న్యాయం కోసం రోడ్డెక్కిన రైతులు
కంచికచర్ల: అమరావతి ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్) కోసం భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం కంచికచర్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. వ్యవసాయ కార్మిక రంగ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట కల్యాణ్‌తో పాటు పలువురు రైతు సంఘ నాయకులు మాట్లాడుతూ ఓఆర్‌ఆర్‌కు భూములు కోల్పోతున్న రైతులకు ప్రస్తుత బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం నాలుగు రెట్లు న్యాయ సమ్మతమైన పరిహారం అందజేయాలని, ఓఆర్‌ఆర్ వెడల్పు 70 మీటర్లకు కుందించాలని డిమాండ్ చేశారు. సారవంతమైన విలువైన భూము లు దుర్వినియోగం కాకుండా చూడాలన్నారు.
అమరావతిలో ప్లాట్లు ఇవ్వాలి..
ఓఆర్‌ఆర్‌లో కోల్పోతున్న భూములు సీఆర్‌డీఏ అమరావతి జోన్ పరిధిలో ఉన్నాయని ఈ ప్రాంతా న్ని ప్రొటెన్షియల్ ఏరియాగా గుర్తించాలన్నారు. అలైన్‌మెంట్ వెడల్పు 140 మీటర్ల నుంచి 70 మీటర్లకు కుదించాలని సమీప డోర్ నంబర్లలో నమోదైన విలువల ఆధారంగా భూముల ధరలు నిర్ణయించాలని బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం నష్ట పరిహారంతో పాటు అమరావతి రాజధాని ప్రాంతంలో రైతులకు ప్లాట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఓఆర్‌ఆర్ కోసం భూములను కోల్పోతున్న రైతుల రుణాలను మాఫీ చేయాలని తెలిపారు. ఈ మేరకు కంచికచర్ల తహసీల్దార్ కార్యలయంలో డీటీ మానసకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో రైతు సంఘ నాయకులు గంగిరెడ్డి రంగారావు, నన్నపనేని వీఎల్ నరసింహారావు, అల్లాడి కోటేశ్వరరావు, నన్నపనేని భాస్కరరావు, బుడ్డి సూర్యప్రకాష్, కపలవాయి సుబ్బారావు, సూర్యదేవర రమ తేళ్ల శ్రీనివాసరావు, చెన్నుపాటి కృష్ణ, చంద్రం, జొన్నలగడ్డ వీరబాబు, సాయిరాం, కాపా శ్రీనివాసరావు పాల్గొన్నారు.
కంచికచర్లలో ధర్నా


