క్యాన్సర్‌పై అవగాహన పెరగాలి
● ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
● విజయవాడలో వైద్య ఆరోగ్యశాఖ
ఆధ్వర్యంలో ర్యాలీ
లబ్బీపేట(విజయవాడతూర్పు): క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చని, అందుకు ప్రజల్లో అవగాహన పెరగాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ సదస్సు నిర్వహించారు. ఈ ర్యాలీని కలెక్టర్ లక్ష్మీశ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో క్యాన్సర్ ఒక ప్రధాన సవాల్‌గా మారిందన్నారు. ఏటా 14 లక్షల నూతన క్యాన్సర్ కేసుల వస్తుండగా, దాదాపు 9 లక్షల మరణాలు సంభవిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయన్నారు. నోటి, రొమ్ము గర్భాశయ క్యాన్సర్లు వంటి వాటిని ప్రారంభంలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చని, క్యాన్సర్ మరణాలను కూడా తగ్గించవచ్చన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 18ఏళ్లు నిండిన వారు 18.31 లక్షల మంది ఉండగా, వారిలో 5.49 లక్షల మందిని సర్వేలో పరీక్షించినట్లు తెలిపారు. వారిలో 2.40 లక్షల మంది సీ్త్రలకు రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ చేసినట్లు పేర్కొన్నారు. సిద్ధార్థ వైద్య కళాశాలలో ప్రివెంటివ్ అంకాలజీ యూనిట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఎక్కువగా ఇవే..
జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని మాట్లాడుతూ పురుషుల్లో ప్రోస్టేట్, గొంతు క్యాన్సర్, సీ్త్రలలో రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ ఎక్కువగా సోకుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్‌సీడీ–సీడీ సర్వే 4.0లో నోటి, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్‌ల స్క్రీనింగ్, క్యాన్సర్ సంరక్షణ చర్యల గురించి అవగాహన కలిగిస్తున్నట్లు తెలిపారు.


