ఉపాధ్యాయుల వేతన వ్యథలు!
వారి పొరపాటు.. వీరికి గ్రహపాటు
ఏడు మాసాలుగా పలువురు టీచర్లకు జీతాల్లేక ఇబ్బందులు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): విద్యాశాఖలో చోటు చేసుకున్న నిర్లక్ష్యం ఉపాధ్యాయుల పాలిట శాపాలుగా మారుతున్నాయి. అధికారుల అలసత్వంతో పలువురు ఉపాధ్యాయులకు ఏడు మాసాల నుంచి జీతాలు అందటం లేదు. ఒకవైపు పని భారం ఎక్కువై పలువురు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతూ రోగాల బారిన పడుతుంటే.. మరోవైపు మానవ తప్పిదాలతో గందరగోళం చేసి ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నారంటూ ఉపాధ్యాయ సంఘాల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. పదే పదే తప్పులు చేస్తున్న వారిపై ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవటంతో అవి తరచుగా కొనసాగుతున్నాయి.
అసలేం జరిగిందంటే..
జూన్ మాసంలో బదిలీల సందర్భంగా జరిగిన హేతుబద్ధీకరణలో భాగంగా పలువురు ఉపాధ్యాయులను విద్యాశాఖ వివిధ ప్రాంతాలకు బదిలీ చేసింది. అదేవిధంగా బదిలీల ప్రక్రియ అనంతరం ఉన్న సిబ్బంది, ఖాళీలను గమనించి పలువురిని మళ్లీ బదిలీ చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ క్రమంలో జి. కొండూరు మండలం నుంచి టి. లావణ్య (ఎస్జీటీ)ను విజయవాడ రూరల్ మండలం పీఎస్‌ఆర్ కాలనీ రామవరప్పాడుకు బదిలీ చేశారు. అలాగే అదే మండలం కవులూరు ప్రాథమిక పాఠశాల నుంచి టి. పూర్ణచంద్రరావు (ఎస్జీటీ)ను ఇబ్రహీంపట్నం మండలం కొటికలపూడి జెడ్పీ హైస్కూల్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. అదేవిధంగా సీహెచ్ రాజేశ్వరి (స్కూల్ అసిస్టెంట్)ను మల్కాపురం జెడ్పీ హైస్కూల్ నుంచి పెనుగంచిప్రొలు మండలం కొణకంచికి బదిలీ చేశారు. వీరితో పాటు ఈ విధంగా బదిలీ అయినటువంటి పలువురికి జీతాలను విద్యాశాఖ ఏడు మాసాల నుంచి నిలిపివేసింది.
నాలుగు మాసాల క్రితం ఇదే పరిస్థితి
నాలుగు మాసాల క్రితం ఇదే విధమైన పరిస్థితుల కారణంగా కొన్ని ఎయిడెడ్ విద్యాసంస్థల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు నెలల తరబడి జీతాలు నిలిచిపోయాయి. పదవీ విరమణ, ఉద్యోగోన్నతుల వల్ల ఆయా ఖాళీల్లో అర్హత ఉన్న వారికి పోస్టింగ్ ఇచ్చారు. విద్యాశాఖ ఆ తదుపరి చర్యలు తీసుకోవటంలో, ఉత్తర్వులు జారీ చేయటంలో గందరగోళం చేస్తోందని పలువురు నాయకులు మండిపడుతున్నారు. ఆ క్రమంలోనే ఐదారు మాసాల పాటు ఎయిడెడ్ ఉపాధ్యాయులకు జీతాలు నిలిచిపోవటంతో వారంతా నాయకుల ద్వారా ఉన్నతాధికారులను, ఇతర రాష్ట్ర స్థాయి కార్యాలయాలకు తిరిగి మామూళ్లను సమర్పించుకొని తిరిగి జీతాలు పొందినట్లు నాయకులు ఒకరిద్దరు వ్యాఖ్యానిస్తున్నారు.
దిద్దుబాటు చర్యలేవి?
ఇంత పెద్ద ఎత్తున గందరగోళం జరిగినా అధికారులు సరి చేయటంలో అలసత్వం వహిస్తున్నారని యూటీఎఫ్ నాయకులు విమర్శిస్తున్నారు. తప్పు చేసిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా సరిదిద్దటానికి ఏడు మాసాలు దాటినా పని జరగలేదంటూ వారు మండి పడుతున్నారు.
జిల్లా, మండల విద్యాశాఖాధికారులు చేసిన పొరపాట్ల వల్ల బదిలీల ప్రక్రియ అయిన తరువాత మళ్లీ ఉపాధ్యాయులను బదిలీ చేశారు. అయితే వారికి సంబంధించిన జీతాలు చెల్లించడంలో తగు ఉత్తర్వులు లేకపోవటం వల్ల ఏడు మాసాలుగా జీతాలు లేక ఆ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా దీనిపై ఎంతమంది అధికారులను కలిసినా స్పందించేవారు కరువయ్యారంటూ ఉపాధ్యాయ సంఘ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.


