డ్రగ్స్‌పై ఉక్కుపాదం
● ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నాం
● పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు
●7వ రోజు కొనసాగిన డ్రగ్స్‌పై దండయాత్ర సైకిల్‌ర్యాలీ
లబ్బీపేట(విజయవాడతూర్పు): డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపి, ఎన్టీఆర్ జిల్లాలో సమూలంగా నిర్మూలించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు అన్నారు. డ్రగ్స్‌పై దండయాత్ర పేరుతో ఐదుగురు మహిళా పోలీసులు జిల్లా వ్యాప్తంగా 510 కి.మీ పర్యటించేందుకు చేపట్టిన సైకిల్ ర్యాలీ సోమవారం సూర్యారావుపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో కొనసాగింది. ఈ సైకిల్ ర్యాలీకి పలు విద్యాసంస్థల విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీథర్ సీసీఈ కోచింగ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీపీ ఎస్‌వీ రాజశేఖరబాబు పాల్గొని మాట్లాడుతూ డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దుదామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీసీపీ కృష్ణకాంత్ పటేల్, ఏసీపీ పావన్‌కుమార్, ఎస్ ఆర్‌పేట సీఐ ఎండీ ఆలీ తదితరులు పాల్గొనారు.
ఏడోరోజు సాగిందిలా...
తొలుత మదర్ థెరిస్సా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కళాశాలలో సమావేశం ఏర్పాటు చేసి నర్సింగ్ విద్యార్థినులు, ఎస్‌టీఆర్‌ఎంసీ గులాబీ తోట, కొత్త వంతెన, దుర్గా అగ్రహారం, సాంబమూర్తి రోడ్డు, నక్కల రోడ్డు మీదుగా శ్రీధర్ కోచింగ్ సెంటర్‌కు చేరుకున్నారు. అక్కడ సమావేశంలో 1200 మంది విద్యార్థినీ విద్యార్థులతో డ్రగ్స్ వినియోగించడం వలన కలిగే నష్టాలు, ఎన్.డి.పి.ఎస్. చట్టాల గురించి వివరించారు.


