్యం నిల్వచేసిన రమేష్‌బాబును గత అక్టోబర్‌లోనే అధికారులు పట్టుకున్నారు. మూడు నెల ల్లోపే మళ్లీ పట్టుబడటం గమనార్హం. ఆగిరిపల్లి ప్రాంతంలో రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం జరుగుతోందన్న విమర్శల నేపథ్యంలో ఈ ప్రాంతంపై ఏలూరు విజిలెన్స్ అధికారులు దృష్టిపెట్టారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం రాత్రి ఆగిరిపల్లి మండలం అడవినెక్కలంలో విజిలెన్స్, పీడీఎస్ ప్రత్యేక నిఘాలో రేషన్ బియ్యం తరలింపు గుట్టురట్టు అయ్యింది. రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వాహనాన్ని అధికారులు అడ్డుకోకుండా వాటిని వెంబడిస్తూ గోదాముకు చేరుకోవడంతో భారీ నిల్వ పట్టుబడింది. రేషన్ బియ్యం తరలిస్తున్న మూడు వాహనాలను సైతం సీజ్ చేసి గన్నవరం పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. సూరంపల్లి పారిశ్రామిక ప్రాంతంలో అనేక గోదాములు ఉండ టంతో అక్రమార్కులు విజయవాడ, ఆగిరిపల్లి వైపు నుంచి రేషన్ బియ్యాన్ని తీసుకొచ్చి, ఇక్కడ సంచుల్లో మార్పిడి చేసి వీటిని సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. వీరికి అధికారులు, రాజకీయ నాయకులు అండదండలు పుష్కలంగా ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


