నిజాయతీ చాటుకున్న గన్నవరం డిపో కండక్టర్
గన్నవరం: స్థానిక ఆర్టీసీ డిపోకు చెందిన కండక్టర్ కె.ఉదయభాస్కర్ బస్సులో ఓ ప్రయాణికురాలు పోగొట్టుకున్న బంగారు గొలుసును తిరిగి ఇచ్చి నిజాయతీని చాటుకున్నారు. వివరాలిలా వున్నాయి. గత నెల 31న ద్వారకాతిరుమల నుంచి విజయవాడ వెళ్తున్న గన్నవరం డిపోకు చెందిన బస్సులో మర్రిబందం గ్రామానికి చెందిన బాదం పెద్దింట్లమ్మ హనుమాన్‌జంక్షన్‌లో ఎక్కింది. అయితే ఆమె వద్ద ఉన్న నాలుగు కాసుల బంగారు గొలుసును బస్సులో పోగొట్టుకుంది. కండక్టర్ ఉదయభాస్కర్ సదరు గొలుసును గుర్తించి స్థానిక డిపోలో అప్పగించారు. ఈ నేపథ్యంలో పెద్దింట్లమ్మ సోమవారం స్థానిక డిపో అధికారులను సంప్రదించగా బంగారు గొలుసును డిపో మేనేజర్ పి.శివాజీ, సెక్యూరిటీ సిబ్బంది సమక్షంలో ఆమెకు అందజేశారు. సదరు కండక్టర్‌ను డీఎం, సూపర్‌వైజర్లు, సహచర సిబ్బంది అభినందించారు.


