మెట్టినింట ప్రవేశించిన వీరమ్మతల్లి
ఉయ్యూరు: వీరమ్మతల్లి శ్రీ కనక చింతయ్య సమేతంగా మెట్టినింటిలోకి ప్రవేశించారు. 15 రోజులు పాటు వైభవంగా జరిగిన తిరునాళ్ల ముగియటంతో గురువారం ఉదయం ఆలయం నుంచి అమ్మవారు పల్లకీలో ఊరేగింపుగా తరలివెళ్లి మెట్టినింటిలో కొలువుదీరారు. తిరుగు ప్రయాణంలోనూ అమ్మవారు ఊయల స్తంభాల వద్ద ఊయల ఊగి.. ప్రధాన సెంటరు, రావిచెట్టు సెంటరు, కాలేజ్ రోడ్డు, కాపుల రామాలయం సెంటరుల్లో గ్రామోత్సవం జరుపుకొన్నారు. పల్లకీకి భక్తులు పసుపునీరు ఓరబోస్తూ హారతులు పట్టి స్వాగతం పలికారు. మెట్టినింటి వద్ద అమ్మవారి వంశస్తులు, భక్తులు వసంతోత్సవం జరుపుకొని, విగ్రహాలను మెట్టినింటిలో కొలువుదీర్చి పూజలు చేశారు. మహాశివరాత్రి రోజున అమ్మవారు ఐలూరు వద్ద కృష్ణానది పాయలో పవిత్రస్నానం ఆచరించి మరలా మెట్టినింటిలో ప్రవేశిస్తారు.


