పారదర్శకంగా సేవలందించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రవాణా శాఖ ద్వారా ప్రజలకు అత్యంత పారదర్శకమైన, అవినీతి రహిత సేవలు అందించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. మంగళవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రవాణా శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్(ఐవీఆర్‌ఎస్) ద్వారా ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రవాణా శాఖ ద్వారా వాహనదారులకు అందించే సేవలు పూర్తిగా పారదర్శకంగా ఉండాలన్నారు. అవినీతికి ఎలాంటి ఆస్కారం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణలో ఏ శాఖలోనైనా అవినీతి జరుగుతున్నట్లు తేలితే సహించేది లేదని హెచ్చరించారు. జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల అభిప్రాయాలను సేకరించేందుకు క్యూఆర్ కోడ్‌తో కూడిన పోస్టర్లను అతికించాలని కలెక్టర్ సూచించారు. అధికారులు, ఉద్యోగులు అవినీతికి పాల్పడినట్లు తెలిస్తే, కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ లక్ష్మీశ స్పష్టం చేశారు.
ఉయ్యూరు రూరల్: జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బాలురు మృతి చెందిన ఘటన ఉయ్యూరు మండలం చిన్న ఓగిరాల వద్ద మంగళవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. కంకిపాడు మండలం తెన్నేరు గ్రామానికి చెందిన మానుకొండ పృధ్వీ తేజ(14), మానికొండ జానకి రామయ్య(14)తోపాటు తోట్లవల్లూరు మండలం వల్లూరుపాలెం గ్రామానికి చెందిన పిల్లం వెంకట్(17) బైక్‌పై మచిలీపట్నం నుంచి కంకిపాడుకు వెళుతున్నారు. ఈ క్రమంలో ఉయ్యూరు మండలం చిన్న ఓగిరాల వద్ద జాతీయ రహదారిపైగల డివైడర్‌పై ఉన్న మొక్కలకు వాటర్ ట్యాంకర్‌తో నీళ్లు పోస్తుండగా యువకుల బైక్ అదుపుతప్పి వాటర్ ట్యాంకర్‌ను ఢీకొట్టారు. దీంతో పృధ్వీ తేజ, పిల్లం వెంకట్ అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్రంగా గాయపడ్డ మానికొండ జానకి రామయ్యను స్థానికుల సాయంతో 108 వాహనంలో విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై ఉయ్యూరు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ లోకేశ్వరి తెలిపారు.


