లేబర్‌ కోడ్‌లు రద్దయ్యేంత వరకు పోరాటం | - | Sakshi
Sakshi News home page

లేబర్‌ కోడ్‌లు రద్దయ్యేంత వరకు పోరాటం

Feb 13 2026 5:33 AM | Updated on Feb 13 2026 5:33 AM

లేబర్‌ కోడ్‌లు రద్దయ్యేంత వరకు పోరాటం

లేబర్‌ కోడ్‌లు రద్దయ్యేంత వరకు పోరాటం

లేబర్‌ కోడ్‌లు రద్దయ్యేంత వరకు పోరాటం

దేశవ్యాప్త సమ్మెలో కార్మిక, రైతు సంఘాల నాయకులు

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాలు కార్మిక, రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని వామపక్ష పార్టీలు, కార్మిక, రైతు సంఘాలు మండిపడ్డాయి. కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లు కార్పొరేట్ల మేలు కోసమే తప్ప, కార్మికులకు ఏ మాత్రం ప్రయోజనం లేదని, వాటిని రద్దు చేసేంత వరకు పోరాటం సాగిస్తామని స్పష్టం చేశాయి. కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సమ్మెలో విజయవాడలో భారీ కార్మిక ప్రదర్శన జరిగింది. విజయవాడ వన్‌ టౌన్‌ రథం సెంటర్‌ నుంచి లెనిన్‌ సెంటర్‌ వరకు కార్మికులు, రైతులు ర్యాలీ నిర్వహించారు.

కార్పొరేట్లకు కట్టబెట్టేందుకే..

అనంతరం లెనిన్‌ సెంటర్‌లో జరిగిన సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడుతూ నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన 12ఏళ్లలో దేశంలో సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టే చర్యలకు శ్రీకారం చుట్టారన్నారు. కార్మికులు, సంఘాలు పెట్టుకోవడానికి, సమ్మె చేయడానికి, హక్కులకు భంగం కలిగితే అడిగేందుకు వీలు లేకుండా దుర్మార్గంగా నాలుగు లేబర్‌ కోడ్లు తీసుకొచ్చిందన్నారు. గతంలో పార్లమెంట్‌ చేసిన 29కార్మిక చట్టాలను రద్దు చేయడం దుర్మార్గమన్నారు. రైతులకు గిట్టుబాటు కల్పిస్తామని చెప్పారని, రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొచ్చారని దుయ్యబట్టారు. ఆ చట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఆందోళనలో 750మంది రైతులు చనిపోయారని, ఆ సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు.

35కోట్ల మంది కార్మికులు..

వైఎస్సార్‌ సీపీ ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీని వాసరావు, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.వి.నాగేశ్వరరావు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చేపట్టిన దేశ వ్యాప్త సమ్మెలో 35కోట్ల మంది కార్మికులు పాల్గొన్నారన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్‌ చేశారు. మోదీ కార్మిక వ్యతిరేక విధానాలు తీసుకురావడమే ఆలస్యం.. రాష్ట్రంలో ప్రభుత్వం వాటిని అమలు చేయాలని తహతహలాడుతోందన్నారు. ఏఐటీయూ సీ నగర కార్యదర్శి ఎం.సాంబశివరావు, సెంట్రల్‌ సిటీ సీఐటీయూ నగర ప్రధాన కె.దుర్గారావు అధ్యక్షతన జరిగిన సభలో సీపీఐ(ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ నాయకుడు పి.ప్రసాద్‌, లిబరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి డి.హరినాథ్‌, ఆర్‌ఎస్‌పీ రాష్ట్ర కార్యదర్శి జానకి రాములు, మరీదు ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement