గుర్తించకుంటే ప్రమాదకారి
నిశ్శబ్ద మహమ్మారి.. గుర్తించకుంటే ప్రమాదకారి క్యాన్సర్‌పై అవగాహన ముఖ్యం అంటున్న వైద్యులు లబ్బీపేట(విజయవాడతూర్పు): మన అలవాట్లు, శారీరక శ్రమలేని జీవనశైలి, పర్యావరణ కాలుష్యం వంటివి క్యాన్సర్ కారకాలుగా నిలుస్తున్నాయి. అంతేకాదు రంగు, రుచి కోసం ఆహార పదార్థాల్లో వాడుతున్న రసాయనిక రంగులు, పంటలకు విచ్చలవిడిగా వాడుతున్న పెస్టిసైడ్స్ కూడా క్యాన్సర్‌కు దారి తీస్తున్నాయి. వెరసి రోజు రోజుకూ క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. శాస్త్రవేత్తలు క్యాన్సర్‌కు అధునాతన వైద్య చికిత్సలను అందుబాటులోకి తీసుకు వస్తున్నప్పటికీ.. అనూహ్యంగా కేసులు పెరగడం, అవగాహన లేమి, సకాలంలో వైద్యం పొందలేక పోవడం వంటి కారణాలతో వ్యాధి బారిన పడిన అనేకమంది మృత్యువాత పడుతున్నారు. క్యాన్సర్‌పై విస్తృతంగా అవగాహన కలిగించి, ముందస్తు జాగ్రత్తలు, స్క్రీనింగ్ వంటి విషయాలను ప్రజలకు తెలియజేసేందుకు ఏటా ఫ్రిబవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినాన్ని నిర్వహిస్తున్నారు.
ప్రధాన రకాలు ఇవే..
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్‌తో పాటు ఒవేరియన్(గర్భాశయ) క్యాన్సర్‌లు ఎక్కువగా సోకుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. అలాగే పురుషుల్లో లంగ్ క్యాన్సర్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్, కడుపు–పేగుల క్యాన్సర్‌లు ఇటీవల కాలంలో ఎక్కువగా సోకుతున్నాయి. వీటితో పాటు బ్లడ్ క్యాన్సర్ కేసులు కూడా వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. క్యాన్సర్‌పై అవగాహనతో స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం ద్వారా తొలిదశలో గుర్తిస్తే పూర్తిగా నివారించవచ్చని వైద్యులు అంటున్నారు.
ముఖ్యమైన కారకాలివే..
క్యాన్సర్ సోకడానికి అనేక కారణాలు ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. వాటిల్లో ప్రధానంగా..
● పర్యావరణ కాలుష్యం
● మద్యపానం, పొగ తాగడం
● జంక్‌ఫుడ్, వాటిల్లో వినియోగించే రసాయనిక రంగులు వాడకం
● ఆహార పదార్థాల్లో పెస్టిసైడ్ అవశేషాలు
● విచ్చలవిడిగా ప్లాస్టిక్ వినియోగం
● వ్యాయామం లేని జీవనశైలి
● ఒబెసీటీ, జన్యుపరమైన లోపాలు, వంశపారంపర్యం వంటివి.
డబ్ల్యూహెచ్‌ఓ సూచనలివే..
● క్యాన్సర్‌పై ప్రజల్లో విస్తృత అవగాహన కలిగించాలి.
● అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను అందుబాటులోకి తేవాలి.
● క్యాన్సర్‌ను జయించేలా మానసికంగా ధృడంగా ఉండాలి.
● క్యాన్సర్ ప్రివెంటివ్ చర్యలు, స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలి.
● సర్వైకల్ క్యాన్సర్ వంటివి రాకుండా వ్యాక్సిన్‌లు వేయాలి.
ఒకప్పడు క్యాన్సర్ సోకిందంటే జీవితం ముగిసినట్లేనని భావించే వాళ్లు. కానీ ఇప్పుడు అధునాతన చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. మూడు, నాలుగో దశల్లో క్యాన్సర్‌ను గుర్తించినప్పటికీ ఇమ్యూనో థెరపీ, టార్గెట్ థెరపీ వంటి చికిత్సలతో పూర్తిగా నయం చేయడం, జీవితకాలాన్ని పొడిగించడం చేయగలుగుతున్నారు. అంతేకాకుండా క్యాన్సర్‌ను సూక్ష్మదశలో గుర్తించేందుకు అనేక అడ్వాన్స్‌డ్ పరికరాలు సైతం అందుబాటులోకి వచ్చాయి. రేడియాలజీ, పాథాలజీలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కీలకంగా మారి, క్యాన్సర్‌ను సూక్ష్మదశలోనే గుర్తించగలుగుతున్నారు.
క్యాన్సర్‌కు ఆన్సర్ ఉంది..
పటమటకు చెందిన రుఖ్మణమ్మ బ్రెస్ట్ క్యాన్సర్ మూడో దశలో గుర్తించారు. బ్రెస్ట్ నుంచి ఇతర ప్రాంతాలకు వ్యాప్తి ప్రారంభమైన దశలో శస్త్ర చికిత్స నిర్వహించారు. ఆమెకు అధునాతన థెరపీలు నిర్వహించడంతో పూర్తిగా కోలుకుని ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారు.
వన్‌టౌన్ ప్రాంతానికి చెందిన వ్యాపారికి జీర్ణకోశ క్యాన్సర్ వచ్చింది. మూడోదశలో ఉండటంతో వైద్యులు సవాలుగా తీసుకుని సర్జరీ చేశారు. అనంతరం అధునాతన థెరపీలు నిర్వహించడంతో క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇప్పుడు ఇలా ఎంతో మంది క్యాన్సర్‌ను జయిస్తున్నారు.
అవగాహన పెరగాలి...
క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన మరింత పెరగాలి. ప్రివెంటివ్ చర్యలను పాటించడంతో పాటు, స్క్రీనింగ్ ద్వారా తొలిదశలో గుర్తించవచ్చు. ప్రస్తుతం అధునాతన ఇమ్యూనోథెరపీ, టార్గెట్ థెరపీలతో మూడు, నాలుగో స్టేజ్‌లలో ఉన్న క్యాన్సర్‌లను కూడా కొందరిలో పూర్తిగా నయం చేయగలుగుతున్నాం. మరికొందరికి జీవితకాలాన్ని పొడిగించగలుగుతున్నాం. అధునాతన చికిత్సలు అందుబాటులోకి వస్తుండగా, క్యాన్సర్ కేసులు సైతం అదే రీతిన పెరుగుతున్నాయి. అప్రమత్తతతో ఉంటే ముందే గుర్తించే అవకాశం ఉంది.
నిశ్శబ్ద మహమ్మారి..
క్యాన్సర్‌పై అవగాహన ముఖ్యం అంటున్న వైద్యులు
అందుబాటులో అధునాతన చికిత్సలు..
జీవనశైలి, ఆహారపు అలవాట్లతో
పెరుగుతున్న కేసులు
ప్లాస్టిక్ వినియోగం, పెస్టిసైడ్స్
అవశేషాలతోనూ క్యాన్సర్
తొలి దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయొచ్చంటున్న వైద్యులు
– డాక్టర్ ఎన్. సుబ్బారావు,
క్యాన్సర్ వైద్య నిపుణుడు, విజయవాడ
1/2
గుర్తించకుంటే ప్రమాదకారి
2/2
గుర్తించకుంటే ప్రమాదకారి