నిత్యాన్నదానానికి విరాళాలు | - | Sakshi
Sakshi News home page

నిత్యాన్నదానానికి విరాళాలు

Feb 13 2026 5:33 AM | Updated on Feb 13 2026 5:33 AM

నిత్య

నిత్యాన్నదానానికి విరాళాలు

నిత్యాన్నదానానికి విరాళాలు జిల్లా స్థాయిలో చెస్‌, సైక్లింగ్‌ పోటీలు ఎస్‌ఎంసీలో స్టెమ్‌సెల్‌ దాతల నమోదు భవన నిర్మాణాలకు సత్వర అనుమతులు

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి గురువారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. హైదరాబాద్‌ అమీన్‌పూర్‌కు చెందిన వి.సుబ్బలక్ష్మి కుటుంబం అమ్మవారి దర్శనానికి విచ్చేసింది. వి. గున్నేశ్వరరావు పేరిట రూ. లక్ష, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఎం.ప్రసన్నదేవి కుటుంబం రూ. 1,01,116 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు.

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియం ఆవరణలో ఈ నెల 17వ తేదీన జిల్లా స్థాయి చెస్‌ పోటీలను, 22వ తేదీన నున్న జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ ఆవరణలో సైక్లింగ్‌ పోటీలను నిర్వహిస్తున్నామని ఎన్టీఆర్‌ జిల్లా క్రీడాభివృద్ధి అధికారి కె.కోటేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. అండర్‌–13, 15, 17, 19 విభాగాల్లో ఈ పోటీలు జరుగుతాయని, ఆసక్తి ఉన్న వారు ఈ నెల 16వ తేదీలోగా స్పోర్ట్స్‌. ఏపీ.జీవోవీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో ఆధార్‌ నంబరుతో వివరాలు నమోదు చేసుకోవాల్సిందిగా కోరారు. జిల్లా స్థాయి చెస్‌ పోటీల్లో ప్రతిభ చూపిన వారు ఈ నెల 21, 22 తేదీల్లో తిరుపతిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని, జిల్లా స్థాయి సైక్లింగ్‌ పోటీల్లో ప్రతిభ చూపిన వారు ఈ నెల 28వ తేదీ, మార్చి 1 తేదీన విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. ఇతర వివరాలకు 98661 34016లో సంప్రదించాల్సిందిగా కోటేశ్వరరావు కోరారు.

లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రాణాంతక వ్యాధులైన లుకేమియా, తలసీమియా, అప్లాస్టిక్‌ అనీమియా వంటి తీవ్రమైన రక్తసంబంధ వ్యాధులతో బాధపడుతున్న వారికి పునర్జన్మను ప్రసాదించే స్టెమ్‌సెల్‌ దాతల నమోదు కార్యక్రమం గురువారం ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల(ఎస్‌ఎంసీ)లో నిర్వహించారు. ధాత్రి బ్లడ్‌ స్టెమ్‌సెల్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 300 మంది వైద్య విద్యార్థులు స్టెమ్‌సెల్‌ డొనేషన్‌కు ముందుకు వచ్చి తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ధాత్రి ప్రతినిధి చావా రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ 2009లో తమ సంస్థను స్థాపించినట్లు తెలిపారు. ఇప్పటి వరకూ 6 లక్షల మంది వరకూ స్వచ్ఛంద దాతలు నమోదు అయ్యారన్నారు. అంతేకాకుండా ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న 1700 మందికి విజయవంతంగా స్టెమ్‌సెల్‌ మార్పిడి(ట్రాన్స్‌ప్లాంట్‌) సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఆలపాటి ఏడుకొండలరావు, కళాశాల పూర్వ విద్యార్థి డాక్టర్‌ బెల్లం శివప్రసాద్‌తో పాటు ధాత్రి వలంటీర్‌ గోకుల్‌ కృష్ణ పాల్గొన్నారు.

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): రాష్ట్ర ప్రభుత్వం ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ కార్యక్రమాన్ని స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌తో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కీలక నిర్ణ యాలు తీసుకుందని ఎన్టీఆర్‌ జిల్లా పరిశ్రమల అధికారి ఎం.మధు పేర్కొన్నారు. ఎంఎస్‌ ఎంఈ సేవారంగ సంస్థలకు భవన నిర్మాణ ప్రణాళికల అనుమతుల దరఖాస్తులను పారిశ్రామిక సంస్థలతో సమానంగా పరిష్కరించడంతో పాటు మినహాయింపులు కూడా అదే విధంగా ఉంటాయని ఆయన తెలిపారు. పట్టణ అభివృద్ధి ప్రాధికార సంస్థలు (యూడీఏ), పట్టణ స్థానిక సంస్థల (యూఎల్‌బీ) పరిధిలోని సేవారంగ ఎంఎస్‌ఎంఈలు ఉద్యమ్‌ పోర్టల్‌లో నమోదై ఉన్నట్లయితే ఈ వెసులుబాటు ఉంటుందని వివరించారు. ఆటోమొబైల్‌ సర్వీసింగ్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఆరోగ్య సేవలు, లాజిస్టిక్స్‌, హోటళ్లు (20 గదుల వరకు), ఫంక్షన్‌ హాళ్లు, లాండ్రీ–డ్రై క్లీనింగ్‌ సేవలు, గోదాము సేవలు, పర్యాటక సేవలు వంటి సేవల కార్యకలాపాలకు సంబంధించిన ఎంఎస్‌ఎంఈలకు తాజా నిర్ణయం ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు.

నిత్యాన్నదానానికి విరాళాలు 1
1/1

నిత్యాన్నదానానికి విరాళాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement