సైబర్ నేరగాళ్ల ముఠా అరెస్ట్
పటమట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని భవానీపురం, కృష్ణలంక ప్రాంత వాసులకు డబ్బు ఎరగా చూపి వారితో వివిధ బ్యాంకుల్లో ఖాతాలు తెరిపించే సైబర్ ముఠాను కమిషనరేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు బుధవారం సైబర్ పోలీస్‌స్టేషన్‌లో సౌత్ ఏసీపీ డి. పవన్‌కుమార్, సైబర్ ఏసీపీ బి. రాజశేఖర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. తమకు వచ్చిన సమాచారం మేరకు యనమలకుదురు తాడిగడప డొంకరోడ్డుకు చెందిన రాయపాటి రవికుమార్, రాయపాటి స్టీఫెన్, యరగుంట్ల బాజీలు స్థానికులను ప్రలోభాలకు గురిచేసి వారితో బ్యాంక్ ఖాతాలను తెరిపిస్తున్నట్లు గుర్తించామన్నారు. వీరంతా ఈ బ్యాంక్ ఖాతాలను కేరళ, మహారాష్ట్ర గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, ఛత్తీస్‌ఘడ్ ప్రాంతాల్లో డిజిటల్ అరెస్ట్, ఇన్వెస్ట్‌మెంట్, ఫిషింగ్, విషింగ్, ఓటీపీ తదితర సైబర్ నేరాలకు వినియోగిస్తున్నారని చెప్పారు.
రిమాండ్‌కు నిందితులు..
యనమలకుదురు వద్ద తాము మెరుపుదాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుల వద్ద రూ.3.40లక్షల నగదు, రెండు ద్విచక్ర వాహనాలు, 21 సెల్‌ఫొన్‌లు, 46 ఏటీఎం కార్డులు, 21 చెక్‌బుక్‌లు, 16 పాస్‌బుక్కులు ఒక ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అరెస్ట్ చేసిన నిందితులను 3వ అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా ఆయన వారికి రిమాండ్ విధించారని వివరించారు.
పెనమలూరు: విధుల నుంచి ఇంటికి వస్తున్న ఆర్టీసీ డ్రైవర్ ప్రమాదానికి గురై మృతి చెందిన ఘటనపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం.. పోరంకి గ్రామానికి చెందిన భుక్యా బాలు(53) ఆర్‌టీసీలో గవర్నర్‌పేట డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతను మంగళవారం ఉదయం డ్యూటీకి వెళ్లాడు. తిరిగి రాత్రి ఇంటికి బైక్‌పై బయలుదేరి కామయ్యతోపు పెట్రోల్‌బంక్ వద్దకు రాగా.. అనారోగ్యానికి గురై బైక్‌పై నుంచి పడిపోయాడు. స్థానికులు ఈ సమాచారం కుటుంబ సభ్యులకు తెలుపగా విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో వైద్యానికై చేర్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. ఈ ఘటనపై భార్య పార్వతీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
పెనమలూరు: కానూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి చెందిన ఘటనపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం.. కానూరుకు చెందిన ఎం.వెంకటేశ్వరరావు కుమారుడు ఎం.శ్రీహర్షవర్థన్(15) కానూరు కెనడీ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 9వ తేదీన ఉదయం శ్రీహర్షవర్థన్ నడుచుకుంటూ పాఠశాలకు వెళ్లాడు. రాత్రి 7 గంటలకు మరలా నడుచుకుంటూ ఇంటికి తిరిగి వస్తుండగా రాజాచికెన్ సెంటర్ వద్ద ముగ్గురు వ్యక్తులు బైక్‌పై అతివేగంగా వచ్చి శ్రీహర్షవర్థన్‌ను ఢీ కొట్టారు. ఈ ఘటనలో తలకు బలమైన గాయమయింది. అతనిని ఆస్పత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఈ ఘటనపై తండ్రి వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.


