రాష్ట్రానికి రూ.10,134 కోట్లు కేటాయింపు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026–27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్ట్‌ల అభివృద్ధికి రూ.10,134 కోట్లు కేటాయించినట్లు విజయవాడ డీఆర్‌ఎం మోహిత్ సోనాకియా తెలిపారు. కేంద్ర బడ్జెట్‌లో రైల్వే కేటాయింపులపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం న్యూఢిల్లీ నుంచి వర్చువల్‌గా విలేకరుల సమావేశం నిర్వహించారు. దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ డీఆర్‌ఎం మోహిత్ సోనాకియా, పలు విభాగాల సీనియర్ అధికారులతో కలసి డీఆర్‌ఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఆర్‌ఎం మాట్లాడుతూ 2026–27 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రికార్డు స్థాయిలో 10,134 కోట్లు బడ్జెట్‌లో కేటాంచినట్లు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.92,649 కోట్లతో మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ పనులు జరుగుతున్నట్లు వెల్లడించారు.
హై స్పీడ్ రైలు కారిడర్‌లు...
దేశవ్యాప్తంగా ఏడు హై స్పీడ్ రైలు కారిడర్‌లను ప్రకటించారని డీఆర్‌ఎం తెలిపారు. అందులో హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–చైన్నె రెండు హై స్పీడ్ రైలు కారిడర్‌లు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీదుగా వెళతాయని వివరించారు. వీటి కారణంగా రాష్ట్ర ప్రజలకు అపారమైన ప్రయోజనం చేకురనున్నట్లు తెలిపారు. ఈ రెండు హై స్పీడ్ కారిడర్‌లు ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించడంతో పాటుగా విద్య, ఆరోగ్యం, వ్యాపారం తదితర రంగాల అభివృద్ధికి దోహదపడే ఆర్థిక కారిడర్‌గా పనిచేస్తాయని వెల్లడించారు. సమావేశంలో ఏడీఆర్‌ఎంలు పి.ఈ ఉడ్విన్, కొండా శ్రీనివాసరావు, సీనియర్ డీసీఎం బి.ప్రశాంత్ కుమార్, పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు.


